పెళ్లి ఖర్చు రూ. 4.74 లక్షల కోట్లు…

By KTV Telugu On 19 December, 2023
image

KTV TELUGU :-

పెళ్లి జన్మజన్మల బంధానికి నిదర్శనమంటారు. ఏడడుగులు వేస్తే వందేళ్లు కాపురం చేస్తారంటారు. ఆడంబర ఖర్చుల కంటే  స్వచ్ఛమైన హృదయంతో సింపుల్ గా పెళ్లి చేసుకుంటే మంచిదని ఒకప్పుడు చెప్పేవారు. ఇప్పుడు తీరు మారింది. పెళ్లిళ్లలో కొత్త సీన్లు వచ్చేశాయి. ఎంత ఖర్చు పెడితే అంత గొప్ప అన్నట్లుగా పరిస్థితి తయారైంది. దానితో సంపన్న, ఉన్నత మధ్యతరగతి వర్గాల వాళ్లు ఒక్కో పెళ్లికి కోట్లు ఖర్చుపెట్టేస్తున్నారు.  అలా ఖర్చు చేయకపోతే తన పరువుకు భంగం కలుగుతుందనుకుంటున్నారు..

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబరు 23న జరగాల్సి  ఉంది. ఆ రోజు ఎక్కువ పెళ్లిళ్లు ఉండటంతో జనం ఓటు వేసేందుకు రారని నిర్ణయించుకున్న  ఎన్నికల సంఘం దాన్ని నవంబరు 25కు వాయిదా వేసింది. ఇదీ దేశంలో ఇప్పుడు పెళ్లిళ్లకు జనం తండోపతండాలుగా ఎగబడుతున్న తీరుకు  నిదర్శనం. నిరుపేదల సంగతి వదిలేస్తే.. మధ్య తరగతి వారు  పెళ్లిళ్లకు 5 లక్షల నుంచి 50 లక్షల వరకు ఖర్చు పెడుతున్నారు. కొన్ని ఎగువ మధ్య తరగతి కుటుంబాల్లో ఖర్చు సింపుల్ గా కోటి రూపాయలవుతోంది. సంపన్నులు, డెస్టినేషన్ వెడ్డింగుకు వెళ్లే వారికి  ఐదు కోట్ల వరకు ఖర్చయినా ఆశ్చర్యం లేదని చెప్పక తప్పదు. అందుకే 2023లో నవంబరు, డిసెంబరు మధ్య దేశంలో పెళ్లిళ్ల సీజన్ ఖర్చు 4.74 లక్షల కోట్లు అయ్యిందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్ నిగ్గు తేల్చింది. అనేక దేశాల స్థూల జాతీయోత్పత్తితో పోల్చితే ఇది చాలా ఎక్కువ. 2024 వెడ్డింగ్ సీజన్లో ఆ వ్యయం కనీసం 25 శాతం పెరగొచ్చని అంచనా వేస్తున్నారు…

పెళ్లిళ్ల తీరు మారుతోంది. పరిస్థితి 1970ల లాగ లేదు. అప్పట్లో ఎంత మంది బంధువులు, అతిథులు వచ్చినా తక్కువ ఖర్చుతో పెళ్లిళ్లు ముగించేవారు. అది పెళ్లి వేడుక మాత్రమేనని, ఆడంబరం కాదని చెప్పుకునే వారు. ఇప్పుడు సరికొత్త వ్యయాలు వచ్చేశాయి. వచ్చిన అతిథులకు మర్యాద  చేస్తే సరిపోదట. వారికి ఖరీదైన రిటర్న్ గిఫ్టులు ఇచ్చి పంపించడం రివాజుగా మారుతోంది. పైగా ఇప్పుడు ఐదురోజుల పెళ్లిళ్లకు కూడా ఆదరణ బాగా పెరిగింది.

పూర్వ కాలంలో పెళ్లి అంటే బంధువులు వారం ముందే వచ్చేవారు. కాకపోతే అందరూ ఉన్న ఇంట్లోనే సర్దుకుని వండుకు తినడంతో పెద్దగా ఖర్చులు కనిపించేవి కాదు. ఇప్పుడు సంగీత్, మేహందీ అంటూ పెడుతున్న ఖర్చు  తడిసి మోపెడవుతోంది. పెళ్లి ఖర్చులో సగభాగం ఫోటోలు,వీడియోలు,స్టేజ్ డెకరేషన్, పెళ్లి మండపం, కేటరింగ్, డీజే, వాహనాల అద్దెలకే పోతోంది.మిగతా యాభై శాతంలో ఎక్కువ భాగం బట్టలు, నగలకు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఐదు శాతం వరకు ఖర్చులు  రిటర్న్ గిఫ్ట్స్ కు పోతున్నాయని లెక్క తేల్చారు. సగం మందికి షుగర్  ఉన్నా స్వీట్స్ ఖర్చు మాత్రం తగ్గడం  లేదు.పెళ్లికి వచ్చిన  వాళ్లు తిని వృథా చేసింది పోగా, వెళ్లేప్పుడు స్వీట్ బాక్సులు ఇచ్చి పంపాలి. మరో పక్క డెస్టినేషన్ వెడ్డింగ్ ఇప్పుడు ప్రెస్టీజియస్ ఇవెంట్ అవుతోంది. సంపన్నులంతా  విదేశాల్లో పెళ్లి వేడుకలు చేసుకుంటున్నారు. కోటి నుంచి  కోటి 20 లక్షల ఖర్చు పెట్టుకోగలిగితే ధాయ్ లాండ్ వెళ్లి పెళ్లి చేసుకోవచ్చు. అది చాలా చీప్ అనుకునే వాళ్లు కూడా ఉన్నారు. అలాంటి వాళ్లు ఇటలీ లేదా యూరప్ లోని వేరు దేశానికి  వెళ్లి పెళ్లి చేసుకు వస్తున్నారు. ఇటలీలో విలాసవంతంగా పెళ్లి చేసుకోవాలంటే 5 కోట్ల వరకు ఖర్చవుతుంది. అది ఇండియా నుంచి  200 మంది వరకు అతిథులకు తీసుకువెళితేనే ఖర్చు అంతకు పరిమితమవుతుంది. ఇంకా ఎక్కువ మందిని తీసుకెళితే ఆ ఖర్చు వేరుగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. థాయ్ లాండ్ హోటళ్లు వాయిదాల పద్ధతిలో డబ్బులు చెల్లించేందుకు కూడా అనుమతించడం జనం అటుగా వెళ్తున్నారని వెడ్డింగ్ ప్లానర్స్ అంటున్నారు. ఇక డెస్టినేషన్ వెడ్డింగ్ పై ప్రధాని మోదీ కామెంట్స్ ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిందే. భారతీయుల సొమ్ము విదేశాలకు తరలి వెళ్తోందని, అదే పెళ్లి ఇండియాలో జరిగితే చాలా మందికి ఉపాధి లభించడంతో పాటు మనదేశానికే పన్నులు చెల్లించినట్లవుతుందని ఆయన అన్నారు. అందుకే  మేడిన్ ఇండియా  తరహాలో వెడ్ ఇన్ ఇండియా ప్రచారం ఊపందుకోవాలని ఆయన అంటున్నారు. ఇండియాలో కూడా డెస్టినేషన్ వెడ్డింగుకు అవకాశాలున్నాయి.  గోవా, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, అండమాన్ దీవుల్లోని అందమైన ప్రదేశాలు, హోటళ్లు డెస్టినేషన్ వెడ్డింగుకు వీలుగా ఉంటాయని చెబుతున్నారు.

2024 లో సంక్రాంతి తర్వాత పెళ్లిళ్ల సీజన్ మొదలవుతుంది. సంక్రాంత తర్వాత ప్రారంభమయ్యే వెడ్డింగ్ సీజన్..జూలై వరకు కొనసాగుతుంది. అప్పుడు దేశంలో లక్షల పెళ్లిళ్లు ఖాయం.జీవితంలో ఒక్క సారి చేసుకునే పెళ్లికి ఎంత ఖర్చయినా పెట్టుకునేందుకు వధూవరుల కుటుంబాలు సిద్ధమవుతున్నాయి. అందులో సగం ఖర్చులు భరించేందుకు కుటుంబ పెద్దలతో పాటు వధూవరులు ముందుకు వస్తున్నారు. ఈ సారి ఎన్ని లక్షల కోట్లు ఖర్చవుతుందో చూడాలి.కాకపోతే ఆ ఖర్చును స్థిరాస్తులు కొనుక్కునేందుకు ఖర్చు చేస్తే బావుంటుంది కదా అని సూచించే వాళ్లూ లేకపోలేదు. వాళ్ల మాట ఎవరూ వినరు కదా….

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి