దేశ అత్యున్నత చట్ట సభ లోక్ సభకు భద్రత లేకుండా పోయింది. జీరో అవర్ జరుగుతున్న సమయంలో ఓ ఆగంతకుడు విజిటర్స్ గ్యాలరీలోనుంచి నేరుగా సభలోకి దూకారు. తరవాత కలర్ స్మోక్ ప్రయోగించడంతో గందరగోళం ఏర్పడింది. ఆ సమయంలో రాహుల్ గాంధీ సహా పలువురు ఎంపీలు సభలోనే ఉన్నారు. అసలేం జరిగిందో అర్థం చేసుకోవడానికి ఎంపీలకు చాలా సమయం పట్టింది. ఓ దండగుడు లోక్ సభపైనే దాడి చేసినట్లుగా గుర్తించారు. 22 ఏళ్ల కిందట పాకిస్తాన్ ఉగ్రవాదులు పార్లమెంట్ పై దాడి చేశారు. ఇదే రోజున ఆ దాడి జరగడంతో… ఇప్పుడు కూడా దుండగులు నేరుగా లోక్ సభలోకి ఎంటర్ కావడంతో సంచలనంగా మారింది.
లోక్‌సభలోకి సభ్యులు కాని వ్యక్తులు వెళ్లడం అసాధ్యం. ఉద్యోగులు మాత్రమే విధి నిర్వహణలో వెళ్తారు. అలాంటిది ఓ దుండగుడు లోక్ సభలోకి వెళ్లిపోయాడు. స్మోక్ బాంబు వదిలాడు. ఈ పరిణామం అసలు ఊహించలేం. అదే స్మోక్ బాంబు కాకుండా ఇంకేదో ప్రమాదకరమైన రసాయం అయితే పరిస్థితి ఎలా ఉండేది ?. ఆ వ్యక్తులు ఎందుకు ఈ పని చేశారన్న సంగతి పక్కన పెడితే భద్రతా వైఫల్యం మాత్రం అందర్నీ నివ్వెర పరుస్తోంది. సాక్షాత్తూ పార్లమెంట్‌కే ఈ పరిస్థితి ఉంటే దేశంలో ఇంత పేరు గొప్ప ఊరు దిబ్బ ప్రభుత్వం ఉందా అని ఆశ్చర్యపోక తప్పని పరిస్థితి.
దేశ అత్యున్నత ప్రజాస్వామ్య మందిరమైన పార్లమెంటు కొలువు దీరివున్న సమయంలో బుధవారం నాడు ఇద్దరు వ్యక్తులు లోపలికి చొరబడి సృష్టించిన భయోత్పాతం అత్యంత ఆందోళనకరమైనది. ఐదంచెల దుర్భేద్యమైన భద్రత వున్నదని చెప్పుకొనే పార్లమెంటు ధీమాను పటాపంచలు చేసి దేశ ప్రజలలో తీవ్ర ఆందోళన కలిగించిన ఈ పరిణామం కేంద్ర ప్రభుత్వ పరువును తీసేసినట్లయింది. ఎందుకంటే పార్లమెంట్ పై 22 ఏళ్ల కింద జరిగిన దాడిలో వీరమరణం పొందిన వారికి ఓ వైపు నివాళులు అర్పిస్తున్న సమయంలోనే ఇది జరిగింది. సమాచారం ప్రకారం ఈ ఘటనలో ఆరుగురి ప్రమేయమున్నట్టు వారిలో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. అందరూ 30 ఏళ్ళ లోపు వారేనని వారిలో ఒకరు ఇంజినీరింగ్ చదువుకొన్నారని చెబుతున్నారు.
22 ఏళ్ళ క్రితం పాత పార్లమెంటు భవనంపై ఉగ్రమూక విఫల దాడి సరిగ్గా ఇదే తేదీన జరిగింది. భద్రత సిబ్బంది సకాలంలో స్పందించి ఆ దాడిని వమ్ము చేశారు. ఆ ఘటనలో తొమ్మిది మంది మరణించారు. ఈ రెండు ఘటనలూ ఒకే తేదీన సంభవించడం యాదృచ్చికమా లేక రెండింటి మధ్య సంబంధం ఏమైనా వున్నదా అనేది తేలవలసి వుంది. బుధవారం నాటి ఘటనలో పాల్గొన్న వారి ఉద్దేశం అలజడి సృష్టించడమేనని తేలినట్టు చెబుతున్నారు. రంగు పొగ దాడి చేసిన ఇద్దరు వ్యక్తులు పాస్‌లు సంపాదించి పార్లమెంటు లోపలికి చొరబడడం మామూలు విషయం కాదు. వారు విష వాయువు చల్లివుంటే అదెంతటి ముప్పును తెచ్చిపెట్టేదో ఊహిస్తేనే చెప్పనలవికాని భయం కలుగుతుంది.
అలా జరగనందుకు హాయిగా ఊపిరి పీల్చుకొంటున్నాము గాని జరిగే అవకాశాలున్నాయనే చేదు వాస్తవాన్ని కప్పిపుచ్చలేము. ఐదెంచెల భద్రత వ్యవస్థ వున్న చోట ఆగంతకులు అందరి కళ్ళుగప్పి ఎలా లోపలికి చొరబడగలిగారు? వారి అనుమతి పత్రాలకు సిఫార్సు చేసింది కర్నాటకకు చెందిన బిజెపి ఎంపియేనని తేలింది. అందుచేత ఆ పాస్‌లను భద్రత సిబ్బంది అనుమానించడానికి ఆస్కారం లేదు. కాని వారి వద్ద వున్న పొగ గొట్టాలను అత్యాధునిక నిఘా యంత్రాలు ఎందుకు కనిపెట్టలేకపోయాయన్నది అందరికీ తెలుసు. అదే నిర్లక్ష్యం. ఇది సాధారణమైన నిర్లక్షం కాదు. ఈ ఘటన జరిగింది కాబట్టి కొద్ది రోజుల పాటు భద్రతను కట్టుదిట్టం చేస్తారు. ఆ తర్వాత షరా మామూలే అవుతుంది. భద్రత వైఫల్యం ఈ ఉదంతంలో ఒక కోణానికి సంబంధించింది. కానీ అసలు ఈ ఆరుగురు ఎందుకు ప్రజాస్వామ్య దేవాలయం అయిన లోక్ సభపై దాడికి సిద్ధమయ్యారన్నది కీలకం.
ఆరుగురికి ఉగ్రవాదులతో సంబంధాలు.. బయట ప్రచారం జరుగుతున్నట్లుగా ఖలిస్తాన్ తో సంబంధాలు ఉన్నాయని ఎవరూ అనుకోవడం లేదు. అలాంటివేమీ లేవని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. మరి ఎందుకు దాడి చేశారు
ఆరుగురు ఏ ఉద్దేశంతో ఈ దాడికి పథక రచన చేశారు అనేది మరింత ముఖ్యమైన కోణం.. తానా షాహీ బంద్ కరో.. జై భీమా.. భారత్ మాతాకీ జై అంటూ వారు నినాదాలు చేశారు. రాజ్యాంగాన్ని కాపాడాలని..నియంతృత్వ చెల్లదని వారు నినాదాలు చేశారు. నిందితులు మైసూర్ బీజేపీ ఎంపీ ప్రతాప సింహ పాసులతో విజిటర్స్ గ్యాలరీలోకి వచ్చారు. ఈ ఆరుగురు ఏ ఒక్క ప్రాంతానికో చెందిన వారు కాదు. కర్నాటక, హర్యానా, మహారాష్ట్ర వంటి వివిధ ప్రాంతాలకు చెందిన వీరు ఆన్‌లైన్ సంబంధాలు పెట్టుకొని ఈ దాడికి వ్యూహ రచన చేసుకొన్నట్టు అర్థమవుతున్నది. తమ ప్రాణాలకే ముప్పు కలిగించగల ఈ సాహసానికి వొడిగట్టడం వెనుక వారికి గల ఆలోచన ఏమిటనేది కీలకమైన విషయం. వారు ప్రస్తుత ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేయాలనుకుంటే.. ఈ మార్గం ఎంత మాత్రం కరెక్ట్ కాదని తెలుసుకోలేనంత అమాయకులు కాదు. లోక్ సభలోకి చొరబడి అలజడి రేపడం.. దేశంపై దాడి లాంటిదే.
దేశంలో నిరంకుశ పాలనా ధోరణులు ప్రబలుతున్నాయని భావించి వారు ఇందుకు సిద్ధమయ్యారన్న వాదన వినిపిస్తోంది. అదే నిజం అయినా .. ఈ నిరసన మాత్రం కరెక్ట్ కాదు. వారి వెనుక ఏదైనా సంస్థ పాత్ర వుందా అనేవి తెలియవలసి వున్నాయి.ఈ ఆరుగురిలో ఒకరు గతంలో ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాది పాటు సాగిన రైతు నిరసనోద్యమంలో పాల్గొన్నారని చెబుతున్నారు. అదే నిజమైతే ఆ ఉద్యమ లక్ష్యాల సాధన కోసం వీరు ఇందుకు పాల్పడ్డారేమో తెలుసుకోవాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వ విధానాలకు.. వ్యతిరేకంగా నిరసన అనుకుంటే… వేధింపులకు తగ్గట్లుగానే నిరసన కారుల ఆలోచనా ధోరణి కూడా మారుతోందనుకోవాలి. ఇది ఊహించని ప్రమాదాలను భవిష్యత్ లో తెచ్చి పెడుతుంది. ఇలాంటి పరిణామాల్ని విస్తృత కోణంలో చూసి దేశభద్రత కోసం చర్యలు చేపట్టాల్సి ఉంది. పార్లమెంట్ పై 22 ఏళ్ల క్రితం శత్రువులు దాడి చేశారు. కానీ ఇవాళ సొంత వాళ్లే చొరబడ్డారు. పరిస్థితులు ఇలా ఎందుకు మారుతున్నాయి ? భద్రతా కోణంతో పాటు ఇలా వారు ఎందుకు చేయాలనుకున్నారో తెలుసుకుని వ్యవస్థలో మార్పులు చేయాల్సి ఉంది…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…