వైసీపీలో కృష్ణా జిల్లా పాలిటిక్స్ బ్రేకింగ్ పాయింటుకు వచ్చినట్లుగా కనిపిస్తున్నాయి. చాలా మంది ఎమ్మెల్యేలను ఇంటికి పరిమితం చేసేందుకు సీఎం జగన్ రెడ్డి డిసైడైనట్లు చెబుతున్నారు. తమకు బలం లేని చోట్ల ఇంఛార్టీలుగా వేయడమేంటని కొందరు లోలోన మధనపడుతున్నారు. కక్కలేక మింగలేక గుభనంగా ఉన్న అసమ్మతి ఏ రోజైనా పెల్లుబికే అవకాశం ఉందని భావిస్తున్నారు..
హైకమాండ్ సమూల మార్పులకు సిద్ధమవుతోంది. ఎవరేమనుకున్నా తన అజెండాను అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ దిశగా కార్యాచరణ కూడా కొంత మేర అమలుకు వచ్చింది. 11 మంది ఇంఛార్జీల మార్పుతో ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాల అభ్యర్థులు కొంత మేర కొలిక్కి వచ్చినట్లు భావిస్తుండగా, ఇప్పుడు జగన్ టీమ్.. ఉమ్మడి కృష్ణా జిల్లాపై దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు.
పక్క జిల్లాల పరిణామాలు చూసి కొందరు కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలు అలెర్టయ్యారు. తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్లి జగన్ తో మాట్లాడేందుకు ప్రయత్నించారు. వారికి ఎలాంటి హామీ వచ్చిందో తెలియదు.. మార్పు ఖాయమన్నది మాత్రం వాళ్లు మొహాల్లో కొట్టొచ్చినట్లు కనిపించింది. ఒకరిద్దరికీ ఇబ్బందులు తప్పవని తేలిపోయింది.
టీడీపీని వీడి వైసీపీలో చేరిన ఎమ్మెల్యేలకు మొండి చేయి ఖాయంగా కనిపిస్తోంది. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాల గిరి విషయమే ఒక ఉదాహరణగా చెప్పోచ్చు. ఆర్య వైశ్య సామాజిక వర్గానికి చెందిన ఆయనను ఇంఛార్జీ పదవి నుంచి తీసేశారు. అది గుంటూరు జిల్లా పరిస్థితి. కృష్ణా జిల్లా వ్యవహారం ఇంకా దారుణంగా ఉంది. కృష్ణాజిల్లాలో గన్నవరం నుంచి గెలుపొంది, ఆ తర్వాత వైసీపీలో చేరిన వల్లభనేని వంశీ సీటుకు కూడా ఎసరు పెట్టారు. వల్లభనేని వంశీ గన్నవరంలో పోటీ చేస్తే అక్కడ గెలిచే అవకాశం లేదని ఐప్యాక్ బృందంతో పాటు, పార్టీ నేతలు కూడా ఫీడు బ్యాక్ ఇచ్చినట్లు తెలిసింది. ఇప్పటికే వంశీని వ్యతిరేకించే దుట్టా రామచంద్రరావు తాను వంశీకి మద్దతు ఇవ్వబోనని తెగేసి చెప్పారు. మరోవైపు ఇటీవల తెలుగుదేశం ఇన్ ఛార్జిగా నియమించిన యార్లగడ్డ వెంకట్రావు గత ఎన్నికలలో వల్లభనేని వంశీపై పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత తెలుగుదేశంలో చేరి ఇక్కడ ఇన్ ఛార్జిగా వచ్చిన యార్లగడ్డ వెంకట్రావుకు తెలుగుదేశం వర్గాలు పూర్తిగా మద్దతు పలుకుతుండగా వైసీపీలో ఆయనతో నడిచిన వారు కూడా వచ్చేశారు. పైగా నియోజకవర్గంలో ఆయా గ్రామాల్లో యార్లగడ్డ వెంకట్రావు గ్రౌండ్ వర్కు ప్రారంభించారు. నియోజకవర్గంలో పరిణామాలను తెలుసుకున్న వైసీపీ హైకమాండ్ వల్లభనేని వంశీని గన్నవరంలో కాకుండా పెనమలూరుకు పంపిస్తే ఎలా ఉంటుందని పరిశీలిస్తోంది. పెనమలూరులో ఉన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే పార్ధసారధిని గన్నవరం నుంచి పోటీ చేయించే అంశాన్ని కూడా హైకమాండ్ పరిశీలిస్తుంది. ఈ నేపధ్యంలోనే పార్ధసారధి అక్కడ పోటీ చేసేందుకు ఇష్ట పడతారా లేదా అనేది తేలాల్సి ఉంది. ప్రధానంగా గన్నవరంలో పార్దసారధి సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువుగా ఉండటం, ఇదే సామాజిక వర్గానికి చెందిన ముద్దరబోయిన వెంకటేశ్వరరావు కూడా గతంలో ఇక్కడ ఇండిపెండెంట్ గా పోటీ చేసి విజయం సాధించడాన్ని ఈ సందర్భంగా వైసీపీ నేతలు పరిగణలోకి తీసుకున్నారు. అయితే పార్ధసారధి ప్రస్తుతం అంత క్రీయాశీలకంగా లేరు. వంశీ ఇటీవల ముఖ్యమంత్రిని కలిసేందుకు తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్లారు. వంశీతో పాటు కొడాలి నాని, జోగి రమేష్ కూడా ఇన్ చార్జిలను మార్పు చేసిన రోజు ప్యాలెస్ కు వెళ్లారు. ఆ తర్వాత వీరి ముగ్గురుతో పాటు పేర్ని నాని, సింహాద్రి రమేష్ కూడా ప్యాలెస్ లో ప్రత్యక్షం అయ్యారు. అక్కడ ఏం జరిగిందనేది బయటకు రాకపోయినప్పటికీ వైసీపీ వర్గాల్లోనే గన్నవరం, పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యేలు సీట్లు పరస్పర మార్పిడి ఉంటుందని విస్తృతంగా ప్రచారం జరుగుతుంది.
నిజానికి గుడివాడ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నాని తప్పితే ఎవరికీ సీటు కన్ఫర్మ్ కాలేదని చెబుతున్నారు.అందుకే పేర్ని నాని, వల్లభనేని వంశీ లాంటి వాళ్లు భయపడుతున్నారు. జగన్ వారికి సరైన సమాధానం చెప్పకపోవడం కూడా ఒక కారణమే. ఏది అడిగినా వెళ్లి పని చూసుకోమని చెప్పి పంపించేస్తున్నారట. దానితో తాము ముఖ్యంగా ఐ ప్యాక్ ముఖ్యమా అని కృష్ణా ఎమ్మెల్యేలు కారాలు, మిరియాలు నూరుతున్నారు…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…