తెలంగాణాలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డితో పాటు 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. మరో ఆరు మందిని కేబినెట్ లో తీసుకోడానికి అవకాశాలు ఉన్నాయి. వారిని త్వరలో మంత్రి వర్గ విస్తరణలో తీసుకోవచ్చునని భావిస్తున్నారు. ప్రస్తుతం తీసుకున్న మంత్రులను వారి ప్రాంతాలు సామాజిక వర్గాల ఆధారంగా ఎంపిక చేశారు.తాము ప్రజలకు సేవకులమే అన్నారు కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. డిప్యూటీ సిఎంగా మల్లు భట్టి విక్రమార్క ప్రమాణ స్వీకారం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు నల్లగొండ జిల్లాకు చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట రెడ్డి, ఖమ్మం జిల్లాకు చెందిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి -ఈ నలుగురూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కాగా.. మల్లు భట్టి విక్రమార్క, దామోదర రాజనరసింహలు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు. బీసీ సామాజిక వర్గం నుంచి కొండా సురేఖ,పొన్నం ప్రభాకర్ లకు అవకాశం దక్కింది.వెలమ సామాజిక వర్గానికి చెందిన జూపల్లి కృష్ణారావు, కమ్మ సామాజిక వర్గానికి చెందిన తుమ్మల నాగేశ్వరరావు, బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన దుద్దిళ్ల శ్రీధర్ బాబు లు కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు. ఎస్టీ సామాజిక వర్గం నుంచి సీతక్క కు అవకాశం దక్కింది. ఖమ్మం జిల్లాకు మూడుమంత్రి పదవులు లభించాయి. నల్లగొండ ,ఉమ్మడి కరీంనగర్ , వరంగల్ ,మహబూబ్ నగర్ జిల్లాల నుండి ఇద్దరేసి చొప్పున మంత్రులయ్యారు.మెదక్ జిల్లా నుండి దామోదర రాజనరసింహ మంత్రి అయ్యారు.
నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలనుండి ఎవరినీ తీసుకోలేదు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వికారాబాద్ ఎమ్మెల్యే గెడ్డం ప్రసాద్ ను స్పీకర్ గా తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ కు ఒక్క సీటు కూడా దక్కని సంగతి తెలిసిందే. ఆదిలాబాద్ జిల్లా నుంచి గెలిచి ఎమ్మెల్యేలు అయిన గెడ్డం వివేక్, గెడ్డం వినోద్ లు కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నారు. ఈ ఇద్దరు సోదరుల్లో ఎవరో ఒకరికి మంత్రి పదవి రావచ్చునని ప్రచారం జరిగింది. అయితే మొదటి మంత్రివర్గంలో ఎవరికీ అవకాశం రాలేదు. కేబినెట్ లో మరో ఆరుగురికి చోటు ఉన్న నేపథ్యంలో వీరిలో ఒకరికి విస్తరణలో బెర్త్ దక్కచ్చని అంచనా వేస్తున్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి, నిజామాబాద్ నుండి పోటీ చేసి ఓటమి చెందిన షబ్బీర్ అలీ, ఎల్బీ నగర్ నుండి పోటీ చేసి పరాజయం పాలైన మధు యాష్కి గౌడ్, జూబ్లీహిల్స్ లో ఓటమి చెందిన అజారుద్దీన్ లు తమని ఎమ్మెల్సీగా తీసుకుని మంత్రి పదవులు ఇస్తారన్న ఆశతో ఉన్నారు. కాంగ్రెస్ తరపున గెలిచిన వారిలో మైనారిటీలు లేకపోవడంతో సీనియర్ అయిన షబ్బీర్ అలీకి గ్యారంటీగా ఛాన్స్ ఉంటుందని భావిస్తున్నారు. అదే విధంగా బీసీ కోటాలో మధుయాష్కీ గౌడ్ కూడా ఆశలు పెట్టుకున్నారు. ఎస్సీ వర్గానికి చెందిన అద్దంకి దయాకర్ సైతం ఎమ్మెల్సీ అయ్యి మంత్రి కావాలని అనుకుంటున్నట్లు సమాచారం.
బి.ఆర్.ఎస్. ప్రభుత్వం చేసిన తప్పులను తాము చేయమంటున్నారు రేవంత్ రెడ్డి. ప్రజలకు జవాబుదారీతనంతో వ్యవహరిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసి తీరతామన్నారు. శాఖల కేటాయింపులోనూ అనుభవానికి పెద్ద పీట వేశారు. ఆరు సార్లు గెలిచి గతంలో పైలట్ గా వ్యవహరించిన ఉత్తమ్ కుమార్ రెడ్డికి హోంశాఖ, డిప్యూటీ సిఎం భట్టికి రెవిన్యూ శాఖ ఇవ్వగా తుమ్మల నాగేశ్వరరావుకు ఆర్.అండ్.బి. శాఖ ఇచ్చారు. మంథని నుండి అయిదు సార్లు గెలిచిన శ్రీధర్ బాబుకు ఆర్ధిక శాఖ అప్పగించారు. కోమటి రెడ్డి వెంకట రెడ్డికి మున్సిపల్ వ్యవహారాల శాఖ, దామోదర రాజనరసింహకు వైద్య ఆరోగ్య శాఖ,సీతక్కకు గిరిజన సంక్షేమం, కొండా సురేఖకు స్త్రీ శిశుసంక్షేమం, పొన్నం ప్రభాకర్ కు బీసీ సంక్షేమం, జూపల్లి కృష్ణారావుకు పౌర సరఫరాలు, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సాగునీటి పారుదల శాఖ కేటాయించారు.
ప్రగతి భవన్ ను ప్రజాదర్బార్ నిర్వహణకు కేటాయించారు. దానికి జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్ అని పేరు పెట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలపై ముందుగా దృష్టి సారించారు. వీటిలో రెండు గ్యారంటీలను సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా డిసెంబరు 9నుండి అమలు చేస్తామని ప్రకటించారు. వాటిలో ముఖ్యమైనది ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని అదే రోజు నుంచి అమలు చేస్తారు. కొద్ది వారాల తర్వాత మిగతా బెర్త్ లను భర్తీ చేసే అవకాశం ఉంది. మొత్తం మీద రేవంత్ టీమ్ కాగితంపైనే కాదు అనుభవం రీత్యాకూడా పటిష్ఠంగానే కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…