BRSను BJP మింగేస్తుందా ?

By KTV Telugu On 7 December, 2023
image

KTV TELUGU :-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఎక్కువ మంది కేసీఆర్ ఫ్యూచర్ ప్లాన్లు, కేటీఆర్ రాజకీయ భవిష్యత్ గురించి చర్చిస్తున్నారు. కానీ రాజకీయ పరిస్థితుల్ని కాస్త లోతుగా విశ్లేషిస్తే బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవడానికి కేసీఆర్ ఓ భారీ యుద్ధమే చేయాల్సి ఉంటుంది.  ఎందుకంటే రెండు జాతీయ పార్టీలతో కేసీఆర్ పోటీ పడాల్సి ఉంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌తో .. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో యుద్ధం చేసి పార్టీని కాపాడుకోవాలి. లేకపోతే  ఏదో ఓ పార్టీ బీఆర్ఎస్ ను మింగేస్తుంది. అందుకే ఇప్పుడు కేసీఆర్ పార్టీని కాపాడుకునేందుకు   ఏం చేయబోతున్నారన్నది కీలకంగా మారింది.

బీఆర్ఎస్ పార్టీ తన బలం అయిన ఉత్తర తెలంగాణ బలహీనపడింది.  అక్కడ  బీజేపీ బలంగా మారింది. అన్ని చోట్లా కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థి అయింది.  ఈ సమీకరణాల్ని కాస్త డీకోడ్ చేస్తే మనకు కనిపించే సన్నివేశం ముందు  బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనే పోరాటమే.  మరి బీఆర్ఎస్ ఎక్కడ ఉంటుంది ? . ఇదే ఇప్పుడు బీఆర్ఎస్ అగ్రనేతల్ని కూడా ఆందోళనకు గురి చేస్తున్న అంశం.

ఉత్తర తెలంగాణలో ఎన్నికలకు ముందు పోటీ బీఆర్ఎస్ , బీజేపీ మధ్య ఉంటుందని అనుకున్నారు. కానీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్  అనుకూలంగా వచ్చాయి.  బీజేపీ  రెండు ప్రధాన పార్టీలకు ధీటైన ప్రత్యామ్నాయం అని నిరూపించుకునే ప్రయత్నం చేసింది. కారణం ఏదైనా బీజేపీకి పదమూడు శాతానికిపైగా ఓట్లు వచ్చాయి. ఎనిమది  చోట్ల గెలవడంతో పాటు మరో పదిహేడు స్థానాల్లో రెండో స్థానంలో నిలిచారు. ఈ లెక్కల్ని తక్కువ చేయలేం. అన్నింటి కంటే మించి బీజేపీ రాజకీయాలు.. ఆ పార్టీ హైమాండ్ పెద్దలు తమ పార్టీని  బలోపేతం చేసుకునేందుకు అమలు చేసే వ్యూహాల గురించి తెలిసిన వారికి మాత్రం.. వచ్చే కొద్ది నెలల్లో తెలంగాణలో జరగబోయే పరిణామాల్ని అంచనా వేస్తున్నారు. వాటిలో ప్రధానంగా ఉండేది.. బీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకోవడం లేదా.. ఆ పార్టీని వీలైనంతగా బలహీనం చేసి బీజేపీని బలోపేతం చేయడం.

బీఆర్ఎస్‌కు పోటీగా రెండు జాతీయ పార్టీలు ఉన్నాయి. ఒకటి రాష్ట్రంలో అధికారంలో ఉంది. మరొకటి కేంద్రంలో అధికారంలో ఉంది. ఈ రెండు పార్టీలను కేసీఆర్ ఎదుర్కోవాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీ గత అనుభవాల కారణంగా ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఆకర్షిస్తుంది.  గతంలో రెండు సార్లు తమ పార్టీ ఎల్పీలను విలీనంచేసుకున్నందున..  ఈ సారి బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంది. ప్రస్తుతం బీఆర్ఎస్ తరపున గెలిచిన ఎమ్మెల్యేల్లో విర విధేయులు తక్కువే. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ నుంచి గెలిచిన వారిలో పద్మారావు లాంటి వారు తప్ప అందరూ ఇతర పార్టీల్లో గెలిచి .. బీఆర్ఎస్ లో పిరాయించి వచ్చిన వారే. అధికార పార్టీ అన్న కోణంతో  బీఆర్ఎస్ లో చేరిన వారే. ఇప్పుడు వారిపై ఆ స్థాయిలో  ఒత్తిడి వస్తే మళ్లీ అభివృద్ధి కోసం అధికార పార్టీ అనే కాన్సెప్ట్ ఎంచుకోరని ఏమీ లేదు. అదే సమయంలో బీజేపీ కూడా తన వంతు ప్రయత్నం చేస్తే ఎమ్మెల్యేలను కాపాడుకోవడం తలకు మించిన భారమే అవుతుంది.

