తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర, సంచలనాత్మక కార్యాచరణకు దిగారు. వ్యవస్థలనే ప్రక్షాళణ చేసేందుకు సిద్ధమయ్యారు. ఆ పని వంద రోజుల్లో పూర్తి చేయాలనుకున్నారు. మొత్తం వ్యవస్థను గాడిలో పెట్టాలనుకున్నారు.ఆ దిశగా మన తన తేడా లేకుండా కొట్టాలనుకున్నారు. అధికారులైనా, రాజకీయ నాయకులైనా అందరూ తనకు ఒకటేనని తేల్చేశారు..
కొత్త ప్రభుత్వంపై మాజీ ఆర్థిక మంత్రి హరీష్ రావు అటాకింట్ మొదలు పెట్టేశారు. రైతు బంధు పైసలు ఏమయ్యాయి. ధాన్యం బోసన్ సంగతి తేల్చరేమిటి అని నిలదీసేందుకు హరీష్ రావు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు హరీష్ రావు ప్రయత్నిస్తుంటే అంతకంటే ఫోర్స్ గా తెలంగాణ మంత్రులు కౌంటర్ అటాక్ చేస్తున్నారు. హరీష్ రావుకు అసలు విలువలు లేవని, రాష్ట్రాన్ని తన మామ కేసీఆర్ కు దోచి పెట్టారని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఎదురుదాడి చేశారు. గంటల వ్యవధిలో జరిగిన ఈ పరిణామం కాంగ్రెస్ ప్రభుత్వ వేగానికి ఒక నిదర్శనం మాత్రమే. ఏదో చెప్పాలి కాబట్టి హరీష్ రావుకు బదులిచ్చారే తప్ప ఆయనకు సమాధానం చెప్పడం ప్రభుత్వ అజెండాలోనే లేదు. ప్రజలకు ఉపయోగపడే పనులు చేయడం, అవినీతిపరుల భరతం పట్టడమే రేవంత్ రెడ్డి సర్కారు జంట అజెండాగా కనిపిస్తోంది.
దోచుకున్న సొమ్మును కక్కించాలన్నది రేవంత్ ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. ఎన్నికల ముందు జరిగిన అన్ని లావాదేవీలను బయటకు తీసి వాటి సంగతి చూడాలన్నది ధ్యేయంగా తెలుస్తోంది. పదవుల కోసం నానా గడ్డి కరచి వ్యవస్థలను నిర్వీర్యం చేసిన బ్యూరోక్రాట్ల భరతం పట్టాలన్నదే కర్తవ్యంగా అనిపిస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే అందుకు ప్రభుత్వం నిర్దేశించుకున్న గడువు కూడా వందరోజులే ఉందేమో అన్న అనుమానం కలుగుతోంది….
రేవంత్ ఇప్పుడు గ్యారెంటీలపై దృష్టి పెట్టి మిగతా పనులను మానుకున్నారనుకుంటే పొరబాటే. జనం మీద పడి బతికిన సలహాదారులు, కార్పొరేషన్ల చైర్మన్లు, అకాడమీలు, పీఏలు, పీఆర్వోలు, పీఎస్‌లు, ఎక్స్‌టెండెడ్ సర్వీసులు… ఇలా తెలంగాణ ఖజానాకు పట్టిన చీడ పురుగులను వదిలించే పని వేగవంతమైంది. రాజీనామాలు చేయకపోతే ప్రభుత్వమే జీవోలు ఇచ్చి బయటికి తరిమే చర్యలు చేపట్టింది. విద్యుత్ సంస్థలను 82 వేల కోట్ల అప్పుల్లోకి నెట్టిన వారిని విచారించేందుకు కూడా సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సరిగ్గా ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత గ్రేటర్ పరిధిలో జరిగిన భూలావాదేవీలు, ప్రభుత్వ భూములను పందేరం చేసిన తీరుపై విచారణ జరపబోతున్నట్లు కూడా సమాచారం అందుతోంది. బీఆర్ఎస్ కు కొమ్ముకాసిన పోలీసులు, ఎన్నికల సమయంలోనూ అధికార పార్టీ వారిని భుజానికి ఎత్తుకున్న ఖాకీల పని పట్టాల్సిన తరుణం వచ్చిందని కూడా రేవంత్ నిర్ణయించారు. గుట్టుచప్పుడు కాకుండా ఈ కార్యాచరణ మొదలైందని అంటున్నారు.
కబ్జాలుపోగా గ్రేటర్ లో మిగిలిన భూములేమిటో తేల్చే పనిలో రేవంత్ సర్కారు బిజీగా ఉంది. కరెంట్ సొమ్ము దోపిడీ వెనుక ఉన్న పెద్దలెవరో నిగ్గు తేల్చాల్సిన తరుణం వచ్చిందని కూడా గుర్తించింది. కనిపించకుండా మొహం చాటేస్తున్న కొందరు అధికారుల సంగతి కూడా చూడాలని భావిస్తోంది. హరీష్ రావు ఎంత మొత్తుకున్నా ఈ పనుల నుంచి ప్రభుత్వాన్ని డైవర్ట్ చేయలేరన్నది మాత్రం నిజం.. ఆయన ప్రయత్నాలు ఆయనవి….
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…