వైసీపీకి ఖేల్ ఖతం అవుతుందున్న భయం పట్టుకుందా. ఆర్కే రాజీనామా దేనికి సంకేతం. ఇంకా చాలా మంది ఉన్నారన్న అనుమానాలు ఎందుకు కలుగుతున్నాయి. అకస్మాత్తుగా 11 మంది ఇంచార్జీలను మార్చడం అధికార పార్టీలో ఉన్న అనుమానంతో కూడిన భయానికి నిదర్శనమా..అనేక నియోజకవర్గాల్లో సిట్టింగులు గెలిచే అవకాశం లేదన్న నిర్ణయానికి వచ్చేశారా…
సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడిగా భావించే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేయడం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఇదీ వైసీపీకి ఊహించని పరిణామమే కాదు, ఆశించని పరిణామం కూడా అని చెప్పుకోవాల్సిందే. పవన్ కల్యాణ్ ను గాజువాకలో ఓడించిన తిప్పల నాగిరెడ్డి కుమారుడు, ఆ నియోజకవర్గ ఇన్‌చార్జి దేవన్‌రెడ్డి కూడా రాజీనామాబాట పట్టారు. ఈ పరిణామాలపై రోజంతా చర్చ జరుగుతుండగానే సాయంత్రానికి వైసీపీ అధిష్టానం 11 మంది ఇంచార్జీలను మార్చేసింది వీరిలో వైద్య ఆరోగ్య మంత్రి రజనిని చిలకలూరిపేట నుంచి గుంటూరు పశ్చిమకు.. సాంఘిక సంక్షేమ మంత్రి మేరుగ నాగార్జునను వేమూరు నుంచి సంతనూతలపాడుకి.. మున్సిపల్ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ను యర్రగొండపాలెం నుంచి కొండపికి మార్చారు. ప్రత్తిపాడు ఎస్సీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి మేకతోటి సుచరితను.. తాడికొండ ఎస్సీ నియోజకవర్గానికి ఇన్‌చార్జిగా నియమించారు. చిలకలూరిపేటకు మల్లెల రాజేశ్‌నాయుడు, అద్దంకికి పాణెం హనిమిరెడ్డి.. మంగళగిరికి గంజి చిరంజీవి, రేపల్లెకు డాక్టర్ ఈవూరు గణేశ్, గాజువాకకు వరికూటి రామచంద్రరావు, వేమూరుకు అశోక్‌బాబు, ప్రత్తిపాడుకు బాలసాని కిరణ్‌కుమార్ కొత్త ఇన్‌చార్జులుగా నియమితులయ్యారు.
ఐదు ఎస్సీ నియోజకవర్గాల్లో ఇంచార్జీలను మార్చడం మేజర్ పరిణామమే అవుతుంది. అక్కడ ఓటమిని వాసనపట్టి మార్పుతో ఏదో సాధిద్దామన్న నిర్ణయానికి వచ్చినట్లు కూడా చెబుతున్నారు. అందుకు సర్వేలు కూడా కారణమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటిదాకా ఉన్న వారిని కొనసాగిస్తే డిపాజిట్లు కూడా రావని తేలడంలో జస్ట్ ఫర్ ఛేంజ్ అన్నట్లుగా మార్పులు చేసినట్లు చెబుతున్నారు.
ఇంచార్జీలను మార్చడం వెనుక ఐప్యాక్ సర్వే టీమ్ హస్తం ఉన్నట్లు తేలింది. పలు దఫాలు చేసిన సర్వేల తర్వాతే జగన్ ప్యాలెస్ లో సుదీర్ఘ మంతనాలు జరిపి మార్పులు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.ప్రత్తిపాడు నుంచి పోటీ చేస్తే సుచరితకు ఓటమి తప్పదని ఐ ప్యాక్ టీమ్ తేల్చేయ్యడంతో ఆమెను తాడికొండకు పంపారు. పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఉండవల్లి శ్రీదేవీ ఇంతవరకు అక్కడ ఇంచార్జీగా ఉండేవారు.నిజానికి అక్కడ డొక్కా మాణిక్య వరప్రసాద్ కు అవకాశం ఉంటుందనుకున్నారు. ఇప్పుడు ఆయనకు మొండిచేయి చూపించినట్లేనని నిర్ధారణకు వచ్చారు. మంత్రి ఆదిమూలపు సురేష్ పరిస్థితి ఏమంత బాగోలేదు. ఆయన యర్రగొండపాలెం ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్కడ ప్రతికూల పవనాలు వీస్తున్నాయి. అసలు టికెట్టే ఆపేద్దామంటే సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడు. ఇటీవల చంద్రబాబు నియోజకవర్గం పర్యటన సందర్భంగా ఆయన్ను అడ్డుకుని జగన్ కు ఖుషీ చేశారు. దానితో సురేష్ ను కొండపికి మార్చారు. అక్కడ టికెట్ ఇవ్వడం ఖాయమని చెబుతున్నారు. సంతనూతలపాడులో టీజేఆర్ సుధాకర్ బాబు ఓటమి ఖాయమని సర్వేలు చెబుతున్నాయి. దానితో వేమూరు ఎమ్మెల్యే మేరుగు నాగార్జునను సంతనూతలపాడుకు పంపారు. అయితే సుధాకర్ బాబు, నాగార్జున ఇద్దరికీ టికెట్ డవుటేనని అంటున్నారు. 11 మంది మార్పు ఆరంభం మాత్రమేనని, మరో 30 నుంచి 35 మందిని మార్చే అవకాశం ఉందని వైసీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కనిష్టంగా 50 మంది అభ్యర్థులను మార్చాలని ఐ ప్యాక్ చెప్పినట్లుగా తెలుస్తోంది.అయితే ఇక పార్టీలో ఉండి లాభం లేదనుకుంటున్న వాళ్లు వెళ్లిపోవడం ఖాయమైంది. సోమవారం ఆర్కే, దేవన్ రెడ్డి వెళ్లిపోగా… త్వరలోనే మైలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టీడీపీ దారి పడతారని వైసీపీ వర్గాలే ప్రచారం చేస్తున్నాయి.
ప్రస్తుతం మార్చిన వారిలో ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాల వాళ్లే 95 శాతం ఉన్నారు. అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనూ భారీ మార్పులు ఖాయమని చెబుతున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు వెళ్లిపోయారు. బతిమలాడిని ఆర్కే మళ్లీ వచ్చే అవకాశం లేదు. అందుకే వైసీపీకి ముందున్నది ముళ్ల బాటేనని చెబుతున్నారు పైగా జగన్ కు మిత్రుడైన కేసీఆర్.. తెలంగాణలో ఓడిపోవడంతో ఏపీలో వైసీపీకి కొత్త భయాలు పట్టుకున్నాయి…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…