నాడు అర్జునుడు నేడు అభిమ‌న్యుడు

By KTV Telugu On 13 December, 2023
image

KTV TELUGU :-

కాక‌లు తీరిన రాజ‌కీయ నాయ‌కుడు. వ్యూహాలు ఎత్తుగ‌డ‌ల్లో చాణ‌క్యుడు. వీటికి త‌గ్గ‌ట్లుగా మాస్ ఇమేజ్ నీ సొంతం చేసుకున్న నాయ‌కుడు. ప్ర‌జ‌ల నాడి ప‌ట్టుకుని దానికి అనుగుణంగా పావులు క‌దిపే మేథావి. అయితేనేం ఈ ఎన్నిక‌ల్లో అనూహ్యంగా ఓట‌మి పాలై బిత్త‌ర చూపులు చూడ‌క త‌ప్ప‌లేదు.  ఒక‌ప్పుడు బి.ఆర్.ఎస్. పార్టీలో నెంబ‌ర్ టూగా ..కేసీయార్ త‌ర్వాత  ఆయ‌నే అంతా అన్న‌ట్లు చ‌క్రం తిప్పిన ఈట‌ల రాజేంద‌ర్  ఈ ఎన్నిక‌ల్లో పోటీ చేసిన రెండు నియోజ‌క వ‌ర్గాల్లోనూ  ప‌రాజ‌యాలు మూట‌గ‌ట్టుకుని  దిగాలు ప‌డిపోయారు. త‌న ఓట‌మిని తానే జీర్ణించుకోలేని ప‌రిస్థితి. ప్ర‌జ‌లు ఎందుకు ఓడించారా అని ఇపుడు  ప‌రిశీల‌న చేసుకుంటున్నారు. చేతులు కాలాక  బ‌ర్నాల్ రాసుకుంటున్నార‌ని రాజ‌కీయ పండితులు అంటున్నారు.

ఎప్పుడు ఎన్నిక జరిగినా అక్కడ ఈట‌ల‌దే  గెలుపు. నియోజకవర్గం మారినా ఇప్పటికి ఏడుసార్లు వరుసగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2021 ఉప ఎన్నికలో ఓడిపోతారనే ప్రచారం సాగింది. గులాబీ బాస్‌ను ధిక్కరించి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నిక తెప్పించారు. పార్టీ మారారు. కాని కారు దెబ్బకు ఈట‌ల ఓట‌మి ఖాయ‌మ‌ని అందరూ భావించారు. అయితే అర్జునుడిలా పద్మవ్యూహాన్ని ఛేదించి విజయుడిగా నిలిచారు.  ఈ ఎన్నిక‌ల్లోనూ  అలాగే స‌త్తా చాటి రెండు చోట్ల గెలుస్తాన‌ని ధీమా పెట్టుకున్నారు.   అయితే తాజా ఎన్నికల్లో  అభిమన్యుడిలా ఓడిపోయారు.

ఈటల రాజేందర్.. తెలంగాణా రాష్ట్ర రాజకీయాల్లో అందరికీ పరిచయమైన పేరు. అప్పటి సీఎం కేసీఆర్ ను ఎదిరించి గులాబీ పార్టీ నుంచి బయటకు వచ్చినా..తన పంథాకు భిన్నమైన కమలం పార్టీ నీడకు చేరారు. ఆ పార్టీలో చేరాక తన సొంత జిల్లాకు చెందిన నాటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైన బండి సంజయ్ తో పొసగకున్నా…తాజా ఎన్నికల్లో తాను ప్రాతినిథ్యం వహిస్తున్న హుజూరాబాద్ తో పాటు.. సవాల్ విసిరి మరీ గజ్వేల్ లో కేసీఆర్ పై బరిలోకి దిగి, రెండు స్థానాల్లోనూ ఓటమిపాలయ్యారు. అటు కమలాపూర్ నియోజకవర్గం నుంచి..ఇటు హుజూరాబాద్ నుంచి వరుసగా ఏడుసార్లు గెలిచిన విజేతగా తెలంగాణ రాజకీయాల్లో ఈటల రాజేందర్‌ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.

బీఆర్ఎస్ ను వీడి బయటకు వచ్చాక జరిగిన 2021 ఉపఎన్నిక యావత్ దేశం దృష్టినీ ఆకర్షించింది. అప్పుడు ఈటలపై అధికార బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఫోకస్ చేసింది. ఈటల ఓటమి కోసం గులాబీ పార్టీ సర్వశక్తులూ ఒడ్డింది. నాటి ఉపఎన్నికలో అభిమన్యుడిని చుట్టుముట్టినట్టు చుట్టుముట్టింది. కానీ, ఈటల మాత్రం తన ఏడో విజయాన్నందుకున్నారు. దాంతో ఈటల క్రేజ్ కమలం పార్టీలో మరింతగా పెరిగింది.

రోజులెప్పుడూ ఒకేలా ఉండవు. ఓడలు బండ్లవుతాయి.. బండ్లు ఓడలవుతాయి. అదే పరిస్థితి ఈటల విషయంలో ఎనిమిదో ఎన్నికలో జరిగింది. ఇంతకాలం ఎదురులేని మనిషిగా నిల్చిన ఈటల.. తాజా ఎన్నికల్లో  చ‌తికిల ప‌డిపోయారు.

తనపైన ఎవ్వరూ అంత ఫోకస్ చేయకపోయినా తాను నమ్ముకున్న హుజూరాబాద్ లో ఓటమి పాలయ్యారు. అక్కడి ఓటర్లు విలక్షణ తీర్పునిచ్చారు. 2018 ఎన్నికల్లో ఈటలపై కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగి ఓటమిపాలైన కౌశిక్ రెడ్డిని బీఆర్ఎస్ అభ్యర్థిగా.. ఈసారి ఎన్నికల్లో గెలిపించి పట్టం కట్టారు. ఈటలను  ఓడిస్తాన‌ని  సవాల్ విసిరిన కౌశిక్‌కు.. సెంటిమెంట్ రాజకీయాలు కూడా ఈసారి కలిసివచ్చాయనే టాక్ ఎలాగూ ఉంది.అటు గజ్వేల్ లో తొడగొట్టి గులాబీ పార్టీ బాస్‌ కేసీఆర్‌ను ఓడగొట్టేందుకు వెళ్లి అక్కడా ఈటల భంగపడ్డారు. తాను ప్రచారంలో లేని లోటును పూడ్చేందుకు హుజూరాబాద్ లో తన సతీమణి జమునను ప్రచారంలోకి దింపారు. రెండు నియోజకవర్గాల్లోనూ ఈటలకు ఓటమి తప్పలేదు.

ఈటల వచ్చాక బీజేపీలో జరుగుతున్న మార్పులపై ఓ పెద్ద చర్చే జరుగుతున్న క్రమంలో…బీజేపీని అంటిపెట్టుకుని ఉన్న సంప్రదాయవాదుల్లో కొంత వ్యతిరేకత కూడా అంతర్లీనంగా కనిపిస్తున్న నేపథ్యంలో.. ఇప్పుడు ఈటల గెలిస్తే ఆయనకు కొంత ప్లస్సయ్యేది. కానీ అలా జరగలేదు. ఇప్పుడు ఈటల రీగెయిన్ కావడానికి  తన శైలిని కొంచెం మార్చుకోవాల్సి ఉందని.. ఆచితూచి అడుగులు వేస్తేనే రాజకీయాల్లో ఇప్పటివరకూ తనకున్న ప్రత్యేకతను కాపాడుకోగలుగుతారనే వాదన వినిపిస్తోంది.

రెండు నియోజకవర్గాల్లో ఓటమి ఈటల రాజకీయ జీవితాన్ని కొంత సంక్షోభంలోకి నెట్టింది. అంతేకాదు కాంగ్రెస్ అభ్యర్థిగా వొడితెల ప్రణవ్ లీడర్ గా ఎదుగుతున్న క్రమంలో..ఇప్పటికే విజయంతో ఊపుమీదున్న కౌశిక్ రెడ్డితో.. మున్ముందు ఫైట్ కూడా ఈటలకు మరింత టఫ్ గానే ఉంటుందంటున్నారు రాజకీయ పరిశీలకులు…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి