ఓరుగల్లు కోటలో టెన్షన్..టెన్షన్ !

By KTV Telugu On 23 November, 2023
image

KTV TELUGU :-

బీఆర్ఎస్ కు కంచుకోటగా భావించే ఉత్తర తెలంగాణపై ఈసారి మూడు ప్రధాన పార్టీలు ఆశలు పెట్టుకున్నాయి. అక్కడ గెలిస్తేనే అధికారం చేజిక్కించుకునే  ఛాన్సుంటుందని భావిస్తున్న తరుణంలో ఒక్క చోట కూడా ఉదాసీనంగా ఉండకూడదని తీర్మానించుకున్నాయి.అందులోనూ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలను కైవసం చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగిస్తున్నాయి. కాకపోతే  అసంతృప్తి పరులుచేస్తున్న అసమ్మతి రాజకీయాలు పార్టీలను ఆందోళనలోకి నెడుతున్నాయి.

తెలంగాణ మలి దశ ఉద్యమానికి ఊపిరిలూదిన నేల ఉమ్మడి వరంగల్ . బీఆర్‌ఎస్‌కు కంచుకోటగా ఉన్న జిల్లాలో గులాబీ జెండా రెపరెపలాడించాలని కారు పార్టీ నేతలు కదంతొక్కుతున్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఉన్న 12 నియోజకవర్గాల్లో ఈసారి హోరాహోరీ పోరు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నా సర్వేల సారాంశంతో పార్టీలన్నీ గేమ్‌ప్లాన్‌ మార్చేశాయి. ప్రజలతో మమేకమవుతూ ప్రజా వ్యతిరేక విధానాలను కాంగ్రెస్, సంక్షేమ ఫలాల అమలును బీఆర్‌ఎస్‌… రెండు పార్టీల వ్యతిరేక పవనాలపై కమలం… దృష్టిపెట్టాయి. 12 నియోజకవర్గాల్లో మూడు చోటల బహుముఖ పోటీ కనిపిస్తుంది. మిగిలిన చోట్ల ముఖాముఖి పోటీలున్నాయి. బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఉమ్మడి వరంగల్ అంటే  అభిమానం ఎక్కువ. ఉద్యమ కాలంలో వరంగల్ ప్రజలు తనకు వెన్నుదన్నుగా నిలిచారన్న  నమ్మకం ఆయనకుంది. అందుకే ఈ సారి ప్రచారంలో వరంగల్ జిల్లాకు పెద్దపీట వేశారు. ఐదారు సార్లు వచ్చి బహిరంగ సభల్లో ప్రసంగించిన ఆయన, మళ్లీ వస్తూనే ఉంటానని చెబుతున్నారు.

జాతీయ నేతలు సైతం ఉమ్మడి వరంగల్ పై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ బీజీ షెడ్యూల్ వరంగల్ వైపే కేంద్రీకృతమైంది. ఓరుగల్లు ప్రజల ఆలోచన మారిందని వాళ్లు కాంగ్రెస్ కు ఓటేస్తారని ఆ పార్టీ నేతలు విశ్వసిస్తున్నారు. రాహుల్ గాంధీ పాదయాత్ర, ప్రచారం ఆ పార్టీకి కలిసొస్తుందని ఎదురు చూస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్  రెడ్డి ప్రతీ నియోజకవర్గాన్ని  టార్గెట్ చేసి ప్రచారం చేస్తున్నారు. ఇక విజయ సంకల్ప సభకు వరంగల్  వచ్చిన అమిత్ షా  బీజేపీ కార్యకర్తలను ఉత్తేజ పరిచారు. బీజేపీ గెలిస్తే బీసీ సీఎం అన్న నినాదం జనంలోకి బాగానే వెళ్లిందని చెబుతున్నారు. కేసీఆర్ కుటుంబ అవినీతిని ఎక్స్ పోజ్ చేయగలిగితే తమకు విజయం ఖాయమని, వరంగల్ ప్రజలు  అవినీతిని సహించబోరని బీజేపీ విశ్వసిస్తోంది.

ఉమ్మడి వరంగల్ లో పార్టీలకు ఇప్పుడు  రెబెల్స్ తలనొప్పిగా మారారు. ఆఖరి నిమిషంలో పార్టీ మార్పులు, సొంత పార్టీపైనే  బహిరంగ విమర్శలు ఇబ్బందులను సృష్టిస్తున్నాయి. కాంగ్రెస్ టికెట్ ఆశించి  భంగపడిన వరంగల్ వెస్ట్ నేత జంగా రాఘవరెడ్డి తొలుత ఫార్వర్డ్ బ్లాక్ తరపున నామినేషన్ వేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వత్తిడి వచ్చినప్పటికీ జంగా ఇప్పుడు పరోక్షంగా బీఆర్ఎస్ కు మద్దతిస్తున్నారని, క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ పై దుమ్మెత్తిపోస్తున్నారని తెలుస్తోంది. వరంగల్ వెస్ట్ నియోజకవర్గం నుంచే మరోనేత ఏనుగుల రాకేష్ రెడ్డి బీజేపీ టికెట్ ఆశించారు. కానీ అధిష్టానం టికెట్ నిరాకరించింది. దీనితో కలత చెందిన రాకేష్ రెడ్డి పార్టీకి ఆల్టీమేటం జారీ చేశారు. ఎంతకూ ఎవరూ టచ్ లోకి రాకపోవడం కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు.వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలోనే నిన్నటి వరకు బీఆర్ఎస్ లో ఉన్న హనుమకొండ జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అజీజ్ ఖాన్, మరికొందరు నేతలు ఆపార్టీని వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. నిజానికి వరంగల్  తూర్పు నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు అధికార పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు.

వరంగల్ కోటను బద్దలు కొడితే తెలంగాణ తమ ప్యాకెట్లోకి వస్తుందని భావిస్తున్న తరుణంలో ఆ జిల్లాపై పార్టీలు ప్రత్యేక దృష్టి పెట్టాయి. పైగా ప్రత్యర్థి పార్టీల్లో కూడా హేమాహేమీలుండటంతో పోటీ రసవత్తరంగా మారింది. ఎవరూ  తగ్గేదేలే అన్న రేంజ్ లో ప్రచారం చేస్తుండగా, చాపకింద నీరులా వ్యాపస్తున్న అసమ్మతిని ఎలా మేనేజ్ చేయాలో అర్థం కాక పార్టీలు ఇబ్బంది పడుతున్నాయి…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి