ఆరేస్తే అవస్థలేనా ?

By KTV Telugu On 15 December, 2023
image

KTV TELUGU :-

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడు ఆరేయ్యబోతున్నారు. అంటే మిగిలిన ఆరు కెబినెట్ బెర్తులు ఎప్పుడు భర్తీ చేయబోతున్నారు. తొందరపడుతున్న ఆశావహులకు ఆయన ఎలాంటి తీపి కబురు అందివ్వబోతున్నారు. ఎవరినీ నొప్పించక, తాను  నొవ్వక రేవంత్ ఎలా నెగ్గుకు రాగలరు. అసలు కేబినెట్ బెర్తులు ఆశిస్తున్నదెవ్వరూ. అందరినీ ఎలా సంతృప్తి పరుస్తారు…..

అధికార పీఠంపై ఉన్న వాళ్లు సంతోషంగా గడుపుతున్నారనుకుంటే పొరబాటే. వారికి రోజుకు మూడు పూటలా సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి.  వాటిని  అధిగమిస్తూ, కొన్నింటినీ తెలివిగా వాయిదా వేస్తూ పాలనను సాగించాల్సి ఉంటుంది. సీఎం రేవంత్ కూడా అదే పని చేయాలి. కొంతవరకు రేవంత్ ఆ బాటలోనే నడుస్తున్నారనుకోవాలి. కాకపోతే అనివార్యంగా పరిష్కరించాల్సిన సమస్యలు, తీర్చాల్సిన కోరికలు కొన్ని ఉండనే ఉన్నాయి. అందులో మంత్రివర్గ విస్తరణ కూడా ఒకటని చెప్పక తప్పదు. రేవంత్ తో కలిసి 12 మంది మంత్రులు తొలుత ప్రమాణ స్వీకారం చేయగా, ఇప్పుడు మరో ఆరు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. దాని కోసం కనీసం 20 మందికి పైగా కాచుకు కూర్చున్నారు.ఆరుగురికి పదవి ఇస్తే మిగతా  వారికి కోపం తెప్పించినట్లు అవుతుందని రేవంత్ ఆలోచిస్తున్నారు. అందరినీ ఎలా సంతృప్తి పరచాలో ఆలోచిస్తూ తన అంతరంగికులను సంప్రదిస్తున్నట్లు సమాచారం…

మంత్రివర్గ విస్తరణలో ఈ సారి సామాజిక వర్గాల సమీకరణాలు కూడా చూసుకోవాల్సిన అనివార్యత  ఉంది. ఇప్పుడు కేబినెట్లో ఓ ముస్లిం నేత కూడా లేరు. అదే విధంగా ఎన్నికల సమయంలో పార్టీ కోసం త్యాగం చేసిన వాళ్లని కూడా ఒకరిద్దరినీ మంత్రివర్గంలో చేర్చుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. వారిలో ఎంతమందికి ఇవ్వాలో రేవంత్ ఆలోచిస్తున్నారు. సమర్థంగా శాఖల నిర్వహణతో పాటు తెలంగాణలో పార్టీ భవిష్యత్తుకు పనికివచ్చే వారిని కేబినెట్లో తీసుకుంటే బావుంటుందని రేవంత్ అంచనా వేస్తున్నట్లు సమాచారం.

ఎన్నికల్లో ఓడిపోయిన వారికి కేబినెట్ బెర్త్ ఇవ్వొచ్చా అన్న ప్రశ్న తలెత్తింది. ఈ అంశంపైనే షబ్బీర్ అలీని ప్రమాణ స్వీకారం చేయించలేకపోయారు. అయితే ఇలాంటి రూల్స్  ను పక్కన పెట్టి మంత్రి పదవి ఇవ్వాలని, వారికి మండలి సభ్యత్వమివ్వాలని రేవంత్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ముస్లిం కోటాలో షబ్బీర్ అలీ, మొహ్మద్ అజారుద్దీన్ పేర్లు వినిపిస్తున్నాయి. మాజీ క్రికెటర్  అజార్ .. పార్టీ తరపున జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి  పోటీ చేసి ఓడిపోయారు. ఒక  ముస్లింకు అవకాశం ఇస్తారా.. ఇద్దరిని చేర్చుకుంటారా చూడాల్సి ఉంది. ముస్లింకు డిప్యూటీ సీఎం ఇచ్చి మైనార్టీలను మచ్చిక చేసుకునే వీలుందని కూడా చెబుతున్నారు. జీహెచ్ఎంసీ  పరిధిలోనూ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోనూ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. మళ్లీ నిలబెట్టాలంటే అక్కడి ఒకరిద్దరూ నేతలకు మంత్రి పదవులిచ్చి సంతృప్తి పరచాలి. ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీమధు యాష్కీ గౌడ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ గౌడ్ పేర్లు వినిపిస్తున్నాయి. వారిద్దరూ  ఓడిపోయినప్పటికీ పార్టీ కోసం అహర్నిశలు పనిచేసే నాయకులని ప్రత్యేకంగా   చెప్పాల్సిన పనిలేదు. పైగా వారికి కాంగ్రెస్ అధిష్టానం దగ్గర మంచి ఇమేజ్ ఉంది. రాహుల్ గాంధీ సన్నిహితులన్న పేరు కూడా ఉంది.ఇక జగిత్యాల నేత జీవన్ రెడ్డి, సంగారెడ్డిలో పరాజయం పాలైన జగ్గారెడ్డి కూడా ఎమ్మెల్సీ అడుగుతున్నారు. మంత్రి పదవి కావాలంటున్నారు. గెలిచిన వారిలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం  వినోద్, ఆయన సోదరుడు చెన్నూరు ఎమ్మెల్యే జీ. వివేక్, బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, మంచిర్యాల ప్రతినిధి ప్రేమ్ సాగర్ రావు, పరిగి  ఎమ్మెల్యే రామ్ మోహన్ రెడ్డి, ఇబ్రహీం పట్నం ప్రతినిధి   మల్ రెడ్డి రంగారెడ్డి ఇలా చాలా మంది రేసులో ఉన్నారు. మరో  పక్క రాజధాని ప్రాంతంలో వేరే  పార్టీల నుంచి  వచ్చి చేరేందుకు సిద్ధంగా ఉన్న నేతలను   చేర్చుకుని వారిలో ఒకరికి మంత్రి పదవి ఇచ్చే ఆలోచన కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. తుంగతుర్తి సీటును త్యాగం చేసిన అద్దంకి దయాకర్ రేసులో ఉన్నారని ప్రత్యేకంగా  చెప్పాల్సిన పనిలేదు.వేం  నరేందర్ రెడ్డి, చిన్నారెడ్డి కూడా పదవిని ఆశిస్తున్నారు….

ఉన్నదీ ఆరు బెర్తులే. ఆశావహులు చాలా మంది ఉన్నారు. వారిని సంతృప్తి పరచడమంటే  రేవంత్ కు కత్తి మీద సాము లాంటిదని చెప్పక తప్పదు. ఐనా అన్ని లెక్కలు చూసుకుని పదవులు ఇవ్వాలి. ఇవ్వలేని వారిని వేరే విధంగా సంతృప్తి  పరిచేందుకు ప్రయత్నించాలి. ఎమ్మెల్సీలు, నామినేటెడ్ పదవులు.. ఇంకా ఎన్నెన్నో  అవకాశాలున్నాయి. అందరినీ కలుపుకుపోవడానికి  అదొక్కటే మార్గమన్న  సంగతి మరిచిపోకూడదు…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి