భారత రాష్ట్ర సమితి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారు ?. ఈ మాటకు బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి ఒకటే సమాధానం వస్తోంది అదే.. కేసీఆర్ అని. కేటీఆర్ అదే చెబుతున్నారు.. హరీష్ రావు.. కవిత కూడా అదే చెబుతున్నారు. కానీ బీఆర్ఎస్‌లో జరుగుతున్న అంతర్గత పరణామాలు, జాతీయ మీడియాకు కేసీఆర్ ఇస్తున్న ఇంటర్యూల్లో ఉన్న సారాంశాన్ని కాస్త తరచి చూస్తే.. .కేటీఆర్ ను సీఎంను చేయడం ఖాయమన్న అభిప్రాయానికి రాజకీయవర్గాలు వస్తున్నాయి. ఎందుకంటే కేసీఆర్ నోట 70 ఏళ్లకు రిటైర్మెంట్ అనే పదం వచ్చింది. కేసీఆర్ నిజంగా రిటైర్మెంట్ తీసుకుంటారా లేదా అన్నది పక్కన పెడితే కేటీఆర్ ను సీఎంను చేయాలన్న లక్ష్యం మాత్రం ఉందని కేసీఆర్ నేరుగానే చెబుతున్నారు.
తెలంగాణలో ఎన్నికల హడావుడి ప్రారంభమైనప్పుడు ప్రధాని మోదీ నిజామాబాద్ సభలో కేసీఆర్ పై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల సారాంశం కేసీఆర్ తాను సీఎం పదవి నుంచి వైదొలుగుతానన్నారని తన కుమారుడ్ని సీఎం పీఠంపై కూర్చోబెట్టేందుకు సహకరించాలని కోరారన్నారు. ఇదేమైనా రాచరికమా అని చెప్పి పంపించానని మోదీ చెప్పారు. ఈ మాటల్ని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండించారు. తమ పార్టీ తరపున సీఎంగా కేటీఆర్ ను ప్రమాణం చేయించాలనుకుంటే.. మోదీ పర్మిషన్ ఎందుకని ప్రశ్నించారు. పలుమార్పు కేటీఆర్ సెటైర్లు కూడా వేశారు. కానీ ఇప్పుడు మోదీతో తాను కేటీఆర్ రాజకీయ భవిష్యత్ గురించి మాట్లాడింది నిజమేనని కేసీఆర్ అంగీకరించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాకు ఇంటర్యూలు ఇవ్వడం మానేశారు. పూర్తిగా ఎలాంటి అంశంలోనైనా కుమారుడు కేటీఆర్ నే ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీని భారత రాష్ట్ర సమితిగా మార్చినప్పుడు కూడా జాతీయ మీడియాకు ఇంటర్యూలు ఇవ్వలేదు. భారీ ఎత్తున ఖర్చు పెట్టి జాతీయ మీడియాలో ఇమేజ్ బిల్డింగ్ కోసం ఓ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు కూడా. ప్రత్యేకంగా ఓ జర్నలిస్టును పీఆర్వోగా నియమించుకున్నారు. ఢిల్లీలో పార్టీ ఆఫీసు ప్రారంభించినప్పుడు వరుసగా జాతీయ మీడియాకు ఇంటర్యూలు ఇస్తారనుకున్నారు. ఇవ్వలేదు. కానీ తొలి సారిగా ఇండియా టుడే మ్యాగజైన్ కు మాత్రం ఇంటర్యూ ఇచ్చారు. ఇండియా టుడే ఇంగ్లిష్ మ్యాగజైన్ ఎన్నికలు జరుగుతున్న ఐదురాష్ట్రాల్లో తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ప్రత్యేకహోదా ఇస్తూ భారీ ఇంటర్యూ కవర్ చేసింది. మంచి పబ్లిసిటీతో మార్కెట్లోకి వచ్చింది. అయితే అందులో ఉన్న అంశాలు చాలా వరకూ కేసీఆర్ ను , బీఆర్ఎస్ ను ప్రమోట్ చేసేలా ఉన్నా కొన్ని కీలకమైన అంశాలపై కేసీఆర్ చెప్పిన నిజాలు మాత్రం చర్చనీయాంశం అవుతున్నాయి.
కేసీఆర్ ఈ ఇంటర్యూలో తన రిటైర్మెంట్ గురించి మాట్లాడారు. 70 ఏళ్లకు రిటైర్మెంట్ తీసుకోవాలని అనుకుంటున్నట్లుగా చెప్పారు. అయితే కేసీఆర్ ఈ మాట మీడియా ప్రతినిధులతో చెప్పలేదు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతోనే చెప్పారు. మోదీ ఎన్నికల ప్రచారసభలో చెప్పిన అంశాలపై ఇంటర్యూలో ఇండియా టుడే ప్రతినిధులు ప్రశ్నించారు. అది నిజమేనని కేసీఆర్ అంగీకరించారు. 70 ఏళ్లకు తాను రిటైర్ కావాలనుకుంటున్నానని.. కేటీఆర్ ను ఆశీర్వదించాలని అందుకు సహకరించాలని ప్రధాని మోదీని కోరినట్లుగా చెప్పారు. అంటే.. కేసీఆర్ రిటైర్మెంట్ ఆలోచనలు… కేటీఆర్ ను సీఎం చేయాలనుకున్న అంశాలు నిజమేనని క్లారిటీ ఇచ్చినట్లయింది. తమ మధ్య జరిగిన ప్రైవేటు సంభాషణ ను మోడీ బయటపెట్టడం ఎంత వరకూ కరెక్ట్ అని ప్రశ్నించారు. ఈ అంశంలో ప్రధాని నైతిక విలువలపై చాలా విశ్లేషణలు వచ్చాయి .. కానీ ఇక్కడ కేటీఆర్ ను సీఎం చేయాలనుకుంటున్నది నిజమని స్పష్టత వచ్చింది.
కేటీఆర్ సీఎం అనే నివాదం చాలా సార్లు తెరపైకి వచ్చింది. గత నాలుగైదేళ్ల నుంచి కాబోయే సీఎం కేటీఆర్ అనే మాట బీఆర్ఎస్ నేతల నోటి నుంచి తరచూ వస్తూ ఉంది. ఇలాంటి ప్రకటనలు చేయాలంటే.. ఆషామాషీగా చేయరు. వారికేదో సంకేతాలు వస్తేనే చేస్తారు. ఎర్రబెల్లి సహా కీలక మంత్రులు కేటీఆర్ సీఎం అనే ప్రకటనలు చేశారు. తెలంగాణ మంత్రుల ప్రకటనలు వ్యూహాత్మకమేనని చెప్పక తప్పదు. ఈ ఏడాది మార్చిలో ఓ సారి ఇక కేటీఆర్ ప్రమాణస్వీకారమేనన్నంత హడావుడి జరిగింది. కొన్ని రోజులు దీనిపై చర్చ జరిగిన తర్వాత కేసీఆర్ ఆ అంశంపై మాట్లాడవద్దని ఆదేశించడంతో సైలెంట్ అయ్యారు. ఎన్నికలకు ముందు రిస్క్ ఎందుకనుకున్నారేమో కానీ.. ఆగిగపోయారు.
ఎన్నికల్లో గెలిస్తే కేటీఆరే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారా ? అందుకే ఇప్పుడు తాను ప్రధానితో మాట్లాడిన విషయాన్ని చెప్పారా ? దళిత ముఖ్యమంత్రి విషయంలోనూ తాము మాటకు కట్టుబడి ఉంటామని కేసీఆర్ ఎందుకు చెబుతున్నారు ?
బీఆర్ఎస్ గెలిస్తే కేసీఆరే సీఎం అవుతారని తాను కాదని కేటీఆర్ పదే పదే చెబుతున్నారు. మీడియా సంస్థలకు ఇంటర్యూలు ఇచ్చి చెబుతున్నారు. మీడియా ప్రతినిధులతో చిట్ చాట్‌లు చేసి అదే చెబుతున్నారు. బీఆర్ఎస్‌లో సీఎం అభ్యర్థులు చాలా మంది ఉన్నారు కానీ.. కేసీఆర్ జీవించి ఉన్నంత వరకూ ఆయనే సీఎం అని ఖరాఖండిగా చెబుతున్నారు.మరో వైపు విపక్ష పార్టీలన్నీ కేటీఆర్ ను సీఎం చేయాలని కేసీఆర్ చూస్తున్నారని ప్రచారం చేస్తున్నాయి. విపక్ష పార్టీల ప్రచారాన్ని కేటీఆర్ నిర్మోహమాటంగా ఖండిస్తున్నారు. కేటీఆర్ ఎందుకు అంత కంగారు పడుతున్నారో బీఆర్ఎస్ నేతలకూ అర్థం కావడం లేదు. ఎందుకంటే కేటీఆర్ ను సీఎం చేయడానికి కేసీఆర్ సరైన సమయం కోసం చూస్తున్నారన్నది వారికి తెలుసు. మరి ఎందుకు ఇంత ఖండిస్తున్నారు ? . రాజకీయ వారసత్వం అంటే ప్రజల్లో కాస్త వ్యతిరేకత ఉంటుది. తన తర్వాత తన కుమారుడు సీఎం అవుతారని కేసీఆర్ ప్రకటిస్తే.. అది ఓటర్లలో వ్యతిరేకతకు దారి తీస్తుంది. అందుకే ఎట్టిపరిస్థితుల్లోనూ తాను సీఎం కానని చెబుతున్నారు.
కానీ ఎన్నికల్లో గెలిచిన తరవాత పరిస్థితి మారిపోతుంది. ప్రజలే కేటీఆర్ ను సీఎం ను చేయమని కోరారని ఎమ్మెల్యేలంతా కేటీఆర్ కే మద్దతు తెలిపారని ప్రకటించి సీఎంను చేసేయవచ్చు. గెలుపు ఊపులో ప్రజలూ వ్యతిరేకించరు. అదే ప్లాన్ తో ఇప్పటికైతే కేసీఆరే సీఎం అనే నినాదం తీసుకు వస్తున్నారు. రేపు కేసీఆర్.. కేటీఆర్ ను ముఖ్యమంత్రిగా చేస్తున్న సమయంలో ఖచ్చితంగా చర్చకు వచ్చే అంశం దళిత ముఖ్యమంత్రి హామీ. ఉద్యమ సమయంలో కేసీఆర్ దళితుడ్ని సీఎం చేయకపోతే తల నరుక్కుంటానన్నారు. తీరా తెలంగాణ వచ్చాక కేసీఆర్ సీఎం అయ్యారు. తెలంగాణకు దళిత సీఎం అనేది పక్కకుపోయింది. తొలి టర్మ్ లో ఉపముఖ్యమంత్రి అయినా ఉన్నారు కానీ.. రెండో టర్మ్ లో అది కూడా లేదు. ఉద్యమ నేత కాబట్టి కేసీఆర్ ను యాక్సెప్ట్ చేస్తారు కానీ ఆయన కుమారుడ్ని అంగీకరించకపోవచ్చు. మళ్లీ దళిత సీఎం వాదం తెరపైకి రావొచ్చు. అందుకే ఈ అంశంపైనా ఇండియా టుడే ఇంటర్యూలో కేసీఆర్ మాట్లాడారు. దళిత సీఎం వాదనపై తాము వెనక్కి తగ్గలేదన్నారు. అయితే తెలంగాణ ఏర్పడిన కొత్తలో తమకు రెండు సీట్లు మాత్రమే మెజార్టీ ఉందని.. దళిత నేతకు పగ్గాలు అప్పగిస్తే తెలంగాణ ఏర్పాటు విఫలమైందని ప్రచారం చేస్తారన్న కారణంగానే .. అందరూ అడగబట్టే తాను పదవి తీసుకున్నానని కేసీఆర్ చెబుతున్నారు. మరి రెండో సారి ఎందుకు చేయలేదు అంటే కేసీఆర్ దగ్గర సమాధానం లేదు. కానీ ఆ హామీ నుంచి వెనక్కి తగ్గలేదని అంటున్నారు. దీనిపై వచ్చే విమర్శల సంగతి పక్కన పెడితే దళితుల్లో ఇంకా ఆశలు ఉంచడం కోసం ఇలా మాట్లాడి ఉంటారని అనుకోవచ్చు.
ఎలా చూసినా సీఎం కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో గెలిస్తే కేటీఆర్ ను సీఎంగా చేయడానికే అవకాశం ఉంది. అలా అని ఆయన రిటైర్మెంట్ తీసుకోకపోవచ్చు. ఎందుకంటే రాజకీయ నేతలు రిటైర్మెంట్ తీసుకోవడం అనేది మన దేశంలో జరగలేదు. కేసీఆర్ విషయంలోనూ జరగదు. కాకపోతే ఆయన జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టే అవకాశం ఉంది..
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…