ఫ్యాన్ రెక్కలు.. జంపింగ్ జపాంగులు !

By KTV Telugu On 15 December, 2023
image

KTV TELUGU :-

సాధారణంగా అధికార  పార్టీలోకి నేతలు వెళ్తుంటారు. అందుకోసం పెద్దలను  బతిమలాడి, భంగపడి చాలా పనులు చేస్తుంటారు. ఆంధ్రప్రదేశ్ లో  మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. సీఎం జగన్ రెడ్డి రివర్స్ టెండరింగ్ ఏమిటో గానీ, ఆయన  పాలిటిక్స్ మాత్రం వైసీపీకి రివర్స్ అయ్యేలా కనిపిస్తున్నాయి. పార్టీలో ఉండాలనుకునే వారు ఇద్దరైతే, పక్కచూపులు చూసే వారి పది మంది ఉంటున్నారు..

వైసీపీ అధినాయకుడు జగన్ రెడ్డికి,ఆయన అనుచరగణానికి ఇప్పుడు  ముచ్చెమటలు పడుతున్నాయి. రోజుకు ఒక్కరు పార్టీని వదిలేసి పోతున్న తీరు చూస్తే త్వరలోనే ఒకరిద్దరే మిగిలే అవకాశాలుంటాయన్న భయం వారిని వెంటాడుతోంది. వీర విధేయుడు, పరమ భక్తుడైన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి కూడా బై  బై చెప్పడం పార్టీ దీనస్థితికి నిదర్శనమని భావిస్తున్నారు. ఆయనే వెళ్లిపోయిన తర్వాత ఇక తాము ఎందుకుండాలన్న ప్రశ్నలు వేసుకుంటున్న జనం పదండి ముందుకు పదండి పక్క పార్టీలోకి అని పాడుకుంటున్నట్లు జగన్ రెడ్డి చెవికి చేరడంతో ఆయనకు దిక్కుతోచడం లేదు. పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ వైసీపీ సంక్షోభం ఎటు దారి తీస్తుందోనని  పార్టీ పెద్దలు ఆవేదన చెందుతున్నారు.

జగన్ ఎవరితో మాట్లాడరు. జగన్ తో ఎవరూ మాట్లాడలేరు. దుస్థితి నుంచి పార్టీని బయట పడేసేందుకు అవకాశాలు  లేని పరిస్థితి వచ్చిందని తేలిపోయింది. దానితో కనీసం 60 మంది ఎమ్మెల్యేలు వీలైనంత త్వరగా  పార్టీని వదిలేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నలుగురు, ఉమ్మడి గుంటూరులో ఇద్దరు  వెళ్లిపోయారు. మిగతా  వాళ్లు అదే బాట పడుతున్నారు. అందుకు అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయాలు కూడా ఒక కారణం కావచ్చు…

జగన్ తన సొంత ఎమ్మెల్యేలు, పార్టీ నేతల కంటే సర్వే సంస్థలనే ఎక్కువగా నమ్ముకుంటున్నారు. సర్వే సంస్థలు ఇచ్చిన నివేదికల ఆధారంగా అభ్యర్థులను మార్చాలనుకుంటున్నారు.  ప్రతీ ఉమ్మడి జిల్లాలోనూ కనీసం ఐదారుగురు ఎమ్మెల్యేలను మార్చేస్తారన్న టాక్ నడుస్తోంది. దానితో ఎమ్మెల్యేల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. జగన్ రెడ్డి కొటేరీ తీసుకున్న విధానమైన నిర్ణయాలు  భారీ తప్పిదాలుగా మారడానికి, కనీసం జీతాలు – పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రజా వ్యతిరేకత పెరిగిపోవడానికి తాము కారణం కానప్పటికీ తమను బలపశువులను చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యేలు ఆగ్రహం చెందుతున్నారు. ఆస్తులు అమ్ముకుని పార్టీని నడిపిస్తుంటే కబ్జాకోరులుగా తమను  చిత్రీకరించడం కొందరికి బాధేస్తోంది. వంద రోజుల్లో ఎన్నికలు జరిగే అవకాశం  ఉండటంతో ఇప్పుడే జాగ్రత్త పడాలన్న కోరిక  వారిలో కనిపిస్తోంది. టీడీపీలో చేరితే అవకాశాలు వస్తాయా రావా అన్న కోణంలో ఆలోచిస్తున్న  వారే ఎక్కువగా  ఉన్నాయి. తమ నియోజకవర్గాల్లో టీడీపీకి ఉన్న బలమూ, బలహీనతలు, తాము వెళ్లితే చేర్చుకుంటారా లేదా అన్న ఆలోచన  వారిలో కనిపిస్తోంది. టీడీపీలో చేర్చుకునేందుకు అవకాశం ఉన్న వాళ్లు ఇప్పటికే వేగంగా  పావులు కదుపుతున్నారు. టీడీపీ- జనసేన కలిసి పోటీ చేస్తున్న నేపథ్యంలో పవన్ పార్టీలో చేరే అవకాశం వచ్చినా మంచిదేనన్న ఆలోచనలో వారున్నారు…

బండి స్టార్ట్ చేసి ఉంది. అటు వైపు నుంచి కనుసైగ వస్తే  గేర్ మార్చి  స్పీడు  పెంటడమే అన్న వాదన వైసీపీ వర్గాల్లో వినిపిస్తోంది. పిలిచిందే తడవుగా వెళ్లి టీడీపీలో చేరేందుకు  వైసీపీ నేతలు కాచుకు కూర్చున్నారు. అయితే తమ దగ్గర కూడా ఖాళీలు లేవని, ప్రతీ నియోజకవర్గానికి కనీసం ముగ్గురు బలమైన  ఆశావహులు ఉన్నారని ప్రధాన ప్రతిపక్షం చెబుతోందట . పదవులు ఆశించకుండా వచ్చే పనైతే చేర్చుకునే విషయం ఆలోచిస్తామని టీడీపీ నుంచి సమాధానం వస్తున్న నేపథ్యంలో ఏం జరుగుతుందో  చూడాలి…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి