తెలంగాణ కాంగ్రెస్ కు ఏమైంది ?

By KTV Telugu On 28 November, 2023
image

KTV TELUGU :-

తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో స్తబ్దత నెలకొందా. వాళ్లల్లో మునుపటి ఉత్సాహం  కనిపించడం లేదా. లేక వాళ్లకు ధైర్యం పెరిగిపోయిందా. ఎన్నికల చివరి దశలో వాళ్లు ఎందుకు ఆలా ప్రవర్తిస్తున్నారు… వారి ప్రవర్తనకు ప్రత్యేక కారణం ఏమైనా ఉందనుకోవాలా…

రెండు మూడు నెలల పాటు తెలంగాణ కాంగ్రెస్లో ఎక్కడ చూసినా హడావుడి కనిపించింది. ప్రతీ ఒక్కరు జనంలో ఉండేందుకు ఇష్టపడ్డారు. ఈ రాష్ట్రం నాదిరా అన్నట్లుగా ప్రవర్తించారు.  నౌ ఆర్ నెవ్వర్ అన్న రేంజ్ లో వాళ్లు ఊగిపోయారు. రాష్ట్రమంతా తిరుగుతూ జననాడిని కనిపెట్టేందుకు  ప్రయత్నించిన నేతలు కూడా ఉన్నారు. పార్టీ  పరంగా సునీల్ కనుగోలు రూపొందిస్తున్న వ్యూహాలతో పాటు వ్యక్తిగతంగా కూడా వ్యూహాలు రూపొందించుకున్నారు. ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకుంటూ విజయావకాశాలను బేరీజు వేసుకున్నారు. తమకే గెలుపు ఖాయమన్న ధీమాకు కూడా వచ్చారు. రోజుకో సర్వే వచ్చిన నేపథ్యంలో సగానికి పైగా సర్వేలు  కాంగ్రెస్ విజయాన్నిసూచిస్తుండగా ఇక తమకు  తిరుగులేదనుకున్నారు.

అంతా బాగానే ఉందని భావించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో ఏదో తేడా కొట్టింది. డల్ గా ఉన్న ప్రత్యర్థులంతా మంచి ఊపుమీదకు వస్తే… కాంగ్రెస్ నేతలు మాత్రం ఉదాసీనంగా తయారయ్యారు. ఎమ్మెల్యే అభ్యర్థుల్లో మునుపటి జోష్ కనిపించడం లేదు. ఏదో ఉన్నామంటే ఉన్నామన్నట్లుగా తయారయ్యారు. పోలింగ్ తేదీ ఎప్పుడు అయిపోతుందా అన్నట్లుగా వారి బాడీ లాంగ్వేజ్ కనిపిస్తోంది. అలా ఎందుకు జరుగుతోంది…

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి యమ బీజీగా ఉన్నారు. హెలికాప్టర్ లో తిరుగుతూ రోజుకు నాలుగు మీటింగులు మాట్లాడుతున్నారు. ఎక్కడికి వెళ్లినా సీఎం కేసీఆర్ మీద పది బక్కెట్లు బురద జల్లుతున్నారు.  రేవంత్ రెడ్డి అన్ని తానై పనులు చేసుకుంటూ పోతున్నారు. అదే ఇప్పుడు పార్టీలో ఇతర నేతలు రిలాక్స్ అయిపోవడానికి కారణవుమవుతోంది. అన్ని పనులు  రేవంత్ చూసుకుంటున్నారని అభ్యర్థుల్లో 90 శాతం మంది రిలాక్స్ అవుతున్నారు. చాలా మంది ప్రచారానికి  కూడా వెళ్లకుండా ఇళ్లలోనూ, పార్టీ ఆఫీసుల్లోనూ ఉండిపోతున్నారు. అనుచరులను మాత్రం తిప్పుతూ లెక్కలేసుకుంటున్నారు. కొందరైతే పోలింగ్ జరగకముందే గెలిచిపోయినంత ఫీలింగ్ తో ఎంజాయ్ చేసేస్తున్నారు. కొందరు పార్టీలు కూడా చేసుకుంటున్నారని వినికిడి. పార్టీ వర్గాల్లో మరో మాట కూడా వినిపిస్తోంది. ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టాల్సిన ఆఖరి తరుణంలో పైసా బయటకు తీయకుండా ఉండిపోతున్నారని చర్చించుకుంటున్నారు. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే ఎన్నికల్లో గెలవడం కష్టమే అవుతుందన్న నిర్ణయానికి వస్తున్నారు.

అభ్యర్థుల తీరు వారిని  నమ్ముకుని తిరుగుతున్న అనుచరులకు అంతు చిక్కడం లేదు. ఇక్కడి దాకా తీసుకొచ్చి తీరా పుట్టి ముంచేస్తున్నారని భయపడుతున్నారు. పోటీ చేస్తున్నందుకు వాళ్లు, మద్దతిచ్చినందుకు తాము మునిగిపోయే దుస్థితి వచ్చిందని ఆదోళన  చెందుతున్నారు. కేవలం అతి  విశ్వాసంతో రిలాక్స్ అవుతున్న నేతలను చూస్తే భయం వేయడం సహజమే కదా. ఐనా పోలింగ్ లో ఏం జరుుగుతుందో చూడాలి..

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి