తెలంగాణ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్నాయి. నెలాఖరు రోజున ప్రజలు ఓటు హక్కు వినియోగించుకుంటారు. ప్రజలు ఈ సారి ఓటేసేందుకు ఏ అంశాన్ని ప్రాతిపదికగా తీసుకుంటారన్నది కీలకంగా మారింది. ప్రభుత్వ వ్యతిరేకతనా..? ప్రభుత్వ సానుకూలతనా ? . కాంగ్రెస్ గ్యారంటీల్నా ? బీజేపీ మేనిఫెస్టోనా ?. ఇవన్నీ కాకపోతే వారి ఆలోచనా ధోరణి ఎలా ఉంది. అత్యధిక మంది ఏ అంశాన్ని తీసుకుని ఓటు వేస్తారో ఫలితం అటు వైపే ఉంటుంది. ఇంతకీ తెలంగాణ ప్రజల్లో ఏ ఆలోచన ఉంది ?. తామే అజెండా సెట్ చేయాలని పార్టీలు చేస్తున్న ప్రయత్నాలు ఎంత ఫలితాన్ని ఇస్తాయి ?తెలంగాణ ఓటింగ్ కు సమయం దగ్గర పడుతోంది. ప్రజల మూడ్ ఏంటో అన్ని రాజకీయ పార్టీలు దాదాపుగా గుర్తించాయి. వారి ఓటు ప్రయారిటీపై ఓ అంచనాకు వచ్చాయి. దానికి తగ్గట్లుగా ప్రచార వ్యూహాలు మార్చుకుని దాన్నే ఎజెండా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ పది రోజుల్లో ఎంత మేర వారు సక్సెస్ అవుతారు అన్నదాన్ని బట్టి .. ఓటింగ్ సరళి ఉంటుంది.
ఓటరు ఆలోచన ఎలా ఉందనేది రాజకీయ పార్టీల స్పందన బట్టి అర్థమైపోతుదంి. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో ప్రజలు స్పందిస్తున్న తీరు, గ్రామాల్లో రచ్చబండలపై చర్చలు జరుగుతున్న సరళిని గమనిస్తే ప్రభుత్వ వ్యతిరేకత, మార్పు అంశాల ఆధారంగా ఓటింగ్ సరళి ఉండే అవకాశం ఉంటుంది. అందుకే అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు కూడా అక్కడి ఎమ్మెల్యే అభ్యర్థి గురించి చెప్పడం కంటే తమ పార్టీల గురించి చెప్పడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో ఎన్నికల రణరంగం హోరాహోరీగా సాగుతున్నది. ఎమ్మెల్యేలు, మంత్రులు ఏం చేశారన్నదానికంటే.. ప్రభుత్వ పనితీరుపైనే ఎక్కువ ప్రచారం జరుగుతోంది. గతంలో ఎన్నికల సమయంలో ఎవరికి ఓటు వేయాలన్న దిశగా చర్చ జరిగినప్పుడు ఫలాన పార్టీ అభ్యర్థి మంచి వాడనో… లేదా చెడ్డ వాడనో, అతనికి ఓటు వేస్తే మంచో, లేక చెడో ఏదో జరుగుతుందన్న చర్చ ఉండేది. కానీ ఈ నెల 30వ తేదీన జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మాత్రం పార్టీ పరంగా జరుగుతోంది.
బీఆర్ఎస్ కూడా మొదట్లో.. తమకు సానుకూల ఓటు ఉందని గట్టిగా నమ్మింది. అందుకే తమ ప్రభుత్వ విజయాలపై విస్తృతంగా ప్రచారం చేసుకునే ప్రయత్నం చేసింది. కానీ రాను రాను ప్రజల మూడ్ వారికి అర్థమైపోయింది. అందుకే ..కాంగ్రెస్ పార్టీని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. ఆ పార్టీకి ఓటేస్తే ఉత్పాతం జరుగుతుందని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 10 మందిని పలుకరిస్తే దాదాపు ఏడుగురు వ్యక్తులు.. మార్పు జరగాలని అంటున్నారని, అభ్యర్థి ఎవరనేది కాదు.. ప్రభుత్వం మారాలన్న తీరుగా మాట్లాడుతున్నారన్న మౌత్ టాక్ తెలంగాణ మొత్తం ఉంది. ఈ పరిస్థితిని గమనించిన కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలలో తెలంగాణను తెచ్చిన ఘనత.. అభివృద్ధి చేసిన ఘనత తనదేనని చెప్పుకోవడంతో ాటు ప్రతి సమయంలోనూ కాంగ్రెస్ గెలిస్తే.. అంటూ ఆ పార్టీ నామ స్మరణ చేస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పదేళ్లవుతున్నా.. ఇప్పటికీ తెలంగాణ సెంటిమెంట్‌పైనే ముఖ్యమంత్రి, బీఆరెస్ నాయకత్వం ఆధారపడటం రాజకీయవర్గాలను సైతం ఆశ్చర్య పరుస్తోంది. కాంగ్రెస్ కు ఓటు వేయవద్దు అన్న నినాదాన్నే ఎజెండాగా చేయాలని బీఆర్ఎస్ సర్వశక్తులు ఒడ్డుతోంది.
తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ అని ఆ పార్టీ ఎదురుదాడి దిగుతోంది. అంతే కాదు ప్రభుత్వ వ్యతిరేకతను గుర్తించడమే కాకుండా ఇంకాస్త పెంచేందుకు ఆరుగ్యారెంటీలు, అభయ హస్తం పేరిట విడుదల చేసిన మ్యానిఫెస్టోలను విస్తృతంగా ప్రజలలోకి తీసుకెళ్తోంది. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి.. మార్పు తేవాలని విజ్ఞప్తి చేస్తున్నది. నికితోడు జాతీయ స్థాయి నేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ, మల్లికార్జున ఖర్గే వంటి నేతలు అన్నీ తామై రాష్ట్ర కాంగ్రెస్‌ను నడిపిస్తున్నారు. తమ ఎజెండానే ఎన్నికల సమయంలో ఓటింగ్ ప్రయారిటీగా ఉండాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.
భారతీయ జనతాపార్టీ భిన్నంగా బీసీ నినాదం, ఎస్సీ వర్గీకరణ, జనసేనతో పొత్తులతో సామాజిక సమీకరణాలు చూసుకుని వాటి ఆధారంగా ఓట్లేయాలన్న ఎజెండా అమలు చేస్తోంది. కానీ బీజేపీ రాజకీయం చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లుగా ఉన్నదన్న అభిప్రాయం వినిపిస్తోంది.
భారతీయ జనతా పార్టీకి క్షేత్ర స్థాయిలో బలం తక్కువ. అందుకే మెజార్టీ ప్రజల్ని కదిలించే అంశాన్ని ఓటింగ్ ప్రయారిటీగా డిసైడ్ చేయాలనుకుంది. బీసీ సీఎం నినాదం అందుకుంది. ఇక బీసీలందరూ పోలోమని ఓట్లేస్తారని అనుకుటోంది. ఇదే అంశాన్ని ఓటింగ్ ప్రయారిటీగా మార్చాలని అనుకుంటోంది. మేనిఫెస్టోలోనూ అదే చెప్పింది. కానీ బీజేపీ ప్రయత్నాలపై ఎక్కడా చర్చ జరగడం లేదు. ఇది ఆ పార్టీకి ఇబ్బందికరం అవుతోంది. బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఏదో లోపాయికారీ ఒప్పందం ఉందని అత్యధిక మంది ప్రజలు నమ్ముతూండటంతో సమస్య వస్తోంది. బీఆరెస్, బీజేపీ మధ్య రహస్య అవగాహన ఉందన్న చర్చ కూడా గ్రామాలలో సామాన్య ప్రజల మధ్య జరుగుతున్నది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవడం లేదని దీని అర్థమని భావిస్తున్నారు.
ప్రజల నాడి ఎలా ఉన్నదో ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు అధికార బీఆరెస్, ప్రతిపక్ష కాంగ్రెస్ , బీజేపీలు తమకున్న యంత్రాంగాల ద్వారా విశ్వప్రయత్నం చేస్తున్నాయి. 30 నుంచి 35 నియోజకవర్గాల్లో హోరాహోరీ పోరు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా పదేళ్ల బీఆరెస్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత ఛాయలు బాగానే కనిపిస్తున్నాయన్న అభిప్రాయం ఎక్కువ మందిలో ఉంది. టీఆరెస్ పార్టీని బీఆరెస్‌గా మార్చడంతోనే తెలంగాణ ఆత్మ పోయినట్లు కనిపిస్తోందని, దీంతో తెలంగాణ ప్రజలు బీఆరెస్‌ను అన్ని పార్టీలలానే చూస్తున్నారని చెబుతున్నారు. తెలంగాణ తెచ్చాను అన్న పార్టీకి పదేళ్లు అవకాశం ఇచ్చిన ప్రజలు.. తెలంగాణ ఇచ్చామన్న పార్టీకి మరో అవకాశం ఇవ్వాలనుకునేందుకూ అవకాశం ఉన్నదన్న చర్చ జరుగుతోంది.
ప్రస్తుత రాజకీయ వాతావరణాన్ని గమనిస్తే.. కాంగ్రెస్‌కు అనుకూలంగా కనిపిస్తున్నప్పటికీ.. బీఆరెస్ అధినేత కేసీఆర్ ఆఖరి నిమిషాల్లో ప్రదర్శించే చాణక్యం ఫలితాన్ని తారుమారు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని చెప్పుకోవచ్చు. అందుకే కేసీఆర్ శ్రమిస్తున్నారు. ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గుతున్నారని తెలుసుకుని.. ఓటింగ్ ప్రయారిటీ అటు వైపే ఉంటుందని చెప్పి.. దాన్ని మార్చేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఇది ఫలిస్తే బీఆర్ఎస్ కు మరోసారి అధికారం రావొచ్చు.. తేడా వస్తే మాత్రం కాంగ్రెస్‌కు బంపర్ మెజార్టీ వస్తుంది.
ఓటు వేసే క్షణంలో ప్రజలు ఏమనుకుంటారో అదే ఫలితాలను నిర్ణయిస్తుంది. తెలంగాణ విషయంలో జరుగుతున్న అనేక రాజకీయ మార్పులు ఫలితాలు ఎటు వైపు తిరుగుతాయో అంచనా వేయలేని పరిస్థితులు కల్పిస్తున్నా..
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…