తలంబ్రాలకు ఓట్లు రాలతాయా ?

By KTV Telugu On 21 December, 2023
image

KTV TELUGU :-

వాజ్‌పేయి మరణించినప్పుడు ఆయన అస్థికలను  దేశవ్యాప్తంగా బీజేపీ ప్రచారానికి వాడుకుంది. అన్ని నదుల్లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. నిజంగా అంత భారీగా అస్థికలు ఉంటాయా అని ఎవరికీ డౌట్ రాలేదు. రానివ్వలేదు. బీజేపీ మార్కెటింగ్ అలా ఉంటుంది. అదో భావోద్వేగమైన రాజకీయం. అదే పద్దతిని ఇప్పుడు అయోధ్య రాముడి విషయంలో చేస్తోంది. రాముడి గుడి నుంచి తెప్పించిన తలంబ్రాలు అటూ దేశంలోని అన్ని ఇళ్లకూ తలంబ్రాలు పంపబోతున్నారు. ఓట్ల వేట కోసం దాన్ని ఉపయోగించుకోబోతున్నారు.

అయోధ్యలో నిర్మించిన రామ మందిరాన్ని 2024 జనవరి 22న ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు.  ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా శ్రీరాముడి తలంబ్రాలను పంపిణీ చేయాలని బీజేపీ-సంఘ్‌పరివార్‌ నిర్ణయించాయి.  ఇప్పటికే ఒక్కో రాష్ట్రానికి పెద్ద సంఖ్యలో తలంబ్రాల బస్తాలను పంపారు.  వాటికి తోడు స్థానికంగా మరిన్ని తలంబ్రాలను సిద్ధం చేస్తున్నారు. అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం జరుగగానే.. ఇక్కడ అదే సమయంలో ఇంటింటికీ శ్రీరాముడి తలంబ్రాలను పంపిణీ చేయనున్నారు.  ఈ పంపిణీ కార్యక్రమానికి పెద్ద ఎత్తున యంత్రాంగాన్ని కూడా సిద్ధం చేశారు.

22వ తేదీన ప్రారంభోత్సవం సందర్భంగా చేసే ఉపన్యాసాన్ని దేశ వ్యాప్తంగా అన్ని ఆలయాలు, హిందూత్వ సంస్థల ప్రాంగణాల్లో లైవ్‌ కవరేజీ ద్వారా భక్తులకు వినిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసింది. అందుకోసం ఆయా ఆలయాలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేయనున్నారు. ఢిల్లీలో భారీ ఎల్‌ఈడీ స్క్రీన్లను సిద్ధం చేస్తున్నారు. ఇదే తరహాలో అన్ని ప్రాంతాల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి.  దేశం నలుమూలల నుంచి ప్రజలను అయోధ్య తరలించాలని చూసినప్పటికీ కేవలం పది పదిహేనువేల మంది అతిథులకు మాత్రమే ఏర్పాట్లు చేస్తున్నారు.  వీవీఐపీలు సైతం రావొద్దని అయోధ్య ట్రస్టు పేర్కొన్నది.  రామ్‌ లల్లా విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ ముందు ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు చేయనున్నారు. మొత్తంగా రాముడి అజెండా చుట్టూ ఎన్నికలను తిప్పి.. రాజకీయంగా లాభం పొందడానికి బీజేపీ చేస్తున్న ఎత్తుగడగా కూడా దీనిని భావిస్తున్నారు.  ఈ మూడ్‌ నుంచి ప్రజలు బయటకు రాకముందే లోక్‌సభ ఎన్నికలు నిర్వహించే సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి.

నిజానికి ఇద్దరు ఎంపీలున్న బీజేపీని అధికారం దిశగా నడిపించింది రామ మందిరం. ప్రజల విశ్వాసాన్ని సరిగ్గా పట్టుకున్న బీజేపీ.. ప్రజల మత విశ్వాసాన్ని ఆధారం చేసుకునే హిందూత్వ అజెండాను అమలు చేసింది. ఒకప్పుడు తాము ఇచ్చిన మాటను ఈ విధంగా నిలబెట్టుకున్నామని చాటడం ద్వారా మరో దఫా ప్రజలను ఆకర్షించేందుకు ప్రయత్నాలో ఉన్నది. ఇప్పటికే ఆరెస్సెస్‌, వీహెచ్‌పీ వంటి సంస్థలు ఆలయ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని జన్‌ఉత్సవ్‌లు నిర్వహించాలని పిలుపునిచ్చాయి. ఇదంతా ప్రజలను ఎన్నికల దాకా ఇదే మూడ్‌లో ఉంచడమేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రామమందిరం బీజేపీకి మూడు రకాలుగా రాజకీయం లబ్ధి చూకూర్చుతుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

మొదటిది ఈ ప్రాంతంపై దీర్ఘకాలికంగా సాగిన వివాదాన్ని పరిష్కరించి, అక్కడ రామ మందిరాన్ని నిర్మిస్తున్నామని చెప్పుకోవడం. మోదీ ఇచ్చిన హామీలు నెరవేర్చుతారని తాజాగా బీజేపీ నేతలు చెప్పుకొంటున్న దానికి మరోటి అదనంగా తోడైనట్టు అవుతుంది. ఇక చివరిది రాబోయే ఎన్నికల్లో హిందూ ఓటర్లను ఆకర్షించడం. బీజేపీ మరోమారు భారీ స్థాయిలో తీసుకువస్తున్న హిందూత్వ ఎజెండాకు దీటుగా స్పందించేందుకు ప్రతిపక్షాలు భారీ కసరత్తునే చేయాల్సి వస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో హిందూత్వ సెంటిమెంట్ తో అధికారాన్ని  పొంది ఎలా దాన్ని నిలబెట్టుకోవాలన్నది బీజేపీ చేసి చూపిస్తోంది. అలాంటి రాజకయం ఇంకెవరికీ సాధ్యం కాదు…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి