కాంగ్రెస్ ప్లస్ రేవంత్ రెడ్డి – హస్తానికి రాజయోగం !

By KTV Telugu On 4 December, 2023
image

KTV TELUGU :-

తెలంగాణలో కాంగ్రెస్ విజయం వెనుక ఉన్నది ఎవరు అంటే.. రేవంత్  రెడ్డి అని చెప్పక తప్పదు. గత కాంగ్రెస్ కు.. ఇప్పటి కాంగ్రెస్ కు ఉన్న తేడా రేవంత్ రెడ్డి మాత్రమే.ఇర్పటి వరకూ ప్రజాప్రతినిధిగా అదీ  ప్రతిపక్ష పార్టీల్లో మాత్రమే ఉన్న రేవంత్ రెడ్డి ఎవరూ ఊహించని  విధంగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు రావడంలో కీలక పాత్ర పోషించారు.

రేవంత్ రెడ్డి  సామాన్యమైన నేత.   కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి సోదరుడి కుమార్తెను ప్రేమ వివాహం చేసుకున్నారనే ఓ బీరకాయపీచు చుట్టరికం తప్ప మరే రాజకీయ బ్యాక్ గ్రౌండ్ లేదు.  అలాంటి లీడర్ కింది స్థాయి నుంచి ఎదిగాడు.  ఆయన ఎదుగుదల చూస్తే…  ట్రూ లీడర్ అని అంగీకరించక తప్పదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ అధికార పార్టీలో లేరు.  అదే సమయంలో అధికార పక్షాల నుంచి ఆయన ఎదుర్కొన్నన్ని ఇబ్బందులు మరో నేత ఎదుర్కొని ఉండరు.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి చీఫ్ అయ్యేదాకా గమ్యం లేదు.  ఎవరు పార్టీలో కోవర్టులో.. ఎవరు పార్టీ కోసం పని చేస్తారో..  ఎవరికీ తెలియదు. ఎవరు ఎప్పుడు పార్టీ నుంచి వెళ్లిపోతారో తెలియనంత సందిగ్ధం.  అలాంటి పరిస్థితుల్లో  పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు.  ఉలి దెబ్బలు తగిలితేనే శిల్పం అవుతుదన్నట్లుగా పార్టీని గెలిపించారు.  తెలంగాణ అంటే టీఆర్ఎస్.. టీఆర్ఎస్ అంటే తెలంగాణ అని మరే ప్రతిపక్షాన్ని కూడా ఉండకుండా చేయడానికి కేసీఆర్ రాజకీయం చేశారు.  నేతలంతా ప్రజల్లో ఉన్న సెంటిమెంట్ దెబ్బకు టీఆర్ఎస్ కు మరో పాతికేళ్ల వరకూ తిరుగుండదని ఆ పార్టీ గూటికి చేరిపోయారు. కానీ రేవంత్ రెడ్డి ఒక్కడే ఎదురునిలబడాలని నిర్ణయించుకున్నారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా రాజకీయ పునరేకీకరణ చేయాలని ముందడుగు వేశారు. తెలంగాణకు కేసీఆర్ నుంచి విముక్తి కల్పించడమే లక్ష్యంగా టీడీపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు.  2017లో ఇది జరిగింది. ఇప్పుడు 2023 ఆరేళ్లలో  రేవంత్ రెడ్డి తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. తెలంగాణకు కేసీఆర్ మాత్రమే నేత కాదని నిరూపించారు.  ఇది  సింపుల్‌గా సాధ్యమయిందా కానే కాదు..  సహనం.. వ్యూహం.. దూకుడు.. అన్నీ సమసస్ఫూర్తిగా ఉపయోగించుకుంటూ చేసిన పోరాట ఫలితం ఇది. ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా వెనక్కి తగ్గని గుండె ధైర్యం అందించిన విజయం.

2014లో టీడీపీ ఓడిపోయినా ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఆయన  ట్రాప్ అయ్యారు.  ఓటు హక్కు ఉందో లేదో తెలియని స్టీఫెన్సన్ కు డబ్బులు ఆఫర్ చేస్తూ స్టింగ్ ఆపరేషన్ లో దొరికిపోయారు. డబ్బులు ఇస్తే ఓటు వేస్తానని స్టీఫెన్సనే కబురు పంపించారని అంటారు.  ఈ సమాచారాన్ని కేసీఆర్ కు ఎర్రబెల్లి దయాకర్ రావు లీక్ చేశారని ఇటీవల రేవంత్ ఆరోపించారు. అప్పుడేమి జరిగినా ఆయన రాజకీయ జీవితాన్ని సమాధి చేసే ప్రయత్నాలు జరిగాయి. కానీ రేవంత్ తగ్గలేదు. బయటచకు వచ్చాక తన పోరాటాన్ని ఆపలేదు. అంతటితో ఆయన పై వేధిపులు ఆగలేదు.

2018 ఎన్నికల్లో రేవంత్ రెడ్డి  ఇలా నామినేషన్ వేశారో లేదో అలా ఆయన ఇంటిపై ఐటీ, ఈడీ దాడి చేశాయి. మూడు రోజుల పాటు ఆయనను ఇంట్లోనే నిర్బంధించారు. బయట   మీడియాలో రేవంత్ పై విస్తృతమైన వ్యతిరేక ప్రచారం జరిగింది. ఆయన దగ్గర వందల కోట్లు ఆస్తులు దొరికాయని విదేశాల్లో లావాదేవీలు ఉన్నాయని కొన్ని పత్రాలు మీడియాలో ప్రదర్శించారు. కానీ అదంతా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా జరిగిన ఆర్గనైడ్డ్ ప్రచారం అని..  అవి ఫేక్ పేపర్స్ అని తర్వాత తేలింది.  ఓ నాయకుడిని అన్ని  వ్యవస్థలను ఉపయోగించి టార్గెట్ చేశాయి. అలా చేయగలిగినదంతా చేసి ఆ ఎన్నికలలో ఓడించారు. కానీ తాను ఎంచుకున్న మార్గంలో తగిలిన ఎదురుదెబ్బల్ని చూసి భయపడే నాయకుడ్ని కాదని నిరూపించి ముందుకు సాగారు. 2018లో ఓడిపోయినా   ఆ ఓటమిని  క్షణాల్లో మర్చిపోయి మళ్లీ లక్ష్యం దిశగా పయనించాడు. ఆరు నెలలు తిరగక ముందే  ఎంపీ అయ్యారు.

ఎలాంటి పరిస్థితుల్లోనూ వెన్ను చూపకపోవడం రేవంత్ రెడ్డి ధైర్యం. గురి పెట్టిన లక్ష్యం మాత్రమే కనిపించేలా ఎదగడం ఆయన స్పెషాలిటీ.కాంగ్రెస్ నేతల మధ్య ఉన్న విబేధాలతో పార్టీ ఎప్పటికప్పుడు చిక్కి శల్యమైపోతూ వచ్చింది.  కాంగ్రెస్ పార్టీ అసలు పుంజుకుంటుందా అనే పరిస్థితిని అందరిలో కల్పించారు కాంగ్రెస్ నేతలు.   అలాంటి పరిస్థితి ఏర్పడటంతో చాలా మంది నేతలు పార్టీ మారిపోయారు.  ఇక చేతులెత్తేసే పరిస్థితుల్లో రేవంత్ రెడ్డికి  పీసీసీ చీఫ్ పదవి వచ్చింది.  రేవంత్ కు పీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలనుకున్నారని ప్రచారం జరిగినప్పుడల్లా ఆయనపై ఏదో ఓ కేసు నమోదయ్యేది. జైలుకెళ్లాల్సి వచ్చేది.  అలాంటి  వ్యక్తికి పీసీసీ చీఫ్ పోస్ట్ ఇస్తారా అని అధికార పార్టీ నుంచి వమర్శలు వచ్చేవి. చివరికి కాంగ్రెస్ అలాంటివి పట్టించుకోకుండా పదవి ఇచ్చింది.  గాంధీ భవన్ లో గాడ్సేను కూర్చోబెట్టారని కేటీఆర్ ఇప్పటికీ విమర్శఇస్తూ ఉంటారు.

