తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ నోటి వెంట అనర్గళంగా రెచ్చగొట్టే మాటలు వచ్చేవి. ఆయనకు మాటలే మంత్రాలు. ఓ రకంగా ఆయన మాటలే తెలంగాణ ఉద్యమానికి ఇంధనంగా ఉపయోగపడ్డాయి. ఆ మాటల నిన్నామొన్నటి వరకూ ప్రభావవంతంగా ఉన్నాయి. కానీ ఏమయిందో కానీ..ఇప్పుడు ఆయన ప్రసంగాలు అంత ఆకర్షించడం లేదు. నాలుగు బహిరంగసభల్లో ప్రసంగిస్తున్నా పంచ్‌లు ప్రజల్ని ఆకర్షించడం లేదు. ఈ అసహనం ఏమో కానీ.. కేసీఆర్ నోటి వెంట పరుష పదాలు వస్తున్నాయి. కేటీఆర్ కూడా కంట్రోల్ తప్పుతున్నారు. తమ ప్రచారం జోరుగా ప్రజల్లోకి వెళ్లడం లేదన్న అసహనమా ? లేక పోతే చివరి రోజుల్లో అడ్వాంటేజ్ సాధించాలనుకుంటున్నారా ?
ఎన్నికల ప్రచారంలో విమర్శలు.. ప్రతి విమర్శలు.. పరస్పర ఆరోపణలు సహజం. కానీ తిట్లు సహజం కాదు. ఎన్నికల సమయంలో ప్రజల దృష్టిలో చెడ్డ నేతగా ముద్రపడకూడదన్న ఉద్దేశంతో ఇంకా సున్నితేమైన భాష వాడతారు. తెలంగాణ ఎన్నికల్లో ఇప్పటి వరకూ నేతలు ఎవరూ పెద్దగా గీత దాటలేదు. కానీ ప్రచార గడువు దగ్గర పడుతున్న కొద్దీ బీఆర్ఎస్ నేతలు గీత దాటుతున్నారు. అధికారంలో ఉన్న పార్టీ కావడంతో ఆ పార్టీ అగ్రనేతలు ఏం మాట్లాడినా ప్రజల్లో విస్తృతంగా చర్చకు వస్తోంది.
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ముఖ్య నేతలు సైతం మాట తూలుతున్నారు. పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ కట్టు తప్పి మాట్లాడుతున్నారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ని సన్నాసి నా కొడుకు అంటూ సాక్షాత్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ దూషించారు. మంత్రి కేటీఆర్ 55 ఏళ్లు పాలించిన చెత్త నా కొడుకులు ఏం పీకారు? అని కాంగ్రెస్ నేతల్ని దూషించారు. మంత్రి హరీశ్‌రావు సైతం సిగ్గులేని కాంగ్రెస్ నాయకులను చీపుర్లతో తరమాలంటూ పిలుపునిచ్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్ పూర్లో జరిగిన బహిరంగంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌పై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. సన్నాసి నా కొడుకా అని వాడకూడని మాట వాడారు. ఇదే తీరుగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని వలిగొండ మండల కేంద్రంలో మంత్రి కేటీఆర్ నిర్వహించిన రోడ్లో షోలో స్థానికులు కొంత మంది ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఎక్కడ? ఇంటికో ఉద్యోగం ఎక్కడ? కేజీ టూ పీజీ ఉచిత విద్య ఎక్కడ? అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో అగ్రహానికి గురైన కేటీఆర్ ‘ఆ సన్నాసులు అడుగుతున్నారు.. ప్రభుత్వ డిగ్రీ కళాశాల కావాలని! 55 ఏళ్లు పరిపాలించిన చెత్త నా కొడుకులు ఏం పీకారు? ఇజ్జత్, మానం లేదు అడగటానికి! 55 ఏళ్లు పరిపాలించిన చెత్త నా కొడుకులు ఇవాళ వచ్చి ఇది లేకపాయే.. అది లేకపాయే అంటే వీపు పగుల కొట్టే వాళ్లు లేకనా?’ అంటూ ఒంటికాలి మీద లేచారుఈ తిట్లు బీఆర్ఎస్ అగ్రనేతల తీరుపై ప్రజల్లో చర్చకు పెట్టాయి. బీఆర్ఎస్ నేతల్లో అసహనం పెరిగిపోతోందని అందుకే నోటికి హద్దులు చెరిపేసుకుంటున్నారన్న వాదన వినిపిస్తోంది.
అధికారంలో ఉన్న పార్టీ మరింత బాధ్యతగా ఉండాలి. పదేళ్ల పాటు పాలన చేసి ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు తాము చెప్పుకునేది ఎక్కువ ఉంటుంది. సుదీర్ఘ కాలం పరిపాలించినప్పుడు తాము సాధించినది చెప్పుకోవచ్చు. నిజానికి కేసీఆర్, కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ పార్టీ మొత్తం తామ తెలంగాణను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశామని చెబుతున్నారు. తెలంగాణ రాక ముందు ఎట్లుండే.. తెలంగాణ వచ్చినంక ఎట్లుండే అని ప్రచారాలు కూడా చేస్తున్నారు. కానీ ప్రచారసభల్లో మాత్రం తమ పాలనా ఘనతను చెప్పుకోవడం లేదు. తిట్ల దండకానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహా అధికార బీఆరెస్ నేతల ప్రచార తీరు కొద్ది రోజులు అలాగే నడిచింది. కానీ.. ఉన్నట్టుండి నేతలు బూతుపురాణాలు లంకించుకున్నారు. ఎదుటిపార్టీ నేతలను ఎంతగా తిడితే.. ప్రజల్లో అంతగా స్పందన వస్తుందనే భావన ఈ తిట్ల వెనుక ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. క్షేత్రస్థాయి పరిస్థితుల్లో మార్పులను గమనించినా.. లేదా ప్రత్యర్థి పార్టీలు లేవనెత్తే అంశాలకు దీటైన సమాధానాలు చెప్పలేకపోయినా సహజంగానే రాజకీయ నాయకులు ఎంచుకునే మార్గం ఇదేనని వారు అంటున్నారు. ప్రత్యర్థుల్ని బూతులు తిడితే.. సొంత పార్టీ వారికి కిక్ వస్తుందా ? తటస్థులైన ఓటర్లుు వ్యతిరేకంగా మారే ప్రమాదం లేదా ? మరి బూతులు ఎందుకు అందుకుంటున్నారు ?
రెండు సార్లు అధికారంలో ఉన్న బీఆరెస్ నేతలు ఎన్నికల ప్రచారంలో చెబుతున్న విషయాలను ప్రజలు ఆలకించడం లేదని స్పందన బట్టి అర్థమవుతుంది. కేసీఆర్ రోజుకు నాలుగు ప్రచారసభల్లో ప్రసంగిస్తున్నారు. ఇంత వరకూ ఒక్క సభలోనూ ఆయన ప్రసంగానికి గతంలో వచ్చినంత స్పందన రాలేదు. ఎవరినైనా తిట్టినప్పుడు కాస్త స్పందన వస్తోంది. దీంతో ఈ మార్గాన్ని కేసీఆర్ ఎంచుకోవాలనుకున్నట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో ప్రత్యర్థి పార్టీలను చులకన చేయాలన్న అహంకారం పెరగడంతోనే ముఖ్య నేతల్లో అసహనం హద్దులు దాటి ఉండొచ్చని పలువురు సీనియర్ రాజకీయ నాయకులు అంటున్నారు. తాము చెప్పింది ప్రజలకు ఎక్కడం లేదనే ఆక్రోశం కూడా అందుకు కారణం అయి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
తెలంగాణ ఏర్పాటు తరువాత అధికార పార్టీకి మొదటి సారిగా ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వాన్ని మార్చాలన్న చర్చ కూడా ప్రజల్లో జరుగుతున్నది. 2018లో ఎక్కడా ఇలాంటి చర్చ స్థానిక ప్రజల్లో జరుగnలేదు. మొదటిసారిగా వ్యతిరేక సంకేతాలు కనిపించడంతో బీఆరెస్ నేతలు కట్టలు తెంచుకొని ఆగ్రహంతో ఊగిపోతున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని కీలకమైన మేడిగడ్డ బరాజ్ ఈ ఎన్నికల సమయంలోనే కుంగటం ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలో పడేసింది. దీనిని ప్రధాన అస్త్రంగా తీసుకున్న విపక్షాలు కాళేశ్వరం అవినీతిపై గళమెత్తాయి. కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ మేడిగడ్డకు వెళ్లి పరిశీలించారు. కేసీఆర్ అవినీతిపై ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ విమర్శల దాడి పెంచింది. కనుమరుగైందనుకున్న కాంగ్రెస్ ఊహించని రీతిలో పుంజుకోవడాన్ని బీఆరెస్ అగ్ర నేతలు జీర్ణించుకోలేక పోతున్నారని ..ఆ అసహనం భాష రూపంలో బయటకు వస్తోందని భావిస్తున్నారు.
రాష్ట్రంలో త్రిముఖ పోటీ ఉంటుందని భావించిన నేతలకు అది కాస్తా ఎన్నికలు దగ్గరపడే కొద్దీ ద్విముఖ పోటీగా మారడం కూడా మింగుడు పడటం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పైగా ప్రజల్లో తమ గ్రాఫ్ తగ్గిందని భావించిన తరువాతనే అధికార పార్టీ నేతలు బూతులు అందుకున్నారని అంటున్నారు. బీఆరెస్ అగ్రనేతలు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుల మాటలు పరిశీలిస్తే.. కాంగ్రెస్ పై కోపం పెరుగుతోందని చెబుతున్నారు. అది అసహనమైనా, అహంకారమైనా .. నాయకత్వ స్థానాల్లో ఉన్నవారికి తగనిదన్న అభిప్రాయం మాత్రం వినిపిస్తోంది.
బీఆర్ఎస్ అగ్రనేతలు.. పూర్తిగా కాంగ్రెస్ ను గుర్తు చేసుకుంటూనే ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పై అసహనం తిట్ల రూపంలో బయటకు వస్తోంది. దీన్ని ప్రజలు ఎలా చూస్తారో ఎన్నికల ఫలితాలే తేల్చాల్సి ఉంది..
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…