తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. తొమ్మిదేళ్ల బి.ఆర్.ఎస్. పాలన లేదిపుడు. కేసీయార్ స్థానంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. తెలంగాణాలో ఈ అధికార మార్పిడి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపే అవకాశాలున్నాయన్న దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి సొంత పార్టీ పెట్టుకుని ముఖ్యమంత్రి అయిన జగన్ మోహన్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ తరపున ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ఇంచుమించు ఒకే ఏజ్ గ్రూప్ వారు. ఈ ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధాలుంటే రెండురాష్ట్రాల మధ్య మంచి వాతావరణం ఉండే అవకాశాలుంటాయి. అయితే ఇద్దరి మధ్య సయోధ్య ఉంటుందా? అన్నదే ప్రశ్న.
తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి తొమ్మిదేళ్లూ తెలంగాణాలో భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉండింది. ఆ పార్టీ అధినేత కేసీయార్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. కేసీయార్ ఉన్నంత కాలం ఏపీ -తెలంగాణాల మధ్య మంచి వాతావరణమే ఉండింది. కేసీయార్-జగన్ మోహన్ రెడ్డిల మధ్య కూడా మంచి అవగాహన స్నేహ సంబంధాలే ఉండేవి. అందుకే రెండు తెలుగు రాష్ట్రాలూ సన్నిహితంగానే ఉన్నాయి. ఓ దశలో ఏపీలోని ప్రతిపక్షం అయిన టిడిపి కూడా వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కేసీయార్ ల మధ్య స్నేహం కారణంగా ఏపీకి అన్యాయం జరుగుతోందని చిత్రీకరించే ప్రయత్నం చేసింది కూడా. అయితే ఆ ఇద్దరు ముఖ్యమంత్రులు వీటిని అధిగమించగలిగారు.
ఇపుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి. జగన్ మోహన్ రెడ్డి ఏమో గతంలో కాంగ్రెస్ లో ఎంపీ. జగన్ మోహన్ రెడ్డి తండ్రి దివంగత వై.ఎస్.ఆర్. ఉమ్మడి ఏపీలో ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. అయితే ఆయన మరణానంతరం జగన్ మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర విషయంలోనే పార్టీ అధిష్ఠానానికి ఆయనకూ మధ్య అభిప్రాయ బేధాలు వచ్చాయి. దాంతో ఆయన కాంగ్రెస్ కు రాజీనామా చేసి సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగింది. ఏపీలో మొదటి ఎన్నికల్లో ప్రతిపక్షంగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో తిరుగులేని విజయాలతో భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ అధికారంలోకి రాలేకపోయింది. తెలంగాణాలో చెప్పుకోడానికి కొన్ని సీట్లు అయినా వచ్చాయి. ఏపీలో ఇంత వరకు కాంగ్రెస్ ఒక్క చోట కూడా గెలవలేకపోయింది.
వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లో ఉన్న చాలా మంది సీనియర్లు గతంఓ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారే. రేవంత్ రెడ్డి 53 ఏళ్ల వయసులో ముఖ్యమంత్రి అయ్యారు. జగన్ మోహన్ రెడ్డి రేవంత్ తో పోలిస్తే ఆరేళ్ల తక్కువ వయసులోనే అంటే 47 ఏళ్లకే ముఖ్యమంత్రి అయ్యారు. ఇద్దరి మధ్య మూడేళ్లే తేడా. అంటే ఇంచుమించు ఒకే ఏజ్ గ్రూప్ వారు. అంచేత ఇద్దరి ఆలోచనా విధానం దగ్గర్లోనే ఉండే అవకాశాలుంటాయి. ఇద్దరి మధ్య వేవ్ లెంగ్త్ కూడా కుదిరే అవకాశాలే ఎక్కువ. అదే కేసీయార్, చంద్రబాబు వంటి వారు అయితే ఏడుపదుల వయసు దాటిన వారు కాబట్టి జెనరేషన్ గ్యాప్ చాలా ఎక్కువ. రెండు తరాల మధ్య ఆలోచించే తీరులోనూ..నిర్ణయాలు తీసుకునే విధానంలోనూ మార్పులు ఉంటాయి. కానీ జగన్ మోహన్ రెడ్డి రేవంత్ రెడ్డిల మధ్య ఈ సమస్య ఉండే అవకాశం ఉండదంటున్నారు మేథావులు.
ఇటు జగన్ మోహన్ రెడ్డి అటు రేవంత్ రెడ్డి ఇద్దరూ కూడా రాజకీయాల్లో స్వయంకృషితో ఎదిగిన వారే. 2009లో మొదటి సారి ఎంపీ అయిన జగన్ మోహన్ రెడ్డి 2019కల్లా ముఖ్యమంత్రి అయిపోయారు. 2006లో జెడ్పీటీసీ గా గెలిచి రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టిన రేవంత్ రెడ్డి 2023 కి ముఖ్యమంత్రి కాగలిగారు. సొంతంగా ఆలోచించే సామర్ధ్యం ఉండడం ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే సాహసం ఇద్దరిలో కనిపించే లక్షణం అంటున్నారు నిపుణులు. అందుకే ఈ ఇద్దరి హయాంలో ఏపీ-తెలంగాణాల మధ్య సుహృద్భావ వాతావరణం కొనసాగే అవకాశాలు ఉంటాయని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అనవసర రాజకీయాలను ఇద్దరూ అసహ్యించుకుంటారు కాబట్టి ఓట్ల కోసం మనుషుల్లో ఉద్వేగాలు రెచ్చగొట్టడానికి ఇద్దరూ వ్యతిరేకమే. అందుకే ఇద్దరూ ఒకలా ఆలోచిస్తారని అంటున్నారు సైకాలజిస్టులు.
ఏపీ తెలంగాణా ప్రజలు అన్నదమ్ముల్లా కలిసిపోతారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ ప్రజల మధ్య బేధాలు లేవు. రాజకీయ పార్టీల నేతలే వాటిని రాజేశారు. తెలంగాణాకు అన్యాయం జరిగినా అవి రాజకీయ పరమైన నిర్ణయాల వల్లనే తప్ప రెండు ప్రాంతాల ప్రజలకు సంబంధించిన అంశం^కాదు. అధికారంలో ఉండే వారు..ప్రభుత్వాలను ఏలిన వారు తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల తెలంగాణా ప్రాంతం వివక్షకు గురైందన్నది వాస్తవం. అయితే ఎవరి రాష్ట్రాలు వారికి ఏర్పాటు అయిన తర్వాత ఎవరి ప్రభుత్వాలు వారికి ఉన్న తర్వాత ప్రజల మధ్యే కాదు ప్రభుత్వాల మధ్య రాజకీయ పార్టీల మధ్య కూడా విబేధాలు..విద్వేషాలు అవసరమే లేదు. అందుకే కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి-వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిలు రెండు తెలుగు రాష్ట్రాలను సమాంతరంగా అభివృద్ధి చేస్తూ అన్నదమ్ముల్లా ముందుకు సాగుతారని ఆశిద్దాం…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…