ఎన్నికల ముందు కొన్ని ఆసక్తికర అంశాలు వెలుగుచూస్తున్నాయి. టీడీపీ – జనసేన పొత్తులో భాగంగా అభ్యర్థుల వేటలో ఉండగా అసెంబ్లీ ఎన్నికలకు బలమైన కేండేట్లే దొరుకుతున్నారు. లోక్ సభ ఎన్నికల పోటీనే కొంచెం ఇబ్బందిగా మారింది. తమకు లోక్ సభ అభ్యర్థుల కొరత ఉందని టీడీపీ నేతలు బహిరంగంగానే ఒప్పుకుంటున్నారు.జనసేన పరిస్థితి కూడా అలాగే ఉంది. దానితో అభ్యర్థుల ఎంపిక కష్టతరమవుతున్న నేపథ్యంలో అరువు తెచ్చుకున్న నేతలను పోటీలోకి దించాలని టీడీపీ భావిస్తోంది. ఈ దిశగా త్వరలోనే మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ , టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.
గుంటూరు పార్లమెంటుకు ఈ సారి రసవత్తర పోరు ఖాయమనిపిస్తోంది. అక్కడి సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్ పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. వ్యాపార విస్తరణపై ఎక్కువ ఏకాగ్రత చూపాలనుకున్నారు. టీడీపీ గెలిచిన తర్వాత అవకాశం వస్తే పార్టీ అధినేత చంద్రబాబుతో మాట్లాడుకుని రాజ్యసభ సీటు తీసుకోవాలనుకుంటున్నారు. అది గల్లా జయదేవ్ ప్లాన్ బీ మాత్రమే. ప్రస్తుతానికి ఆయనకు ఎలాంటి రాజకీయ ఆకాంక్షలూ లేవు . దానితో గుంటూరు స్ఠానంలో లగడపాటికి ఛాన్సివ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు. త్వరలో లగడపాటిని టీడీపీలో చేర్చుకోవడం ఖాయమైపోయింది. నిజానికి లగడపాటి విజయవాడ స్థానాన్ని కోరుకున్నారు.గతంలో రెండు సార్లు ఆయన విజయవాడకు ప్రాతినిధ్యం వహించారు. విజయవాడ నామినేషన్ దక్కని పక్షంలో ఏలూరు ఇస్తే బావుటుందని ఎదురు చూస్తున్నారు. అక్కడే ఒక ట్విస్ట్ ఉంది. విజయవాడను వదులుకునేందుకు కేశినేని నాని సిద్ధంగా లేరు. రాజకీయాలపై నానికి ఆసక్తి తగ్గినా.. టీడీపీలోని విజయవాడ నేతలపై కసితో అక్కడే పోటీ చేయాలనుకుంటున్నారు. ఆయన కాదనుకుంటే సోదరుడు కేశినేని చిన్ని రెడీగా ఉన్నారు. అంటే ఆ కుటుంబం దాటి విజయవాడ టికెట్ మరోకరికి వెళ్లడం కుదరదని తేలిపోయింది. దానితో లగడపాడిని గుంటూరులో దించాలని టీడీపీ భావిస్తోంది. గుంటూరులో సైతం లగడపాటికి చెందిన కమ్మ సామాజికవర్గం డామినేషన్ ఉండటంతోనూ, ఆ నియోజకవర్గం సేఫ్ సీటు కావడంతో అక్కడే పోటీ చేయించాలని భావిస్తున్నారు. సరిగ్గా అప్పుడే వైసీపీ నుంచి కూడా గట్టి పోటీ ఖాయమనిపిస్తోంది. మాజీ క్రికెటర్ అంబటి రాయుడుని గుంటూరు నుంచి పోటీ చేయించేందుకు సీఎం జగన్ స్కెచ్ వేస్తున్నారు. అంబటి రెండు మూడు సార్లు జగన్ తో భేటీ అయిన సందర్భంగా ఈ చర్చ రాగా, అందుకు మాజీ క్రికెటర్ సుముఖత వ్యక్తం చేశారు. కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాయుడు కుటుంబానికి గుంటూరులో మంచి పట్టు ఉంది. పైగా క్రికెట్ ఫీల్టులో ఉన్న పారిశ్రామికవేత్తలు కూడా అంబటి రాయుడుకు మద్దతు పలుకుతున్నట్లుగా చెబుతున్నారు. గుంటూరులో రాయుడు పోటీ చేస్తే టఫ్ ఫైట్ ఇవ్వడమే కాదు.. గెలిచేందుకు కూడా అవకాశాలు ఉంటాయని వేసీపీ నేతలు అంచనా వేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో 22 చోట్ల పార్టీ గెలిచినా… గుంటూరు, విజయవాడ చేజారిపోయాయన్న అసంతృప్తి వైసీపీ వర్గాల్లో ఉంది. ఈ సారి అలా జరగకుండా టీడీపీ గుండెకాయను కొట్టాలని వైసీపీ నిర్ణయించుకుంది. గుంటూరు గెలిస్తే మాజీ సీఎం చంద్రబాబు సామాజికవర్గంపై కూడా గెలిచినట్లవుతుందన్నది వైసీపీ లెక్క. అందుకే ఈ సారి గుంటూరు పార్లమెంటు రెండు తెలుగు రాష్ట్రాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతుంది…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…