తనకు పుసీసీ చీఫ్ పదవి వచ్చిందని రేవంత్ మిడిసి పడలేదు.  కాంగ్రెస్ రాజకీయం ఎలా ఉంటుందో రేవంత్ రెడ్డికి తెలుసు. అప్పటికే వంట బట్టించుకున్నారు. తనపై సీనియర్ల పేరుతో కొంత మంది ఎన్ని ఆరోపణలు చేసినా తాను తిరిగి ఒక్క మాట అనలేదు. వారు క్షమాపణలు అడిగితే క్షమాపణలు చెప్పారు.. మా జిల్లాలోకి రావొద్దంటే అడుగు పెట్టలేదు. అందర్నీ కలుపుకుని వెళ్లేందుకు రేవంత్ రెడ్డి ఎంత తగ్గాలో అంత తగ్గారు. కేసీఆర్ ను ఓడించడం.. కాంగ్రెస్ పార్టీని  గెలిపించడమే ఎదురుగా లక్ష్యం ఉందని ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ ముందుకెళ్లారు. రేవంత్ రెడ్డి పట్టుదల.. ప్రజల్లో నమ్మకాన్ని పెంచింది.

కర్ణాటక ఎన్నికల్లో వచ్చిన విజయాన్ని ఆత్మవిశ్వాసంగా.. కాంగ్రెస్ పార్టీలోకి ఎక్కించారు రేవంత్.  కింది స్థాయి క్యాడర్ వరకూ క్రియాశీలమయ్యారు. మా వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడన్న ధైర్యం అందరికీ వచ్చింది. అంతే ప్రజల్లో మార్పు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బాహుబలిలాగా కనిపించడం ప్రారంభమైంది. అంతే పోలోమంటూ నేతలందరూ ఒకరి తర్వాత ఒకరు సొంత గూటికి తిరిగి వచ్చేశారు. ఎన్నికలకు ఆరు నెలల ముందుగా జీరోగా ఉన్న కాంగ్రెస్ .. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యే సమయానికి బాహుబలిగా మారింది.    రేవంత్ రెడ్డి అంటే ఓ నమ్మకం.. రేవంత్ రెడ్డి అంటే ఓ భరోసా అని కార్యకర్తల్లోనే సామాన్య ప్రజల్లోనూ ఏర్పడింది. అందుకే ఆయన ఏ నియోజకవర్గం వెళ్లినా జన ప్రవహం కనిపించంది. తెలంగాణలో ఒక్క కేసీఆర్ తప్ప మరెవరకీ కనీసం నియోజకవర్గ  స్థాయిలో బహిరంగసభలు పె్ట్టే జనకర్షకశక్తి లేదు. కానీ ఇప్పుడు కేసీఆర్ కంటే అతి పెద్ద భారీ  బహిరంగసభలు నిర్వహించే మాస్ లీడర్ అయ్యారు రేవంత్  రెడ్డి. ప్రచారంలో కేసీఆర్ సభలు తేలిపోయాయన్న అభిప్రాయం ఏర్పడితే.. రేవంత్ రెడ్డి సభలు కిక్కిరిసిపోయాయని చెప్పుకున్నాయి.

ఏ పార్టీ అయినా గ్యారంటీలు ఇస్తేనే ప్రజలు ఓట్లేయరు. ఆ గ్యారంటీలు అమలు చేసే బలమైన నేత ఉండాలి. ఆ నేతను ప్రజలు రేవంత్ రెడ్డిలో చూశారు. ప్రజలకు ఆయన ఇచ్చిన భరోసా.. అలాంటిది. మాయ మాటలతో కేసీఆర్ చేసిన నయవంచనకు చెక్ పెట్టిన  సామాన్యుల్లో అసామాన్యుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ గుండె చప్పుడు. రియల్ హీరో. ఒంటి చేత్తో కాంగ్రెస్ పార్టీని గెలిపించిన యోధుడిగా రేవంత్ రెడ్డి మిగిలాడనుకోవచ్చు. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పటి వరకూ కేసీఆర్ శకం.. ఇక నుంచి రేవంత్ రెడ్డి శకం ప్రారంభమయ్యే  అవకాశం ఉంది…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి