తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి క్రేజ్ రోజురోజుకు పెరిగిపోతోందా. ఆయన అప్పుడప్పుడు తమ రాష్ట్రానికి కూడా వచ్చి వెళ్లాలని ఏపీ కాంగ్రెస్ నేతలు ఎదురు చూస్తున్నారా. పార్టీని బతికించుకునే క్రమంలో రేవంత్ కూడా అందుకు అంగీకరించారా.. రేవంత్ అందుకు అంగీకరించడానికి ప్రత్యేకమైన కారణాలు ఏమైనా ఉన్నాయా….
తెలంగాణలో ఏపీ సెటిలర్లు ఉన్నట్లే ఏపీపైనా తెలంగాణ ప్రజలకు ఆసక్తి ఎక్కువగానే ఉంటుంది. ఏపీ రాజకీయాలపై తెలంగాణ వారు ఎక్కువగా చర్చించుకుంటూనే ఉంటారు. రెండు రాష్ట్రాల ప్రజల మధ్య సంబంధాలు కూడా అలాంటివేనని చెప్పక తప్పదు. రాష్ట్ర విభజనను వ్యతిరేకించిన వారు సైతం తెలంగాణ పాలిటిక్స్ పై ఎక్కువ మాట్లాడుతుంటే.. సమైక్యవాదుల తీరును తప్పుపట్టే వారు కూడా ఏపీ రాజకీయాలపై మాట్లాడుతుంటారు. అందుకే ఏపీ, తెలంగాణ పాలిటిక్స్ కు విడదీయరాని సంబంధం ఉంటుందంటారు. ఇదీ ఒక కోణమైతే ఇటీవలి కాలంలో ఒక రాష్ట్ర రాజకీయాలపై మరో రాష్ట్ర నేతలు ప్రభావం చూపాలనుకోవడం కూడా జరుగుతోంది. బీఆర్ఎస్ ఏర్పాటు చేసినప్పుడు కేసీఆర్ కూడా ఏపీ వైపు చూశారు. అక్కడ పార్టీ శాఖను ఏర్పాటు చేసి తోట చంద్రశేఖర్ ను అధ్యక్షుడిగా నియమించారు. విజయవాడలో బీఆర్ఎస్ సభ పెట్టాలన్న కేసీఆర్ కోరిక నెరవేరక ముందే ఆయన తెలంగాణ పీఠం నుంచి దిగిపోవడం ఒక వంతయితే… తాజా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఏపీ వైపు చూడటం మరో వంతు..
రేవంత్ రెడ్డి తెలంగాణలోనే బిజీగా ఉన్నారు. నిజానికి ఆయనకు ఏపీ వైపు చూసేంత టైమ్ లేదు. ఐనా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నేతలు ఆయన కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన అప్పుడప్పుడు వచ్చి పోతుంటే పార్టీకి మంచిదన్న అభిప్రాయంతో రావాలంటూ సందేశాలు పంపుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి..
రేవంత్ రెడ్డికి ఏపీలో ఓ క్రేజ్ ఉంది. ఫైర్ బ్రాండ్ నేతగా పేరుంది. ఆయన ఎక్కడకు వెళ్లినా వేలాది మంది వస్తుంటారు. అమరావతి శంకుస్థాపన రోజున రేవంత్ రెడ్డి స్టేజీ ఎక్కితే అక్కడ చప్పట్లతో మారుమోగిపోయింది. ఇప్పుడు కూడా అదే క్రేజ్ కొనసాగుతోంది. రేవంత్ రెడ్డి డైలాగులను ఒకటికి వంద సార్లు వింటూ ఏపీ జనం ఎంజాయ్ చేస్తున్నారు. ఆ ఫోలోయింగ్ ను వాడుకుంటూ పార్టీని మళ్లీ డెవలప్ చేసుకోవాలని ఏపీసీసీ నేతలు భావిస్తున్నారు. అందుకే రేవంత్ రెడ్డి, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అప్పుడప్పుడు ఏపీకి వచ్చిపోవాలని వాళ్లు కోరుకుంటున్నారు. అక్కడక్కడా మీటింగులు పెడితే జనంలో కాంగ్రెస్ పట్ల మళ్లీ అభిమానం పెరిగి కొన్ని ఎమ్మెల్యే సీట్లు వస్తాయని వాళ్లు ఎదురుచూస్తున్నారు. పనిలో పనిగా వైఎస్ షర్మిలను ఏపీసీసీ అధ్యక్షురాలిగా నియమించాలన్న అధిష్టానం కోరిక త్వరలో నెరవేరాలని కూడా రాష్ట్ర నేతలు ఎదురు చూస్తున్నారు. అలా జరిగితే పార్టీ నుంచి వైసీపీలో చేరిన వైఎస్ అభిమానులు తిరిగి వస్తారన్నది వారి ఆలోచనగా తెలుస్తోంది. అప్పుడు వైసీపీ బలం కాస్తైనా తగ్గి ముక్కోణ పోటీలో కాంగ్రెస్ కు ప్రయోజనం కలిగే అవకాశం ఉందని ఎదురు చూస్తున్నారు…
షర్మిలకు ఏపీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే ప్రస్తుత ప్రెసిడెంట్ గిడుగు రుద్రరాజు దిగిపోవాల్సి వస్తుంది.అందుకు ఆయన సుముఖంగా ఉన్నారు. పార్టీని పటిష్టం చేసేందుకు ఎలాంటి త్యాగానికైనా సిద్దంగా ఉన్నారు. రేవంత్ రెడ్డికి ఆయన మంచి మిత్రుడు. ఏపీకి అప్పుడప్పుడు వచ్చి పార్టీ శ్రేణులను ఉత్తేజ పరచాలని ఆయన కోరుతున్నారు. త్వరలో ఏం జరుగుతుందో చూడాలి…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…