పురందేశ్వరి ఒంటరి !

By KTV Telugu On 21 November, 2023
image

KTV TELUGU :-

పురందేశ్వరిని బీజేపీ లీడర్‌గా ఆ పార్టీ హైకమాండ్ పరిగణనిస్తుందా లేదా  అన్నది చాలా మందికి వచ్చే డౌట్. ఎందుకంటే ఏపీలో వైసీపీ నేతలు ఆమెను నానా మాటలంటున్నారు.  ఏపీ బ్రాండ్స్ మద్యాన్ని ఆమె తాగుతారనే మాట దగ్గర్నుంచి కుటుంబపరమైన విషయాల వరకూ అన్నింటినీ ప్రస్తావించి విమర్శిస్తున్నారు. కానీ ఆమెకు మద్దతుగా అటు   హైకమాండ్ నుంచి కానీ రాష్ట్ర నేతల నుంచి కానీ కనీస స్పందన రావడం లేదు.   ఇదే ప్రజల్ని కూడా ఆశ్చర్యపరుస్తోంది. సొంత పార్టీకి చెందిన ఓ రాష్ట్ర అధ్యక్షురాల్ని.. అదీ మహిళా నేతను అవమానిస్తూంటే పట్టించుకోవడం లేదు. ఆమె ఏపీలో అవకతవకలపై పూర్తి స్థాయిలో ఫిర్యాదులు చేస్తున్నా ఆలకించడం లేదు. మరి ఆమెను ఎందుకు పదవిలో నియమించారు ?

తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై.. డీఎంకే నేతల జాబితాను రెడీ చేసుకుని వారిపై దర్యాప్తు సంస్థలను  ప్రయోగిస్తూ ఉంటారు. ఆ పవర్ ఆయనకు ఇచ్చారు. కానీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరికి ఎలాంటి పవర్ ఇవ్వలేదు. .ఆమె వైసీపీ ప్రభుత్వంపై  చేసే పిర్యాదుల్ని కనీసం బీజేపీ పెద్దలు పట్టించుకోవడం లేదు. ఏపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు ఇచ్చారనే పేరే కానీ.. ఆమెకు ఇసుమంత కూడా సహకారం హైకమాండ్ ఇవ్వడం లేదు. ఏపీలో ఇసుక, మద్యం, అప్పుల  అవకతవకలపై ఆమె పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి పోరాడుతూనే ఉన్నారు. ఆర్థిక అవకతవకలు, మద్యం స్కాం గురించి ఎంత వివరణాత్మకంగా ఫిర్యాదులు చేసినా పట్టించకోవడం లేదు. ఇలా పట్టించుకోవడం లేదని ఆమెపై టీడీపీ ముద్ర వేసి ఘోరమైన విమర్శలు చేస్తున్నారు వైసీపీ నేతలు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై, కార్పొరేషన్ల రుణాలపైనా, ఆస్తులు తనఖా పెట్టి తెచ్చిన అప్పులు , ఇతర సావరీన్ గ్యారంటీలను  అన్నింటినీ పరిశీలించి  ఆర్థిక స్థితి  పైన ఫోరన్సిక్ ఆడిట్ నిర్వహించాలని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి .. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు రెండు సార్లు లేఖ రాశారు. రెండు సార్లు నేరుగా లేఖ ఇచ్చారు.  ఏపీ ప్రభుత్వ ఆర్థిక అవకతవకలన్నింటిపైనా   కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని తీవ్ర ఆర్థిక మోసాల విచారణ సంస్థ ద్వారా  దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. కానీ నిర్మలా సీతారామన్ పురందేశ్వరికే షాక్ ఇచ్చారు.  నిర్మలా సీతారామన్.. అప్పులపై.. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన లెక్కలను పార్లమెంట్ లో ప్రకటించి పురందేశ్వరి పరువు తీశారు. ఈ విషయాన్ని పురందేశ్వరి కూడా చెప్పుకుని బాధపడ్డారు.   నిర్మలా సీతారామన్‌కు పురందేశ్వరి ఇప్పటికి పలుమార్లు ఫిర్యాదులు చేశారు. కానీ.. తమ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా.., పార్లమెంట్ కు సైతం అరకొర సమాచారమే ఇస్తున్నారు నిర్మలా సీతారామన్. అయినా తప్పదన్నట్లుగా  ఫిర్యాదులు చేస్తూనే ఉననారు పురందేశ్వరి.

ఇక మద్యం స్కాం గురించి పూర్తి వివరాలతో లే్ఖ ఇచ్చారు. పెద్ద ఎత్తున మనలాండరింగ్ జరుగుతోందని ఆధారాలతో సహా బయట పెట్టారు. ఇదే విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖకు పిర్యాదు చేశారు. కానీ..  పట్టించుకున్న వారు లేరు. ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కాం వందల కోట్లలోనే ఉంటుంది. కానీ ఏపీలో జరిగింది మాత్రం వేల కోట్లలో ఉంటుంది.  మద్యం తయారీ, రవాణా, అమ్మకం సహా మొత్తం వైసీపీ నేతల గుప్పిట్లోనే ఉంది. పూర్తిగా క్యాష్ ట్రాన్సక్షన్స్ కే ప్రాధాన్యం ఇస్తున్నారు.   ఇసుక స్కాం విషయంలోనూ అంతే.  వందలు, వేల కోట్ల రూపాయల స్కాం జరుగుతోందని పురందేశ్వరి ఆరోపిస్తున్నారు.  కానీ ఫిర్యాదుల్ని బీజేపీ హైకమాండ్ పట్టించుకోవడం లేదు.  విచారణకు ఆదేశించడం లేదు. అంటే ఏపీలో.. వారికి  బీజేపీ కన్నా.. వైసీపీ నే ఎక్కువని అర్థమవుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ పురందేశ్వరి మాత్రం తన ప్రయత్నాలు తాను చేస్తూనే ఉన్నారు.

వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న పురందేశ్వరిని టార్గెట్ చేసి విజయసాయిరెడ్డి వంటి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.  సోమ వీర్రాజు  ఉంటే ఎంతో బాగుండేదంటున్నారు.  పురందేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. పురందేశ్వరిని టార్గెట్ చేసినా ఎవరూ మాట్లాడటం లేదు.   ఏపీ బీజేపీకి చెందిన సీనియర్ నేతలంతా  సైలెంట్ మోడ్ లో ఉన్నారు. సోము వీర్రాజు నుంచి జీవీఎల్ నరసింహారావు వరకూ ఎవరూ నోరు మెదపడం లేదు. గతంలో జీవీఎల్ ప్రతి వారాంతంలో హడావుడి  చేసేవారు. విశాఖలో కచ్చితంగా ప్రెస్ మీట్లు పెట్టేవారు. ఇప్పుడు ఆయన కూడా సైలెంట్ అయ్యారు. సత్యకుమార్ లాంటి నేతలు కూడా ఏపీ రాజకీయాలపై మాట్లాడటం తగ్గించారు.  దీంతో పురందేశ్వరి ఒంటరి పోరాటం చేస్తున్నారు.ఏపీలో వైసీపీనే .. తమ శాఖగా బీజేపీగా భావిస్తోందా ?  పురందేశ్వరి అధ్యక్షురాలిగా ఉన్న బీజేపీతో సంబంధం లేదని అనుకుంటోందా ?

వైసీపీతో బీజేపీ పెద్దలకు దగ్గర సంబంధాలు ఉన్నాయన్నది బహిరంగరహస్యం.  కేంద్రం నుంచి రావాల్సిన వాటి విషయంలో … ఏపీ ప్రభుత్వ పెద్దలు ఇబ్బంది పెట్టరు. పోలవరం ఆపేసినా పట్టించుకోలేదు. అమరావతిని తాము నిలిపివేసినా కేంద్రం అడగవద్దని ఒప్పందం చేసుకున్నారు . అన్ని బిల్లులకూ మద్దతు ఇచ్చారు.  అంటే సామంత పార్టీలాగా వైసీపీ ఉందన్నమాట. అందుకే ఆ పార్టీ జోలికి వెళ్లాలని బీజేపీ అనుకోవడం లేదు.  కానీ పురందేశ్వరి అలా అనుకోవడం లేదు. వచ్చే ఎన్నికల్లో పొత్తులతో పోటీ చేసి.. వైసీపీని ఓడించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ బీజేపీలో టీడీపీతో పొత్తు అంటే వ్యతిరేకించే వారు ప్రత్యేక కుంపటి పెట్టుకున్నారు.

పురందేశ్వరి వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇసుక పాలసీ, మద్యం పాలసీ, అప్పులు, ఆర్థిక స్థితిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అదే సమయంలో టీడీపీ విషయంలో సాఫ్ట్ గా వ్యవహరిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అరెస్టు విషయంలో పురందేశ్వరి ముందుగానే ఖండించారు. ఆ తర్వాత కూడా టీడీపీపై ఎలాంటి విమర్శలు చేయడం లేదు. కేవలం వైసీపీని టార్గెట్ చేస్తున్నారు. దీంతో ఆ బీజేపీ సీనియర్లు పురందేశ్వరి టీడీపీతో పొత్తు కోసమే పని చేస్తున్నారని అనుమానిస్తున్నారు. టీడీపీతో పొత్తు ఇష్టం లేని నేతలు పురందేశ్వరి కార్యాచరణను వ్యతిరేకిస్తున్నారు. అందుకే సైలెంట్ అయ్యారు.

ఏపీలో రెండు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ఓ ప్రాంతీయ పార్టీ బలహీనపడితే ఆటోమేటిక్ గా బీజేపీ బలపడుతుంది. అందులోనూ సామాజిక వర్గ సమీకరణాలు, ఇతర రాజకీయాలు చూస్తే టీడీపీకి ఎంత  బలహీనపడితే బీజేపీకి అంత బలమవుతుందని బీజేపీ నేతలు విశ్లేషిస్తున్నారు. ఇలాంటి సమయంలో  పార్టీని బలోపేతం చేద్దామన్న ఆలోచన కంటే.. తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉండి… పొత్తులు పెట్టుకునేందుకు పని చేస్తున్నారని..  పార్టీ హైకమాండ్ దృష్టికి ఈ విషయాలన్ని  తీసుకెళ్లాలని.. సీనియర్ నేతలంతా  ప్రయత్నిస్తున్నట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం  ఐదు రాష్ట్రాల ఎన్నికలప్రచారంలో బీజేపీ అగ్రనేతలు బిజీగా ఉన్నారు. డిసెంబర్ మూడో తేదీ తర్వాత..  ఏపీ బీజేపీ పంచాయతీని హైకమాండ్ ముందు  పెట్టి పార్టీని కాపాడాలని కోరాలని సీనియర్లు భావిస్తున్నట్లుగా చెబుతున్నారు.  అంటే పురందేశ్వరిని ఒంటరిని చేసే రాజకీయం.. పొత్తుల దగ్గరే ప్రారంభమైందన్నమాట.పురందేశ్వరికి అసలు ఏ మాత్రం సహకారం ఇవ్వకపోతే ఆమెను అధ్యక్ష పదవిలో ఎందుకు నియమించారన్నది పెద్ద ప్రశ్న. దీనికి సమాధానం ఎన్నికల నాటికి లభించే అవకాశం ఉంది…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి