జనసేనాని పవన్ కల్యాణ్ పట్ల బీజేపీ అభిప్రాయం మారుతోందా. ఆయన్ను దూరం పెట్టాలన్న కోరిక కమలనాథుల్లో కనిపిస్తోందా.. తెలంగాణ నుంచే ఆ ప్రక్రియ మొదలవుతుందా. మరో పక్క పవన్ కు టీడీపీ బాసటగా నిలిచే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయా.. ఇప్పటి నుంచి సీట్ల సర్దుబాటును ఖరారు చేసుకునేందుకు టీడీపీ సిద్ధమవుతోందా. ఆ దిశగా ఇప్పటికే ప్రతిపాదనలు వెళ్లాయి. ఒక చోట పోగొట్టుకుంటే మరో చోట దొరికే అవకాశాలు పెరిగాయా…
తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పొత్తు బీజేపీకి చేదు అనుభవాన్నిచ్చింది. వద్దు వద్దనుకుని మరీ జనసేనతో పొత్తు పెట్టుకుంటే.. అనుకున్నదొక్కటీ..ఐనదొక్కటీ అన్నట్లుగా పరిస్థితి తయారైంది. ఎన్డీఏలో జనసేన భాగస్వామి అంటూ ఆ పార్టీకి 8 సీట్లను బీజేపీ కేటాయించింది. తమకు పవన్‌కల్యాణ్ సినీ గ్లామర్ రాజకీయంగా ఉపయోగపడుతుందని బీజేపీ భావించింది. అయితే జనసేనతో పొత్తు కుదుర్చుకోవడం వల్ల రాజకీయంగా నష్టమే తప్ప లాభం లేదని ఇటీవల వెల్లడైన ఫలితాలు నిరూపించాయి. కనీసం బర్రెలక్క ఇమేజ్ కూడా పవన్‌కు రాజకీయంగా లేదని తేలిపోయింది. డిపాజిట్లు కూడా రాని స్థాయిలో పవన్ గ్లామర్ పడిపోయిందని బీజేపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.జనసేనకు ఒక సిద్ధాంతం, విధానం లేదని, అలాగే పవన్‌కు నిలకడ లేదని బీజేపీ నేతలు అంతర్గత చర్చల్లో అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. పవన్‌తో పొత్తు పెట్టుకోవడం ద్వారా తెలంగాణలో బీజేపీకి ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఎటూ గెలవలేమనే ఉద్దేశంతోనే ఏ మాత్రం బలం లేని జనసేనతో పొత్తు పెట్టుకున్నారనే ప్రతికూల ప్రచారం ఎన్నికల్లో బీజేపీని దెబ్బతీసినట్టు ఒక అంచనాకు వచ్చారు. అందులో లోక్ సభ ఎన్నికల్లో పవన్ తో సర్దుబాట్లు వద్దని బీజేపీ నిర్ణయానికి వచ్చింది. ఆ క్రమంలోనే పార్లమెంటు ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రకటించారు. బాబూ నీకో దణ్ణం అంటూ పవన్ కు ఆయన సంకేతమిచ్చినట్లయ్యింది.. ఇక అర్థం చేసుకోవడం జనసేన వంతుగా ఉంటుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి….
ముందుగా మైత్రీ హస్తాన్ని చాచిన బీజేపీ దూరం పెట్టాలనుకున్నప్పటికీ.. పవన్ ను టీడీపీ అధినేత చంద్రబాబు దగ్గరకు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు జైలుల్లో ఉన్నప్పుడు స్వయంగా వెళ్లి సంఘీభావం ప్రకటించిన పవన్ కల్యాణ్ పట్ల టీడీపీ అధినేతకు అభిమానం పెరిగింది. అందుకే పరస్పర సంప్రదింపులతో.. పోత్తులను, సీట్ల సర్దుబాటును ఖరారు చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో చేయి వదిలేది లేదని తెలుగు తమ్ముళ్లకు చంద్రబాబు నూరిపోతున్నారు..
జనసేనకు 15 నుంచి 20 అసెంబ్లీ సీట్ల వరకు కేటాయించేందుకు టీడీపీ రెడీగా ఉంది. అయితే ఆ సంగతిని ప్రస్తుతానికి పక్కన పెట్టి లోక్ సభా స్థానాలపై క్లారిటీకి రావాలని టీడీపీ భావిస్తోంది. ఆ దిశగా జనసేనా నాయకుడితో చర్చలు జరుపుతోంది. బీజేపీకి దాదాపు ఐదు లోక్ సభా స్థానాలను కేటాయించేందుకు సిద్దమైన టీడీపీ, ఇప్పుడు మూడు సీట్లు ఇస్తామంటూ సందేశాలు పంపుతోంది. ప్రాథమిక దశలో చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వాటిలో ఒకటి ఉత్తరాంధ్రలో, మరొకటి గోదావరి జిల్లాల్లో, ఇంకొకటి దక్షిణ కోస్తాలో ఇస్తారని చర్చ జరుగుతోంది.ఉత్తరాంధ్రలో అనకాపల్లి ఎంపీ సీటును జనసేనకు వదిలేసే అవకాశం వుందని తెలుస్తోంది. అనకాపల్లి ఎంపీకి సరైన అభ్యర్థి తెలుగుదేశం పార్టీకి ఇంకా దొరకలేదు. అందుకే ఈ సీటును జనసేనకు విడిచిపెట్టాలని చూస్తోంది. ప్రజారాజ్యం టైమ్ లో ఇక్కడ అల్లు అరవింద్ పోటీ చేసి ఓడిపోయారు. ఈ సారి ఆయన బరిలోకి దిగకపోవచ్చు. ఆ స్థానం కోసం జనసేనలో చాలా మంది పోటీ పడుతున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో ఏ ఒక్క ఎంపీ సీటును జనసేనకు వదిలే ఆలోచన తెలుగుదేశం పార్టీకి వున్నట్లు లేదు. అందుకే వెస్ట్ గోదావరిలో ఇవ్వాలని చూస్తోంది. మరి ఇక్కడ నుంచి నాగబాబు మళ్లీ పోటీ చేస్తారా? వేరే వాళ్లకు ఇస్తారా చూడాలి. దక్షిణ కోస్తాలో కుదరకపోతే రాయలసీమలో టికెట్ తీసుకోవాలని జనసేన భావిస్తోంది. తిరుపతి పార్లమెంట్ అయితే బావుంటుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. అక్కడ బలిజ సామాజికవర్గంలో పవన్ కు మంచి ఆదరణ ఉంది….
నిజానికి పవన్ కల్యాణ్ ఐదు ఎంపీ సీట్లను ఆశిస్తున్నారు. అది కుదరని పని అని, మూడు సీట్లకు మించి ఇవ్వలేమని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఫైనల్ గా నాలుగు స్థానాలకు సెటిలైనా ఆశ్చర్య పడాల్సిన పని లేదు. ఎందుకంటే టీడీపీకి ఎంపీ అభ్యర్థులు దొరకడం ఇబ్బందిగా ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా టీడీపీ, జనసేన బంధం గాఢంగా పెనవేసుకుపోయింది…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…