KTV TELUGU :-
ఓటమి తర్వాత కేసీఆర్ ఏం చేయబోతున్నారు. ఆయన క్రియాశీలంగా ఉంటారా.. పార్టీని వేరొకరికి అప్పగించి విశ్రాంతి తీసుకుంటారా. ఇక చాలనుకుంటారా.. పోగొట్టుకున్న చోటే వెదుక్కోవాలనుకుంటారా.. తన పాత ప్లాన్లను కొత్త తరహాలో అమలు చేయాలనుకుంటారా…
తన రాజకీయ జీవితంలో ఇప్పటి వరకు ఓటమెరుగని కేసీఆర్ మొదటిసారి కామారెడ్డిలో ఓడిపోయారు. దీంతో కేసీఆర్ గురించి సర్వత్రా చర్చించుకుంటున్నారు.ఈ ఎన్నికల్లో హ్యాట్రిక్ కొడుతామనుకొని కనీస మెజార్టీకి దరిదాపుల్లోకి కూడా ఆయన రాలేకపోయారు. ఆశించినది కాకపోయినా కొంత మేర ఊహించిన ఫలితాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ రాజీనామా చేసి ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు.పార్టీ ఎమ్మెల్యేలను, నేతలను పిలిపించుకుని మొక్కుబడిగా మీటింగ్ పెట్టారు. ప్రభుత్వానికి సహకరిద్దామంటూ సన్నాయి నొక్కులు నొక్కారు.ప్రస్తుతానికి కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటున్నారు. అలాగని సుదీర్ఘకాలం మౌనంగా ఉంటారని కూడా చెప్పలేం.
ఎగ్జిట్ పోల్స్ సహా సర్వేలన్నీ బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా వచ్చినప్పుడే ఫలితం కేసీఆర్ కు అర్థమై ఉంటుంది. ఓటిమికి ఆయన సిద్ధపడ్డారనే చెప్పక తప్పదు. అప్పటి నుంచే కేసీఆర్ కొత్త ప్లాన్ సిద్ధం చేసుకున్నారని బీఆర్ఎస్ లో వినిపిస్తున్న మాట. ఇప్పుడు ఫామ్ హౌస్ వేదికగా తన భవిష్యత్ రాజకీయాలకు ఆయన ప్లాన్ చేసినట్లుగా చెబుతున్నారు. ఈ సారి పక్కా ప్లాన్ తో ఆయన మళ్లీ జనంలోకి వస్తారు.
దేశ రాజకీయాల్లో ప్రవేశించడానికి టీఆర్ఎస్ గా ఉన్న పార్టీని బీఆర్ఎస్ గా మార్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఢిల్లీలో ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేసి అక్కడికి వెళ్లినపపుడు పలువురు నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే ఇంతలో తెలంగాణలో ఎన్నికలు రావడంతో ఇక్కడ గెలిచిన తరువాత రాష్ట్ర బాధ్యతలను కుమారుడు కేటీఆర్ కు అప్పజెప్పనున్నట్లు అప్పట్లోప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు అధికారం చేజారినా బీఆర్ఎస్ రాష్ట్ర బాధ్యతలు కేటీఆర్ కు ఇస్తారని అంటున్నారు. ఆయననే బీఆర్ఎస్ పక్ష నేతగా ఎన్నుకొని శాసనసభకు పంపనున్నారు.లోక్ సభ ఎన్నికల్లో కేసీఆర్ పోటీ చేయనున్నట్లు సమాచారం. ఆ తరువాత పార్లమెంట్ లో అడుగుపెట్టి అక్కడి నుంచే రాజకీయాలు చేస్తారని చెబుతున్నారు. ఇప్పటికే పలువురు జాతీయ నాయకులతో సంబంధాలు ఏర్పరుచుకున్న ఆయన ఇప్పుడు ప్రత్యేకంగా దేశ రాజకీయాలపైనే దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో ఎక్కువ లోక్ సభా సీట్లు తెచ్చుకొని కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తారని ఆయన సహచరులు అంటున్నారు.
కేసీఆర్ అనుకున్నది జరగాలంటే కేంద్రంలో హంగ్ పార్లమెంటు రావాలి.బీజేపీకి సీట్లు బాగా తగ్గాలి. బీఆర్ఎస్ కు 12 నుంచి 15 లోక్ సభా స్థానాలు రావాలి. అప్పుడే బేరసారాలకు, సంకీర్ణ ప్రభుత్వంలో బీఆర్ఎస్ కీలక పాత్ర పోషించేందుకు వీలవుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై వత్తిడి ఉండాలన్నా కేసీఆర్ కేంద్రంలో చక్రం తిప్పాల్సిన అనివార్యత ఉంటుంది. ఆయన కోరిక తీరుతుందో లేదో చూడాలి…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…