గుడివాడ టికెట్ పంచాయితీకి చంద్రబాబు స్వయంగా ఫుల్ స్టాప్ పెట్టారు. రెండు బలమైన వర్గాలకు సయోధ్య కుదిర్చి.. పోటీ చేసే వారి పేరు ప్రకటించేశారు. వెనిగెళ్ల రాము ఈ సారి పోటీ చేయబోతున్నట్లు తేల్చేశారు. ఆ క్రమంలో వైసీపీకి చెక్ పెట్టేందుకు పెద్ద స్కెచ్ వేసేశారు…
ఉమ్మడి కృష్ణా జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం గుడివాడ. అక్కడ ఏం జరిగినా తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమవుతూనే ఉంటుంది. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు వైసీపీలో ఉన్న కొడాలి నాని వల్లే ఆ నియోజకవర్గం పాపులర్ అయ్యిందని కూడా చెప్పక తప్పదు. నానికి బూతుల మంత్రి అని ఎంత పేరు ఉందో, బలమైన నాయకుడిగా – బలమైన సామాజికవర్గం నాయకుడిగా కూడా అంతే పేరు ఉంది. గుడివాడ అంటే నాని అన్నంతగా పాతుకుపోయిన ఆయన్ను కదిలించేందుకు టీడీపీ సర్వశక్తులు వినియోగిస్తోంది. ఈ క్రమంలోనే నియోజకవర్గం ఇంఛార్జ్ ను మార్చి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోందనే చెప్పాలి…
ఇంతకాలం నాని గెలవొచ్చు. ఆయన్ను ఓడించడం కష్టమేమీ కాదని మాత్రం టీడీపీకి తెలుసు. అయితే అందుకు వ్యూహాలు మార్చాల్సిన అనివార్యత ఉందని చంద్రబాబు స్వయంగా గుర్తించాలి. అంగబలం, అర్థబలం పుష్కలంగా ఉన్న నాయకుడికే ఛాన్సిస్తే కొడాలి నానిని మట్టి కరిపించడం ఖాయమని నిర్ణయానికి వచ్చారు. వెనిగళ్ల రామును ఇంఛార్జ్ గా పెట్టారు.
టీడీపీ అధిష్టానం.. గుడివాడ నియోజకవర్గాన్ని సీరియస్‌గా తీసుకుంది. ఈ క్రమంలో తాజాగా అక్కడ టికెట్‌ను కూడా దాదాపు ఖరారు చేసేసింది. ప్రవాసాంధ్రుడు, కొన్నాళ్లుగా ఈ నియోజకవర్గంలో కలివిడిగా ఉంటూ.. పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న వెనిగళ్ల రాముకు టికెట్ ఇవ్వడం ఖాయమనే వాదన పార్టీలో వినిపిస్తోంది. తాజాగా చంద్రబాబు వెనిగళ్ల రాముతో చర్చించి.. గుడివాడ ఇంచార్జ్ బాధ్యతలు కూడా ఇచ్చారు. వాస్తవానికి అక్కడ రావి వెంకటేశ్వరరావు ఇప్పటి వరకు ఇంచార్జిగా ఉన్నారు. అయితే.. మారిన పరిణామాలు.. ఆర్థిక బలం వంటివాటిని పరిగణనలోకి తీసుకున్న టీడీపీ అధినేత వెనిగళ్లకు జైకొట్టారు. అందరినీ కలుపుకుపోయే దిశగా రావి వెంకటేశ్వరరావుతో చర్చించి ఆయన్ను సమాధానపరిచారు. వచ్చే ఎన్నికల్లో వెనిగళ్లను గెలిపించుకునేలా.. పార్టీ కార్యక్రమాలను జోరందుకోవాలని.. పార్టీని గెలిపించాలని చంద్రబాబు సూచించారు.వెనిగళ్లను గెలిపిస్తే రావికి అత్యంత కీలక పదవి ఇస్తానని, పార్టీ అధికారానికి వచ్చిన వెంటనే ఆ పదవి ఆయన్ను వరిస్తుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. గుడివాడలో కొడాలి నానిని ఓడించే దమ్ము, అర్థబలం వెనిగళ్ల రాముకు మాత్రమే ఉందని తేలిపోయింది.
వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం ఖాయమని భావిస్తున్నారు. ఈ క్రమంలో వై నాట్ 175 అని చంద్రబాబు ఆయన అనుచరులు కూడా అంటున్నారు. ఏ ఒక్క నియోజకవర్గాన్ని తేలిగ్గా తీసుకోకూడదని తీర్మానించారు. అందులోనూ టీడీపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడే కొడాలి నాని, వల్లభనేని వంశీని స్పెషల్ టార్గెట్ చేసుకున్నారు. అందుకే గుడివాడ, గన్నవరం నియోజకవర్గాల్లో కీలక నేతలు చంద్రబాబు విడివిడిగా పిలిపించి మాట్లాడుతున్నారని చెబుతున్నారు…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…