ఇప్పుడు బీఆర్ఎస్‌కు 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. నిజానికి ఇది మంచి బలమే. 119 స్థానాలున్న అసెంబ్లీలో 39 స్థానాలతో అధికార పక్షంపై గట్టిగా పోరాడవచ్చు. కానీ ప్రస్తుత రాజకీయాలు ఎలా మారిపోయాయంటే.. ఆ 39 మంది ఎమ్మెల్యేల్లో ఎంత మంది పార్టీలో ఉంటారు..ఎంత మంది అభివృద్ధి కోసం ఇతర పార్టీల్లోకి వెళ్లిపోతారన్నది సస్పెన్స్ గానే ఉంది. ఫలితాలు వచ్చిన తర్వాత కేటీఆర్, కేసీఆర్ జరిగిన సమావేశాలకు నలుగురు ఐదుగురు ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. అలాగే రేవంత్ రెడ్డిని ఓ ఎమ్మెల్యే కలిశారు.  ఇలాంటి రాజకీయాలు చేయడంలో కేసీఆర్ .. ఓ దారి చూపారు.  ఆయన రెండు సార్లు  కాంగ్రెస్, టీడీపీ ఎల్పీలను టీఆర్ఎస్ఎల్పీలో విలీనం  చేసుకున్నారు. అంతే కాకుండా ఎమ్మెల్యేలను ఎలా ఆకర్షించాలో కూడా ఆయన చూపించారు.  కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు నెలలు.. ఏడాదిలో పడిపోతుందని..తర్వాత బీఆర్ఎస్ వస్తుందని కడియం శ్రీహరి పలితాలు వచ్చిన తర్వాత మాట్లాడారు. ఇలాంటి మాటల వల్ల ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకుని ప్రభుత్వాన్ని బలోపేతం చేసుకోవడం తప్పు కాదని అధికార పార్టీలు భావిస్తాయి. తెలంగాణలో  జాతీయ పార్టీలు అవే అనుకుంటున్నాయి.రెండు అధికార కేంద్రాలతో అధికారం పోగొట్టుకున్న కేసీఆర్ పోరాడటం అంత తేలిక కాదు.  వెంటాడే కాసులు..  వయసు.. అన్నీ ఇబ్బందికరంగా మారతాయి. అందుకే కేసీఆర్ ఇప్పుడు కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది.

బలమైన పార్టీ అయినా  రెండు జాతీయ పార్టీలతో పోరాడటం అంటే.. కేసీఆర్ కు..బీఆర్ఎస్‌కు అంత తేలిక కాదు. ఎందుకంటే పదేళ్ల పాటు అధికారంలో ఉండటం వల్ల అనేక రకాల ఆరోపణలు ఉన్నాయి.  సీఎంగా ఉండటం వల్ల..  ఢిల్లీలిక్కర్ స్కాంలో కవిత అరెస్టు కాకుండా తప్పించగలిగారని చెప్పుకున్నారు. కనీ ఇప్పుడు పవర్ పోయింది. ఇప్పుడు నిస్సహాయంగా చూస్తూ ఉండాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వం చేసే విచారణల వల్ల మరింత టెన్షన్ ఎదుర్కోవాలి. అందుకే ఇప్పుడు ఏదో ఓ జాతీయ పార్టీతో కేసీఆర్ అవగాహనకు రావాల్సి ఉంటుంది. ఎన్డీఏలో చేరేందుకు కేసీఆర్ ప్రయత్నించారని స్వయంగా మోదీ  చెప్పారు. ఆయనను చేర్చుకునేది లేదని.. ఇది తన గ్యారంటీ అని ఎన్నికల ప్రచారంలో కూడా ప్రకటించారు. కానీ  దక్షిణాది నుంచి ఓ బలమైన మిత్రపక్షాన్ని  బీజేపీ కోరుకుంటోంది. ఒక వేళ  బీఆర్ఎస్ ను చేర్చుకోవాలని అనుకుంటే.. తిరస్కరించే అవకాశం బీఆర్ఎస్ పెద్దల్లో ఉండదు. కొంత ప్రొటెక్షన్ కోసమైనా అంగీకరించక తప్పదని రాజకీయవర్గాల నిశ్చితాభిప్రాయం.

ఎన్నికలకు ముందు వరకూ  బీఆర్ఎస్ కు రెండు చాయిస్ లు ఉన్నాయి. రెండు పార్టీల్లో దేనితోనైనా కలిసే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు తెలంగాణలోకాంగ్రెస్ అధికారంలోకి రావడం వల్ల ఆ పార్టీతో కలిసే అవకాశం ఉండదు. అలా కలిస్తే నేరుగా  బీజేపీ నోట్లో చిక్కినట్లేనన్న అబిప్రాయం కూడా వినిపిస్తోంది. కేసీఆర్ ఇప్పుడు రెండే ఆప్షన్లు ఉన్నాయని అందులో ఒకటి ఒంటరిగా రెండు జాతీయ పార్టీలతో ఫైట్ చేయడం.. రెండోది.. బీజేపీతో కలవడం. రెండు ఆప్షన్లు కూడా రెండు వైపులా పదునున్న కత్తిలాంటివే. కేసీఆర్  రాజకీయ చాణక్యమే బీఆర్ఎస్ పార్టీని కాపాడాల్సి ఉంది.  కేసీఆర్ ఈ ఎన్నికల్లో అతి విశ్వాసంతో చేసిన తప్పులు చూస్తే ఆయన కూడా ఆత్మవిశ్వాసంతో ఇక ముందు నిర్ణయాలు తీసుకోలేరు. అందుకే బీఆర్ఎస్ వచ్చే ఎన్నికల వరకూ సర్వైవ్ అయితే.. . అదే గొప్ప విజయం అని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.

ప్రాంతీయపార్టీలు అధికారం కోల్పోతే మనుగడ సమస్యను ఎదుర్కొంటూ ఉంటాయి.  కొన్ని పార్టీలే అతి కష్టం మీద నిలబడుతూ వస్తున్నాయి. అలాంటి పార్టీల్లో బీఆర్ఎస్ ఉంటుందా లేదా అన్నది వచ్చే రెండు, మూడేళ్లలో తేలిపోతుంది…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి