ప్రశ్నలు అడగడానికి డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలపై తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రా లోక్ సభ సభ్యత్వం రద్దు చేశారు. పార్లమెంట్ లో తన వాదన వినిపించే అవకాశం కూడా ఆమెకు ఇవ్వలేదు. ఆమెకు ఐదు నిమిషాల సమయం ఇస్తే ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి మైక్ ఇవ్వలేదు. అరగంటలో సభ్యత్వాన్ని రద్దు చేసేశారు. పార్లమెంట్లో మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడే గొంతుల్లో నెంబర్ వన్ మహువా మొయిత్రాది. అదానీ అంశాలతో పాటు మోదీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందు ఉంచారు. ఆమె ప్రసంగాలు అనేక సార్లు వైరల్ అయ్యాయి. అలాంటి గొంతును అర్థం పర్థం లేని ఆరోపణలతో బహిష్కరించడం ఎవరికి అవమానం. మహువా మొయిత్రాకా… దేశప్రజాస్వామ్యానికా ?
దేశంలో అత్యంత వివాదాస్పదమైన పారిశ్రామికవేత్త అదానీ. అదానీ గురించి పార్లమెంట్ మాట్లాడే ధైర్యం ఉన్న అతి కొద్ది మంది ఎంపీల్లో మహువా మొయిత్రా ఒకరు. ఆమె నిజంగా డబ్బులకు ఆశ పడే ఎంపీనే అయితే.. అదానీ నుంచి ఎన్ని ఆఫర్లు వచ్చి ఉంటాయో సామాన్యుడు ఊహించడం పెద్ద విషయం కాదు. కానీ అదానీ అక్రమాలుతో పాటు ప్రతి అంశాన్ని ఆమె లోక్ సభ ముందుపెట్టే విషయంలో ఎప్పుడూ భయపడలేదు. తన వ్యక్తిగత జీవితంలో వచ్చిన విబేధాల వల్ల వెలుగులోకి వచ్చిన కొన్ని వివరాల సాయంతో..కంట్లో నలుసుగా ఉన్న మహువాపై వేటు వేశారు. ఇలాంటి అవకాశం కోసం బీజేపీ చాలా కాలంగా ఎదురు చూస్తోంది. దొరకగానే వేటు వేసింది. అదే గొప్ప విజయంగా సెలబ్రేట్ చేసుకోవచ్చు. కానీ అది విజయం కాదు. ఆమెను ఎదుర్కోలేకపోవడం.
మహువా మొయిత్రా పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణ నగర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. ప్రధాని మోడీ ప్రభుత్వంపై సభలో నిర్భయంగా దండెత్తి ఫైర్ బ్రాండ్ ఎంపిగా పేరు తెచ్చుకున్నారు. రాజకీయం ప్రధానంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మీద నిలబడుతుంది. ఇలాంటి పార్లమెంటరీ వ్యవస్థల్లో విలువలు ఎలా దిగజారిపోతున్నాయో కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. అయితే ఇలాంటి సందర్భాల్లోనూ ప్రజాస్వామ్య పునాదుల్ని పటిష్టం చేసేలా కొంత మంది మెరుపు తీగలు… ఆవిర్భవిస్తూనే ఉంటాయి. అలాంటి వారిలో ఒకరు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా. పార్లమెంట్లో ఆమె అడిగిన ప్రశ్నలకు.. ప్రభుత్వం వద్ద సమాధానం ఉండదు. ఏమైనా ఉంటే..ఎదురుదాడి మాత్రమే. ఎందుకంటే.. పక్కా వివరాలతో.. సూటిగా .. సుత్తి లేకుండా మొయిత్రా చేసిన ప్రసంగంలో లోపాలే ఉండవు. అందుకే ఆమె ప్రసంగాలు అనేక సార్లు వైరల్ అయ్యాయి. మహువా మొయిత్రా ఎప్పుడు పార్లమెంట్లో మాట్లాడినా.. . ఆ స్పీచ్ వైరల్ అవుతుంది. బీజేపీ నాయకులకు నిద్రపట్టకుండా చేస్తుంది. ఆమె ప్రసంగ శైలికి.. ప్రభుత్వాన్ని నిలదీసే విధానానికి లక్షల మంది అభిమానులు ఉన్నారు.
కోల్‌కతాలో పుట్టి ఉన్నత చదువులు చదువుకుని విదేశాల్లో ఉన్నతోద్యగం కూడాచేసిన మహువా మెయిత్రా తృణమూల్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. ఎప్పుడూ భయపడింది లేదు. ఆమె బీజేపీపై విరుచుకుపడే విధానం.. ఆ పార్టీ విధానాల్ని ఖండించే తీరును… ఎలా ఎదుర్కోవాలో బీజేపీ నేతలకు తెలియదు. అందుకే ఆమె ఖరీదైన హ్యండ్ బ్యాగ్ వాడతారని.. ఓ సారి ఫోటోలు తీసి వైరల్ చేస్తారు. బహిరంగంగా చేతితో పట్టుకునే బ్యాగ్ ను కూడా… దాచి పెడుతున్నారంటూకథలు అల్లుతారు. ఓ సారి వేరే ఎంపీకి చెందిన కారులో పార్లమెంట్‌కు వస్తే అది ఆమేదేనని బీజేపీ సోషల్ మీడియా ప్రచారం చేసింది. అయితే ఇలాంటి ప్రచారాలకు ఎక్కడా ఒణకడం.. తొణకడం.. ఆమె పద్దతి కాదు. వారికి వారి పద్దతిలోనే సమాధానం చెబుతారు. మహువా మొయిత్రా ఆమె ఒక సైన్యంలా పోరాడారు. బీజేపీ విషయంలో ఎంతో మంది వెనక్కి తగ్గినా.. ఆమె మాత్రం తన వాయిస్‌లో బేస్ తగ్గనివ్వ లేదు. ఇలాంటి ఫైటర్ల వల్లే ప్రజాస్వామ్యం కాస్త గట్టిగా నిలబడుతూ ఉంటుదనేది ఎక్కువ మంది అభిప్రాయం.
వేచి చూసి సరైన సమయం చూసి.. ఆమె వ్యక్తిగత జీవితంలో ఏర్పడిన కొన్ని పరిణామాల వల్ల బయటపడిన సమాచారంతో బీజేపీ నేతలు ఆమె గొంతు నొక్కేశారు. ఆమె పార్లమెంట్ లాగిన్ దుర్వినియోగం చేశారని.. అదానీకి వ్యతిరేకంగా ప్రశ్నలు అడిగేందుకు మరో వ్యాపారవేత్త వద్ద డబ్బులు తీసుకున్నారని.. తన లాగిన్ ను ఆ వ్యాపారవేత్తకు ఇచ్చారని తెలుసుకుని.. తమ పని పూర్తి చేశారు. నిజానికి అదానీ అక్రమాలు బయట పెట్టడానికి ఆ లాగిన్ వాడుకున్నారు కానీ.. ఆమె రూపాయి తీసుకున్నారన్న విషయాన్ని ఎథిక్స్ కమిటీ నిర్ధారించలేదు. మహువా మొయిత్రా లంచం తీసుకోడం గాని, అందుకు ఒప్పుకోవడం గాని జరిగినట్టు సాక్ష్యాధారాలు లేవు. వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి లంచం తీసుకొని అదానీ గ్రూపుపై ఆరోపణలతో లోక్‌సభలో ప్రశ్నలు వేశారని బిజెపి ఎంపి నిశికాంత్ దూబే చేసిన ఆరోపణను ఎథిక్స్ కమిటీ ఆమోదించి సిఫారసు చేయడంతో శుక్రవారం నాడు స్పీకర్ ఓం బిర్లా ఆమె సభ్యత్వాన్ని రద్దు చేశారు. దీంతో దేశం మొత్తం నివ్వెర పోయింది.
ఇలా చాన్స్ దొరకగానే వేటు వేసేశారు. గట్టి వాయిస్ ఉన్న ఓ మహిళా ఎంపీ.. అర్థం పర్థం లేని ఆరోపణలతో బహిష్కరిస్తే అది చెడు సంప్రదాయం అవుతుందన్న ఆందోళన ప్రజాస్వామ్య వర్గాల్లో ఉంది.
మహువా మొయిత్రా రాజకీయ నేపధ్యం నుంచి వచ్చిన వారు కాదు. ఉన్నత కుటుంబం నుంచి వచ్చారు. 2010లో టీఎంసీలో చేరడానికి ముందు విదేశాల్లో బ్యాంకర్‌గా పనిచేశారు. కోట్ల రూపాయల జీతాన్ని వదులుకుని రాజకీయాల్లోకి వచ్చారు. ఆమె మొదట కాంగ్రెస్ లో పని చేశారు. తర్వాత తృణమూల్ లో గెలిచారు. మొదట ఎమ్మెల్యే్ అయ్యారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణానగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో మొయిత్రా 60 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అప్పట్నుంచి ఆమె మోదీ, బీజేపీ ప్రభుత్వం, అదానీని విమర్శించడంలో ఎక్కడా తగ్గడం లేదు. ఆమె దూకుడు వల్ల బీజేపీ టార్గెట్ చేస్తోందని మమతా బెనర్జీ ఆమెను కాస్త దూరం పెట్టినా తగ్గలేదు. ఇప్పుడు మమతా బెనర్జీ కూడా ఆమెకు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నారు.
2018 లో ఆరుగురు బిజెపి ఎంపిలు సహా 10 మంది లోక్‌సభ సభ్యులు కోబ్రా పోస్ట్ అనే డిజిటల్ పోర్టల్ పన్నిన ఆపరేషన్ దుర్యోధన అనే స్టింగ్ వలలో చిక్కుకొన్నారు. లంచం తీసుకొని యుపికి చెందిన ఒక కల్పిత కంపెనీ తరపున ప్రశ్నలు అడగడానికి అంగీకరించి దొరికిపోయారు. వారి లోక్‌సభ సభ్యత్వాలను అప్పటి స్పీకర్ సోంనాథ్ చటర్జీ రద్దు చేశారు. ఇప్పుడు అటువంటి స్టింగ్ ఆపరేషన్ జరగలేదు. లాగిన్ వేరే వారు ఉపయోగించారన్నది తప్ప.. డబ్బులు తీసుకున్నారని ఎక్కడా లేదు. ప్రధాని నరేంద్ర మోడీని ఇరకాటంలో పెట్టే విధంగా సభలో మాట్లాడినందుకే మహువాపై బహిష్కరణ వేటు వేశారన్న అభిప్రాయాన్ని ఎక్కువ మంది నుంచి వినిపిస్తున్నాయి. కనీసం సమాధానం చెప్పుకోడానికి ఆమెకు అవకాశం ఇచ్చి ఉండాల్సింది. అలా చేయకుండా గతంలో సోమ్‌నాథ్ చటర్జీ తీసుకొన్న వైఖరిని పాటిస్తున్నామని చెప్పి మహువా సభ్యత్వాన్ని రద్దు చేయడం ఏకపక్ష చర్యేనని ప్రజాస్వామ్య వాదులు విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీని లోక్‌సభ సభ్యత్వం నుంచి బహిష్కరించిన తర్వాత మహువాపై తీసుకొన్న చర్య అదే రీతిని తలపించడం ప్రజాస్వామ్యానికి డేంజర్ బెల్స్ ను సూచిస్తోంది.
మొత్తానికి అన్ని వైపుల నుంచి కుట్రలు చేసి.. ఒక ఫైర్ బ్రాండ్ ఎంపి లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయించారన్న అభిప్రాయం సామాన్య జనంలో పెరిగిపోతోంది. అధికారంలో వున్న వారు తమ రాజకీయ ప్రత్యర్థుల నోరు మూయించడానికి ఇటువంటి పన్నాగాలు పన్నుతున్నారని అర్థం చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఎవరి అవమానం. మహువాకా.. భారత ప్రజాస్వామ్యానికా అనేది ఇలాంటి చర్యలకు పాల్పడేవారే ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ఓ ఫైర్ బ్రాండ్ మహిళా లీడర్ ను ఎదుర్కోలేక ఏకంగా సభ్యత్వాన్నే రద్దు చేశారని ప్రజలు అనుకుంటే ఆ మచ్చ పాలకులు చెరిపేసుకోలేరు.
ప్రజలు ఎన్నుకున్న ఓ ప్రజాప్రతినిధి సభ్యత్వాన్ని ఎథిక్స్ కమిటీ సిఫారసుతో ఎలాంటి విచారణ లేకుండా వేటు వేయడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం. కానీ లోక్ సభ స్పీకర్ కు అధికారం ఉంది. అధికారం ఉందని అలా చేయడం ప్రజాస్వామ్యం మాత్రం కాదు. ఆ ముసుగేసుకున్న నియంతృత్వమే…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…