ఆంధ్రప్రదేశ్‌లోని సెలబ్రిటీ నియోజకవర్గాల్లో ఒకటి గుడివాడ. గుడివాడ. గుడివాడ నాని. ఈ రెండు తెలుగుదేశం పార్టీ హిట్ లిస్ట్‌లో ఉన్నాయి. కానీ సాధించలేకపోతున్నారు. గత రెండు సార్లు టార్గెట్ రీచ్ కాలేదు. మూడో సారి ప్రయత్నిస్తున్నారు. కానీ ఈ సారి కూడా నాని కి ధీటైన అభ్యర్థిని ఖరారు చేయలేకపోయారన్న అభిప్రాయం వినిపిస్తోంది. కానీ కొడాలి నానిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని.. ఆయనలా బూతులు మాట్లాడే నేతలు అవసరం లేదని.. విద్యాధికుడు అయిన వారికి ప్రజలు పట్టం కడతారని టీడీపీ నేతలు భావిస్తున్నారు. .
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుపై బూతులతో విరుచుకుపడే నేత కొడాలి నాని. ఆయనను ఓడించడానికి చాలా ప్రయత్నాలు టీడీపీపీ చేస్తోంది. కానీ సక్సెస్ కావడం లేదు. నియోజకవర్గంలో పెద్దగా అభివృద్ధి పనులు లేకపోయినా కొడాలి నాని కంఫర్టబుల్ పొజిషన్ లో ఉండటానికి కారణం ఆయన ప్రజలతో విస్తృత సంబంధాలు నిర్వహించడమే. ఇళ్లల్లో ఏ శుభకార్యానికి పిలిచినా వెళ్తారు. ఎంతో కొంత ఆర్థిక సాయం చేస్తారు. అదే సమయంలో ఎలక్షనీరింగ్ ఆయన బలం. ఎలాగైనా గెలుస్తామని ఆయన అనుచరులు నియోజకవర్గంలో ఇప్పటికే ఓ రకమైన ప్రచారాన్ని, వాతావరణాన్ని కల్పించుకున్నారు. అదే సమయంలో ప్రభుత్వ లబ్దిదారులను గ్రిప్‌లో పెట్టుకోగలిగారు.
టీడీపీ కొడాలి నానిని ఎదుర్కొనే నేతను ఖరారు చేసుకోవడంలో ఆలస్యం చేసింది. చివరికి రావి వెంకటేశ్వరరావును కాదని ఎన్నారై వెనిగండ్ల రామును ఇటీవలే ఇంచార్జ్ గా నియమించింది. అయితే కొడాలిపై ఆయన ఎప్పుడూ దూకుడుగా వ్యవహరించిన దాఖలాలు లేవు. కొడాలి నాని లాంటి వ్యక్తిని ఢీ కొట్టాలంటే.. ఢీ అంటే ఢీ అనే నేత ఉన్నప్పుడు మాత్రమే పోటాపోటీ వస్తుందన్న అభిప్రాయం ఉంది. అయితే వెనిగండ్ల రాము సాఫ్ట్ స్పోకెన్ పర్సన్. ఆయన తన దూకుడును ఇంకా పెంచాల్సి ఉందన్న అభిప్రాయం ఉంది. ఎంత మనీ పవర్ ఉన్నా.. కొడాలి నాని కూడా అంతకు మించి ఖర్చు పెట్టగలరని.. ఆయనను ఓడించాలన్న అభిప్రాయం రావాలంటే.. ఆయనకు మించిన దూకుడు చూపించాలన్న అభిప్రాయం ఉంది. అయితే అలాంటి బూతుల నేతపై ప్రజలు విరక్తి చెందారని.. గుడివాడ గౌరవాన్ని పెంచే నేతగా వెనిగండ్ల రాము ఉంటారని టీడీపీ నేతలు అంచనాకు వస్తున్నారు.
గుడివాడ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా సమస్యలే కనిపిస్తూంటాయి. అభివృద్ధి పనులు ఎక్కడా జరగడం లేదు. రోడ్లు సైతం అధ్వాన్నంగా ఉన్నాయి. కొడాలి నాని ఎమ్మెల్యేగా రెండు దశాబ్దాలుగా ఉంటున్నారు. కానీ 22 ఏళ్ల నుంచి పునాదుల్లోనే ఆగిపోయిన రెండు ఫ్లైఓవర్లను పూర్తి చేయించలేకపోయారు. ఇప్పటికీ పనులు జరుగుతున్నట్లుగా కనిపిస్తూంటాయి కానీ ఒక్క అడుగు ముందుకు పడటం లేదు. కేంద్ర ప్రభుత్వ అమృత్ స్కీం నిధులతో చేపట్టిన ప నులు కూడా మధ్యలో ఆగిపోయాయి. అంతకు ముంచి గుడివాడలో రోడ్లు, డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉంది. ఏ ఒక్క కాలనీలోనూ..గ్రామంలోనూ డ్రైనేజీ సరిగ్గా లేదు. ఎక్కడా పనులు చేపట్టలేదు. మురుగు నీరు రోడ్ల మీద పారుతూ కనిపిస్తోంది. ఇక రోడ్లు మొత్తం అధ్వాన్నంగా మారిపోయి చాలా కాలం అయింది. ఇక గుడివాడ బస్టాండ్ దీన స్థితిలో ఉంది. బాగు చేస్తామని చెప్పి పనులు ప్రారంభించి మధ్యలో ఆపేశారు. విజయవాడ- గుడివాడ మెయిన్ రోడ్ ప్రమాదకరంగా మారింది.. అనేక ప్రమాదాలు జరిగాయి. కనీసం పదిహేను మంది చనిపోయారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి వీధి లైట్లు కూడా సక్రమంగా వెలగడం లేదు.
రైతుల్లో ప్రభుత్వంపై అసంతృప్తి ఎక్కువగా ఉంది. గుడివాడ నియోజకవర్గం పూర్తిగా వ్యవసాయ అధారిత ప్రాంతం. ఎక్కువ మంది రైతులు వరి పండిస్తారు. వీరిలో ఎక్కువ మంది ప్రభుత్వ ధాన్యం సేకరణ కేంద్రాలకే తమ పంట పండిస్తారు. ఇతర విషయాలతో పాటు సరైన సమయానికి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయలేకపోతున్నారు. వివిధ కారణాల వల్ల ప్రభుత్వంపై రైతులు అసంతృప్తిగా ఉన్నారు.
చంద్రబాబు అరెస్ట్ అమరావతి రాజధాని వంటి విషయాల్లో ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. ఇవన్నీ టీడీపీకి ఆశలు కలిగేలా చేస్తున్నాయి. ఎలక్షనీరింగ్ ఈ నియోజకవర్గంలో కీలకంగా మారుతుంది. ఎన్నికల్లో ప్రతీ సారి ఆధిక్యం చూపించడానికి కొడాలి నాని ఎలక్షనీరింగ్ ను నమ్ముకుంటారు. ఈ సారి టీడీపీ నాని వ్యూహాలను ధీటుగా ఎదుర్కొంటే టార్గెట్ రీచ్ అయ్యే అవకాశం ఉంది. లేకపోతే మళ్లీ నానిదే పైచేయి అవుతుంది…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…