గాజువాక : ఓడిన చోటే పవన్ గెలుస్తారా ?

By KTV Telugu On 19 December, 2023
image

KTV TELUGU :-

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అగ్రనేతలు పోటీ చేసే నియోజకవర్గాలపై అందరి దృష్టి ఉంది.  అయితే అగ్రనేతల్లో ఒక్క పవన్ కల్యాణ్‌కు మాత్రమే ఇప్పటి వరకూ నియోజకవర్గం లేదు. చంద్రబాబు కుప్పం నుంచి  , నారా లోకేష్ మంగళగిరి నుంచి ,  పులివెందుల నుంచి  జగన్ పోటీ చేయడం ఖాయమే. కానీ పవన్ ఎక్కడ పోటీ చేస్తారన్నది  మాత్రం ఇంకా తేలలేదు. అయితే టీడీపీ, జనసేన ఇప్పటికే ఓ అవగాహనకు వచ్చాయని.. గాజువాకను జనసేనకు కేటాయించారని.. అక్కడ్నుంచి  పవన్  పోటీ చేయడం ఖాయమన్న ప్రచారం ఊపందుకుంటోంది. ఇప్పుడు జనసేనానికి గాజువాక నియోజకవర్గం అనుకూలంగా మారిందా ? పొత్తులో  పోటీ చేస్తే మెజార్టీలో ప్రభంజనం సృష్టిస్తారా ?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అంటే చెప్పడానికి పది సీట్లు అయినా కళ్ల ముందు కనిపిస్తాయి. అనంతపురం నుంచి తిరుపతి నుంచి మొదలెడితే కాకినాడ రూరల్, పిఠాపురం, తాడేపల్లిగూడెం, భీమవరం వంటివి కూడా ఉన్నాయి. ఇక 2019లో పవన్ పోటీ చేసి ఓడిన విశాఖలోని గాజువాక సీటు కూడా ఆ జాబితాలో ఉంటుంది.

ఓడిన చోటనే గెలిచి ప్రత్యర్ధుల నోళ్ళు మూయించాలన్నది జనసేన నాయకుల ఆలోచన. అదే విధంగా పవన్ కనుక గాజువాక నుంచి పోటీ చేస్తే ఉత్తరాంధ్రా జిల్లాలలో జనసేనకు అది ఎంతో బలంగా సానుకూలంగా ఉంటుందని అంటున్నారు. అయితే పవన్ మనసులో కూడా గాజువాక ఉందని అంటున్నారు. అందుకే ఆయన అక్కడ్నుంచి పోటీ చేయడం ఖాయమయినట్లే అనుకోవచ్చు.

విశాఖ పారిశ్రామిక రాజధాని అంటారు. దానికి కారణం సమీపంలో ఉన్న గాజువాకనే. పరిశ్రమలు అన్నీ అక్కడే కేంద్రీకృతమై ఉన్నాయి. గాజువాకలో కేంద్ర ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఎన్నో ఉన్నాయి.అలాగే ప్రైవేటు కర్మాగారాలు ఉండడంతో ఇక్కడ వాతావరణం డిఫరెంట్ గా ఉంటుంది. మాస్ ఏరియాగా చెప్పుకోవాలి. ఇక్కడ మెగా ఫ్యాన్స్ ఎక్కువ. కాపులు జనాభా పరంగా మొదటి స్థానంలో ఉంటే ఆ తరువాత యాదవులు ఎక్కువ, ఇక రెడ్లు కూడా పొలిటికల్ గా డామినేటింగ్ రోల్ ప్లే చేస్తారు. మత్య్సకారులు గంగవరం పోర్టు సమీప గ్రామాల్లో ఉంటూ ఎన్నికలను కీలక మలుపు తిప్పుతూంటారు. మొత్తానికి గాజువాక గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఏపీలో హాట్ టాపీ అయింది, దానికి కారణం జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేయడం.

పవన్ కల్యాణ్ తన వారాహియాత్రను గాజువాకలోనూ నిర్వహించారు. 2019లో ఓటమి లభించింది కానీ 2024లో మాత్రం కచ్చితంగా తాము గెలిచి తీరుతామని ప్రకటించారు.  ఈ సారి ఎన్నికల్లో గాజువాక జనసేన సొంతం అయి తీరుతుందని చెప్పుకొచ్చారు. గాజువాకలో జనసేన పోటీ చేస్తుందని చెప్పేశారు. మరి జనసేన తరఫున ఎవరు పోటీ చేస్తారు అన్నది అయితే ఆయన చెప్పలేదు.  కానీ పవన్ పోటీ చేయకపోతే ఆ సీటు జనసేనకు ఇచ్చేందుకు టీడీపీ సిద్ధపడదు. ఎందుకంటే..  ఆ నియోజకవర్గంలో  బలమైన నేత పల్లా శ్రీనివాసరావు టీడీపీకి ఉన్నారు. ఆయన ఐదేల్లుగా ఎన్నో వేధింపులను ఎదుర్కొని మరీ వైసీపీపై పోరాటం చేస్తున్నారు. 2019 ఎన్నికల ముందు గాజువాకలో జనసేనకు 95 వేల సభ్యత్వం ఉంది. దాంతో అది బలమైన సీటుగా భావించి పోటీ చేశారు. అయితే సభ్యత్వం తీసుకున్న వారు అంతా ఓటేయరని ఆ తరువాత అర్ధం అయింది. 2019లో యాభై వేల ఓట్లు మాత్రమే పవన్‌కు వచ్చాయి. గాజూవాకలో టీడీపీకి వైసీపీకి బలమైన ఓటింగ్ ఉంది. పవన్‌తో సమానంగా  పల్లా శ్రీనివాసరావుకు గాజువాకలో ఓటింగ్ వచ్చింది.

పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో  మొదట పరాజయం ఎదురైనా   పోయిన చోటనే వెతుక్కోవాలనుకుంటున్నాడుట. దాంతో ఆయన విశాఖ వస్తే కచ్చితంగా గాజువాకలోనే తన టూర్లు ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నట్లుగా చెబుతున్నారు. గాజువాక నుంచి పవన్ మళ్లీ పోటీచేస్తారని జన సైనికులు గట్టిగా నమ్ముతున్నారు. పవన్ ఈసారి పోటీ చేస్తే కచ్చితంగా గెలుస్తాడని కూడా చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో సింగిల్ సీటు గా గాజువాకనే పవన్ ఎంచుకుంటారని కూడా అంటున్నారు. 2019 ఎన్నికల్లో జ‌గన్ గాలి బలంగా వీచడం, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి తిప్పల నాగిరెడ్డి అప్పటికి రెండు మార్లు పోటీ చేసి ఓడిన సానుభూతి తోడు అవడం, జనసేన చేసిన కొన్ని తప్పుల కారణంగా పవన్ ఓడారని నివేదికలు ఉన్నాయట. అందుకే ఈసారి గాజువాక తమకు గ్యారంటీ సీటు అంటున్నారు.

టీడీపీతో పొత్తుతో పవన్ పోటీ చేయడం ఖాయమని వైసీపీ కూడా భావిస్తోంది. అందుకే అభ్యర్థిగా మంత్రి గుడివాడ అమర్నాత్ ను ఖరారు చేయాలని నిర్ణయించింది. ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డిని ఇప్పటికే పక్కన పెట్టారు. ఇంచార్జ్ గా అమర్నాథ్ బంధువును  నియమించారు.

తెలుగు దేశం, జనసేన పార్టీ కలిస్తే..  గాజువాకలో మెజార్టీ రికార్డు స్థాయిలో వస్తుందన్న అభిప్రాయం జనసైనికుల్లో ఉంది. అదీ పవన్ కల్యాణ్ అయితే చెప్పాల్సిన పని లేదంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉండటం… విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పేరుతో దందాలు చేశారన్న ప్రచారం, విశాఖ ప్రశాంతతకు భంగం వాటిల్లిందని ప్రజల అభిప్రాయంతో పాటు గాజువాక నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్న స్టీల్ ప్లాంట్ ఓటర్లు అందరూ వైసీపీకి వ్యతిరేకమయ్యారని భావిస్తున్నారు. ఈ విషయంపై అవగాహన ఉండటంతో వైసీపీ అధినాయకత్వం వెంటనే అలర్ట్ అయింది. సర్వేల్లో పరిస్థితి తేడాగా ఉండటంతో  తిప్పల నాగిరెడ్డిని పక్కన పెడుతున్నట్లుగా ప్రకటించింది. ఇంచార్జ్ గా ఆయన కుమారుడు దేవన్ రెడ్డి ఉన్నారు. ఆయనను కూడా తొలగించింది. వరికూటి రామచంద్రరావు అనే వ్యక్తికి ఇంచార్జ్ పదవి ఇచ్చారు. ఆయన ఎవరో కూడా సగం మంది గాజువాక వైసీపీ క్యాడర్ కు తెలియదు. కానీ అసలు ఆయనను నియమించడానికి కారణం వేరే ఉందని వైసీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆయన మంత్రి గుడివాడ అమర్నాథ్ బంధువు, అక్కడ్నుంచి అమర్నాథ్‌ను నిలబెట్టాలన్న ఆలోచనతోనే ఆయన సూచనతోనే బంధువును ఇంచార్జ్ గా నియమించారంటున్నారు.

అనకాపల్లిలో మంత్రి అమర్నాథ్ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు. అయితే గాజువాకలో పోటీ చేయడం అంటే.. తనను బలి చేసినట్లేనన్న వాదన ఆయనలో కూడా ఉందని తెలుస్తోంది. అయితే పవన్ గాజువాకలో నిలబడితే.. అమర్నాథ్ నే ప్రత్యర్థిగా చేయాలని చాలా కాలంగా వైసీపీ హైకమాండ్  స్కెచ్  వేస్తోంది. పవన్ ఏం మాట్లాడినా వెంటనే అమర్నాథ్ తో కౌంటర్ ఇప్పిస్తోంది. ఆయనకు ప్రత్యర్థిగా ప్రొజెక్ట్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పుడు పవన్ గాజువాకలో నిలబడితే వైసీపీ తరపున మంత్రి అమర్నాథే ప్రత్యర్తి అవుతారని గట్టిగా చెబుతున్నారు.

ఎవరు ప్రత్యర్థి అయినా ప్రస్తుత రాజకీయ సమీకరణాల ప్రకారం చూస్తే.. టీడీపీ, జనసేన పొత్తులో పవన్ పోటీ చేస్తే… యాభై వేల ఓట్ల మెజార్టీ రావొచ్చన్న అంచనాలు ఉన్నాయి. అయితే ఇక్కడ టీడీపీనేత పల్లా శ్రీనివాసరావు ఏం చేస్తారన్నది కీలకం. ఆయన సీటు వదులుకోరు. ప్రత్యామ్నాయం చూపించాలి. ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే సానుభూతిగా జనం మొత్తం ఆయన వైపే ఉండవచ్చు. ఆయన ప్రజల్లో ఉండే నేత. అంటే.. ఇక్కడ పవన్ గెలవాలంటే.. పల్లా శ్రీనివాస్ ముఖ్యం అని చెప్పుకోవచ్చు.రాజకీయాల్లో పొత్తులు సక్సెస్ అవ్వాలంటే.. అన్ని కోణాల్లోనూ రాజకీయ పార్టీలు కలిసిపోవాలి. గాజువాకలో అలా కలిస్తే పవన్  గెలుపును ఎవరూ ఆపలేరని తాజా పరిస్థితులు చెబుతున్నాయి…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి