వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భారీ ప్రక్షాళనకు సిద్ధమైంది. రెండు దఫాలుగా ఇరవైకి పైగా నియోజక వర్గాల్లో ఇన్ ఛార్జులను మార్చి కొత్త వారికి బాధ్యతలు అప్పగించింది. ఆ నియోజక వర్గాల్లో వచ్చే ఎన్నికల్లో సిటింగులకు టికెట్లు రావన్న క్లారిటీ ఇచ్చినట్లే అంటున్నారు రాజకీయ పండితులు.దీన్ని అస్త్రంగా మలుచుకోవాలని ఏపీలో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పావులు కదుపుతోంది. ఎన్నికల్లో ఎలాగూ ఓటమి ఖాయమని తేలిపోవడంతోనే జగన్ మోహన్ రెడ్డి సిటింగులను మారుస్తున్నారంటూ టిడిపి ప్రచారం చేస్తోంది. రాబోయేది టిడిపి-జనసేన కూటమి ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేస్తోంది. వైసీపీ పట్ల రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకుతోందని అంటోంది టిడిపి. అయితే ఏపీలో అడ్రస్ గల్లంతైన టిడిపికి మరోసారి భంగపాటు తప్పదని పాలక పక్షం అంటోంది.
తెలంగాణా ఎన్నికల్లో పాలక పక్షమైన భారత రాష్ట్ర సమితి ఓటమి చెందడంతో ఏపీలోనూ అక్కడి పాలక పక్షం ఓటమి చెందుతుందని టిడిపి,జనసేనలతో పాటు సిపిఐ ,సిపిఎం ప్రచారం చేస్తున్నాయి. రాబోయేది తమ ప్రభుత్వమే అని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు విడి విడిగా ధీమా వ్యక్తం చేస్తున్నారు.జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఆయువు తీరిపోయిందని ఎక్స్ పైరీ డేట్ ముగిసిందని నారా లోకేష్ సైతం అంటున్నారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మొదటి విడతలో 11 నియోజక వర్గాలకు కొత్త ఇన్ ఛార్జులను నియమించింది. తద్వారా వచ్చే ఎన్నికల్లో వారికి టికెట్లు ఖాయమన్న సంకేతాలు ఇచ్చింది.దీనికి ముందే గత ఎన్నికల్లో లోకేష్ పై గెలిచిన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఎమ్మెల్యే పదవికి, వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకీ రాజీనామా చేశారు. రెండో విడతలో మరో 10 నియోజక వర్గాల్లో ఇన్ ఛార్జులను మార్చారు.
ఇలా ఇన్ ఛార్జులను మార్చడాన్ని వైసీపీ డిఫెన్స్ లోకి వెళ్లడంగా విపక్షాలు భావిస్తున్నాయి. అయితే వైసీపీ నాయకులు మాత్రం సింహం వేటాడే ముందు నాలుగడుగులు వెనక్కి వేసి ఒక్క ఉదుటున ముందుకు దుంకుతుందని అంటున్నారు. తెలంగాణా ఎన్నికల ఫలితాలకు ఏపీలో వైసీపీ ఇన్ ఛార్జులను మార్చడానికి సంబంధమే లేదని వైసీపీ అంటోంది. నిజానికి కూడా వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కొద్ది నెలల క్రితమే ఎమ్మెల్యేల పనితీరుపై నివేదిక తెప్పించుకున్న సందర్భంలో 2024 ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తామని స్పష్టం చేశారు. కొంతమందికి టికెట్లు ఇవ్వలేకపోవచ్చు..అంత మాత్రాన వారు నా ఆత్మీయులు కాకుండా పోరు అని జగన్ మోహన్ రెడ్డి నెలల క్రితమే సంకేతాలు ఇచ్చారు. దాన్నే ఇపుడు అమలు చేస్తున్నారని ఆ పార్టీ చెబుతోంది.
వై నాట్ 175 అంటోన్న జగన్ మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో వచ్చిన సీట్ల కన్నా ఎక్కువ సీట్లు గెలిచి తీరాలన్న పంతంతో ఉన్నారు. గెలవగలమన్న ధీమాతోనూ ఉన్నారు. ఏయే నియోజక వర్గాల్లో ఎమ్మెల్యేల పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందో అక్కడ కొత్తగా ఎవరికి టికెట్లు ఇస్తే గెలిచే అవకాశం ఉందో ఆయన సర్వేలు చేయించుకున్నారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీమ్ కొద్ది నెలల ముందే దాన్ని సిద్ధం చేసింది. దాన్నే ఇపుడు జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారు. గెలిచే అవకాశం లేదని తేలితే ఎంత పెద్ద నేత అయినా టికెట్ ఇవ్వకూడదన్న నిర్ణయానికి ఆయన వచ్చారని అంటున్నారు. వారికి టికెట్ ఇవ్వకపోయినా అధికారంలోకి వచ్చాక మంచి పదవులు ఇచ్చి గౌరవిస్తామన్న భరోసా ఇస్తున్నట్లు పార్టీ వర్గాలంటున్నాయి.
పశ్చి మ బెంగాల్ లో గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు పెద్ద సంఖ్యలో పాలక పక్షమైన తృణమూల్ కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, కీలక నేతలు పార్టీకి రాజీనామాలు చేశారు. వారంతా బిజెపిలో చేరారు. అంతే ఇక జాతీయ మీడియా అంతా బెంగాల్ లో బిజెపి ప్రభుత్వం రాబోతోందని జోస్యాలు చెప్పాయి. మమతా బెనర్జీ పార్టీకి ఘోరమైన ఫలితాలు ఖాయమన్నాయి. ప్రతిపక్షానికే పరిమితం కాక తప్పదని అంచనాలు వేశాయి. ఎన్నికల తర్వాత ఫలితాలు చూస్తే అందరూ షాక్ తిన్నారు. అప్పటికి పదేళ్లుగా అధికారంలో ఉన్న మమతా బెనర్జీ పార్టీ మూడో సారి ఘన విజయం సాధించి అధికారంలోకి రావడమే కాకుండా గత రెండు ఎన్నికల కన్నా ఎక్కువ స్థానాలు గెలుచుకుంది. ఇది బిజెపికి కూడా మింగుడు పడలేదు. దీనికి కారణం పార్టీలో ప్రభుత్వంలో తీవ్ర వ్యరేకత మూటకట్టుకున్న వారికి టికెట్లు ఇవ్వద్దని పీకే టీం చెప్పిందట. దాన్నే మమతా బెనర్జీ తుచ తప్పకుండా అమలు చేసింది. అదే ఆమెకు హ్యాట్రిక్ విజయాన్ని అందించింది.
పశ్చిమ బెంగాల్ ఫార్ములానే ఇపుడు ఏపీలోనూ అమలు చేయిస్తున్నారు ప్రశాంత్ కిషోర్. తన ఐ ప్యాక్ టీం ద్వారా ఎమ్మెల్యేల పట్ల ప్రజల్లో ఉన్న అభిప్రాయాలను సేకరించిన ఐ ప్యాక్ టీం.. ఎక్కడెక్కడ ఏయే అభ్యర్ధిని నిలబెడితే విజయం ఖాయమో అంచనా వేసి ఆ నివేదికను జగన్ మోహన్ రెడ్డికి అందించింది. తెలంగాణాలో బి.ఆర్.ఎస్. అధినేత కేసీయార్ ఏడుగురు మినహా మిగతా అందరు సిటింగ్ ఎమ్మెల్యేలకూ టికెట్లు ఇచ్చారు. గ్రామీణ తెలంగాణాలో చాలా మంది బి.ఆర్.ఎస్. ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంది. కేసీయార్ పైకానీ..ప్రభుత్వంపైకానీ వ్యతిరేకత లేదు. కేవలం వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను మార్చకపోవడం వల్లనే కేసీయార్ హ్యాట్రిక్ విజయాన్ని చేజార్చుకున్నారని రాజకీయ పండితులు అంటున్నారు. ఏపీలో ఈ పొరపాటు జరక్కుండా జగన్ మోహన్ రెడ్డి మంచి నిర్ణయం తీసుకుంటున్నారని వారంటున్నారు.అయితే అభ్యర్ధులను మార్చినంత మాత్రాన వైసీపీకి తిరుగులేదనుకుంటే పొరపాటే అవుతుందంటున్నారు విపక్ష నేతలు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…