ముందున్నదంతా సవాళ్ల కాలమే

By KTV Telugu On 5 December, 2023
image

KTV TELUGU :-

అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ముందు పెను సవాళ్లు ఉన్నాయి. ఆరు గ్యారంటీలతో పాటు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయడం అంత తేలిక కాదు. ప్రభుత్వ ఖజానాపై అది పెను భారమే అవుతుంది. దానికి నిధులను ఎక్కడ్నుంచి తెస్తారన్నది  సమస్యే. అసలే అప్పుల్లో ఉన్న  రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తూ  తమ హామీలు నెరవేర్చడం తలకు మించిన భారమే అవుతుందని  ఆర్ధిక రంగ నిపుణులు అంటున్నారు. ఆదాయాలను పెంచుకునే  మార్గాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని వారంటున్నారు.

తెలంగాణా ఎన్నికల్లో కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీ సాధించి అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రితో పాటు మంత్రులంతా ప్రమాణ స్వీకారాలు చేసి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక  కాంగ్రెస్ కు అడుగడుగునా సమస్యలు స్వాగతం పలకడం ఖాయం.తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగదార్లందరికీ   ఉచిత విద్యుత్ అందిస్తామంది కాంగ్రెస్ పార్టీ.ఇది  అమలు చేస్తే ఖజానాపూ వేల కోట్ల భారం పడుతుంది. దీన్ని అందరికీ అమలు చేస్తారా లేక వైట్ రేషన్ కార్డుదారులకు మాత్రమే అమలు చేస్తామని  అంటారా అన్నది చూడాలి. అందరికీ అమలు చేస్తే భారం సమస్య అవుతుంది. కొందరికే ఇస్తామంటే ఇచ్చిన మాట తప్పినట్లవుతుంది. అది ప్రజావ్యతిరేకతకు దారి తీస్తుంది.

మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామన్నారు. ఇది కూడా ఆచరణలో చాలా కష్టమైన వ్యవహారమే. ఇప్పటికే ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోయి మూలుగుతోంది. అటువంటి ఆర్టీసీపై  ఉచిత ప్రయాణ భారం పడితే  అది కోలుకునే  పరిస్థితి ఉండదు. ఈ భారాన్ని ప్రభుత్వం భరించాలి. అది కూడా వేల కోట్ల రూపాయల మేరకు  భారం అవుతుంది.రైతు బంధు కింత ఎకరాకు ఏడాదికి 15 వేల రూపాయలు  అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇప్పటి వరకు అధికారంలో ఉన్న బి.ఆర్.ఎస్. ఏడాదికి 10 వేల రూపాయలు అందించింది. ఆ బడ్జెట్ పెరిగితే ప్రభుత్వంపై భారం పెరుగుతుంది.

దీంతో పాటే   రెండు లక్షల రూపాయల లోపు రైతు రుణాలను బేషరతుగా మాఫీ చేస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అది కూడా పెను భారమే అవుతుంది.మహిళలకు నెల నెలా రెండున్నర వేల రూపాయల భృతి, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి.. వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు భారీగా పెంచిన పింఛన్లు  అమలు చేయడం  మాటలు కాదు.హామీలన్నీ అమలు చేయాలంటే  నిధులు ఎక్కడి నుంచి తేవాలా అన్న సమస్య వెక్కిరిస్తుంది.హామీల అమలులో  ఇపుడు షరతులు  విధిస్తే  అది యూ టర్న్ తీసుకున్నట్లు అవుతుంది.

ఉచిత హామీలతో పాటు అభివృద్ధికి  నిధులు సమకూర్చుకోవడం  అంత ఈజీ కాదు. సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి సారించాలి. మేడిగడ్డ రిజర్వాయర్ కుంగుబాటుకు  అక్రమాలే కారణమని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఆరోపించింది. అంతే కాదు  మేడిగడ్డలో జరిగిన అక్రమాలపై  హైకోర్టు సిటింగ్ జడ్చి చేత విచారణ చేయించి దోషులను కఠినంగా శిక్షిస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది కాంగ్రెస్. ఈ హామీని అమలు చేస్తే రాజకీయ కక్ష సాధింపునకు తెగబడుతున్నారన్న విమర్శలు వచ్చే అవకాశాలుంటాయి. అలాగని దీన్ని పక్కన పెట్టేస్తే  ఎన్నికల్లో చెప్పినవి ఓటి మాటలే అవుతాయి. ఇలాంటి సమస్యలన్నింటినీ అధిగమించాల్సి ఉంటుంది.

ప్రభుత్వ పరంగా ఆర్ధికంగా ఈ సమస్యలు ఉంటే ఇక మంత్రి వర్గ కూర్పు లో   తలనొప్పులు తప్పవు. అన్ని వర్గాలకూ ప్రాతినిథ్యం కల్పిస్తూ అందరినీ సంతృప్తి పర్చడం అనేది ఎవ్వరి వల్లా సాధ్యం కాదు. అందులోనూ భిన్న గ్రూపులు ఉండే కాంగ్రెస్ వంటి పార్టీల్లో ఏకాభిప్రాయ సాధన అన్నది దేవుడి తరం కూడా కాదు. సీనియారిటీకి విలువను ఇస్తూనే సామాజిక వర్గాలకు  న్యాయం చేయగలగాలి. దాంతో పాటే  ప్రాంతాల వారీగా నూ నేతలకు అవకాశాలు ఇవ్వాలి. ఇది చాలా పెద్ద కసరత్తే అవుతుందంటున్నారు రాజకీయ పండితులు. మొత్తం మీద కాంగ్రెస్ ప్రభుత్వానికి   పాలన నల్లేరు పై బండి నడకలా  సాగే పరిస్థితి ఉండదంటున్నారు  ఆర్ధిక రంగ నిపుణులు…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి