ప్రొద్దటూరు నియోజక వర్గం టికెట్ కోసం టిడిపి నేతల మధ్య నాలుగు స్తంభాలాట నడుస్తోంది. ఒకే టికెట్ కోసం నలుగురు పోటీలు పడుతున్నారు. ఎవరికి వారే టికెట్ తమదంటూ ధీమాలు వ్యక్తం చేస్తున్నారు. తమని గెలిపించాలంటూ కలిసిన వారిని వేడుకుంటున్నారు కూడా. పార్టీకోసం కష్టపడి పనిచేసేవారికే ఇస్తారని కొందరు నమ్మకం పెట్టుకుంటే.. డబ్బు కట్టలు ఎక్కువగా ఇచ్చిన వారికే బాబు టికెట్ ఇస్తారని మరి కొందరు ధీమాగా ఉన్నారు. కరెన్సీ కట్ట ఇచ్చుకుని కొడితే టికెట్ తనంతట తానే కదలి వస్తుందని పోటీలో ఉన్న నలుగురిలో సంపన్నుడిగా పేరొందిన సిఎం సురేష్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ప్రొద్దటూరు లో టిడిపి టికెట్ రేసులో నలుగురు నేతలు ఉన్నారు. మాజీ ఎమ్మెల్యేలు వరదరాజులు రెడ్డి, లింగారెడ్డి టికెట్ తమదే అని ఘంటాపథంగా చెబుతున్నారు. నాలుగేళ్లుగా నియోజక వర్గ ఇన్ ఛార్జ్ గా ఉన్న ప్రవీణ్ కుమార్ రెడ్డి అయితే ప్రొద్దటూరు టికెట్ కోసం ఎవరూ- పోటీ పడాల్సిన అవసరమే లేదని..ఆ టికెట్ తనకు ఇస్తానని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చేశారని ధీమాగా అంటున్నారు. నాలుగేళ్లుగా పార్టీ బలోపేతానికి చాలా కష్టపడ్డానని జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చిందని ప్రవీణ్ కుమార్ రెడ్డి అంటున్నారు.
ఈ ముగ్గురూ చాలరన్నట్లు మాజీ టిడిపి నేత ప్రస్తుత బిజెపి ఎంపీ సి.ఎం. రమేష్ తన సోదరుడు సిఎం సురేష్ కు ప్రొద్దటూరు టికెట్ ఇప్పించుకోడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. టికెట్ కోసం నలుగురి మధ్య తీవ్ర పోటీ ఉండడంతో టికెట్ ఎవరికి ఇస్తారోనని కార్యకర్తలు అయోమయంలో ఉన్నారు. సీనియర్ నేత అయిన వరదరాజులు రెడ్డి కొద్ది వారాల క్రితం బాగా యాక్టివ్ అయ్యారు. నియోజక వర్గం అంతా కలియతిరిగేస్తూ వచ్చే ఎన్నికల్లో తననే గెలిపించాలని..టికెట్ తనకే వస్తోందని చెప్పుకుంటూ తిరుగుతున్నారు.
టిడిపిలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడికి అత్యంత నమ్మకస్తుడిగా మెలిగిన సిఎం రమేష్ ఈ మధ్యనే తన సోదరుడు సిఎం సురేష్ ను తీసుకెళ్లి హైదరాబాద్ లో చంద్రబాబుతో భేటీ అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ భేటీలోనే సురేష్ కు టికెట్ ఇవ్వడానికి చంద్రబాబు సుముఖత వ్యక్తం చేశారని సిఎం సురేష్ వర్గీయులు చెప్పుకుంటున్నారు.గెలుపు గుర్రాలకే టికెట్ ఇస్తామని.. అందుకోసం సర్వేలు చేయిస్తున్నామని చంద్రబాబు నాయుడు చెబుతున్నప్పటికీ.. ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వారికే చంద్రబాబు టికెట్ ఇస్తారని పార్టీ వర్గాలే అంటున్నాయి.
ఈ లెక్క కరెక్ట్ అయితే ఈ నలుగురిలో ఎక్కువ డబ్బు విసరగల సత్తా ఒక్క సిఎం రమేష్ కే ఉందని నియోజక వర్గ పార్టీ నేతలే అంటున్నారు. సిఎం రమేష్ ను మించి ఎక్కువ డబ్బులు ఇచ్చే సత్తా మిగతా ముగ్గురికీ లేదని వారంటున్నారు.చిత్రం ఏంటంటే టికెట్ ఎవరికి వచ్చినా వచ్చే ఎన్నికల్లోనూ ఇక్కడ టిడిపికి గెలిచే అవకాశాలు లేనే లేవంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇక చంద్రబాబు ఎవరికి టికెట్ ఇస్తారన్నది చూడాలంటున్నారు విశ్లేషకులు.
నలుగురి మధ్య పోటీ ఇలా ఉంటే .. ఒక వేళ ఈ నియోజక వర్గం కోసం జనసేన పట్టుబడితే అప్పుడు పరిస్థితి మరింత రసవత్తరంగా ఉంటుందంటున్నారు రాజకీయ పరిశీలకులు. జనసేనకు ఈ సీటు కేటాయిస్తే అపుడు ఈ నలుగురు నేతలు ఏం చేస్తారన్నది కోటి డాలర్ల ప్రశ్న అంటున్నారు వారు.ఎందుకంటే టిడిపి జనసేన ల మధ్య పొత్తులో భాగంగా రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లోనూ జనసేనకు ప్రాతినిథ్యం కల్పిస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చినట్లు సమాచారం. ఆ లెక్కన చిత్తూరు జిల్లాలో తిరుపతి, పీలేరుపై జనసేన అశలు పెట్టుకున్నట్లు చెబుతున్నారు…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…