షర్మిల ఇన్ – జగన్ ఔట్ !

By KTV Telugu On 22 December, 2023
image

KTV TELUGU :-

వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల మరోసారి రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతున్నారు. అయితే ఈ సారి తెలంగాణలో కాదు. ఏపీలో. తెలంగాణలో రాజకీయాలు నడవవని ఆమెకు అర్థమయిందని అందుకే.. ఇప్పుడు ఏపీ రాజకీయాలపై దృష్టి పెట్టారని అంటున్నారు. ఏపీలో కాంగ్రెస్ బాధ్యతల్ని తీసుకునేందుకు సిద్ధమయ్యారని.. కుమారుడి పెళ్లి పనులు పూర్తి కాగానే ఏపీ కాంగ్రెస్ చీఫ్ అవుతారని అంటున్నారు. అదే జరిగితే వైసీపీ అధినేతకు గడ్డు పరిస్థితి ఎదురవడం ఖాయమన్న వాదన వినిపిస్తోంది. మరి ఈ ప్రమాదాన్ని జగన్ ఎలా నిలువరించుకుంటారు ?

వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ  అధ్యక్షురాలు కాంగ్రెస్‌లో చేరడం లాంఛనమేనని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి.  తెలంగాణలో రాజన్న రాజ్య స్థాపనే తన లక్ష్యమని ప్రకటించి పార్టీ పెట్టిన షర్మిల.. తదుపరి రాజకీయ పరిణామాలతో పోటీ చేయడం దండగనుకున్నారు.   బీఆరెస్‌ను ఓడించడం అనే తొలి లక్ష్యంతో ఎన్నికల్లో పోటీ చేయకుండా కాంగ్రెస్‌కు బేషరతు మద్దతు ప్రకటించారు. నిజానికి అంతకు ముందే కాంగ్రెస్‌లో విలీనం కోసం ప్రయత్నించారు. కానీ  తెలంగాణ నేతలు వ్యతిరేకించడంతో ఆగిపోయింది.  కానీ ఏపీలో రాజకీయాలు చేయడానికి విలీనం చేసుకుంటే సాయం చేస్తామని కూడా చెప్పారు. ఇప్పుడు తెలంగాణలో దారులు మూసుకుపోవడంతో  ఏపీలోనే రాజకీయం చేయడం మంచిదన్న  నిర్ణయానికి షర్మిల వచ్చారంటున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్‌ పార్టీ తరఫున ప్రచార   బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది.  ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్రలో కాంగ్రెస్‌ పార్టీ బలంగా ఉండేది. ఆ పార్టీకి ఇప్పటికీ సంస్థాగతంగా ఓటు బ్యాంకు ఉన్నది. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుటుంబంపై అక్కడి ప్రజలకు ప్రత్యేక అనుబంధం ఉన్నది. విభజన వల్ల ఏపీలో కాంగ్రెస్‌ తుడిచిపెట్టుకుపోయిందని అనుకుంటారు. కానీ వైఎస్ జగన్ పార్టీ పెట్టడం వల్లనే కాంగ్రెస్‌కు నష్టం జరిగింది. తిరిగి పార్టీకి పునరుజ్జీవం పోయడానికి షర్మిల సేవలను పార్టీ అధిష్ఠానం వినియోగించుకుంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీలో చేరిన తర్వాత షర్మిల విశాఖపట్నం, విజయవాడలలో ప్రియాంకగాంధీ, రాహుల్‌గాంధీలతో బహిరంగ సభలు ఏర్పాటు చేయించాలని అనుకుంటున్నారు.  దీని వెనుక రెండు వ్యూహాలున్నాయి. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేట్‌ పరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం యత్నిస్తున్నది. విభజన చట్టంలో యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పదేళ్లుగా అమలుచేయకపోగా ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్‌పరం చేస్తున్నది. ఈ అంశాలను ప్రజల్లో ఎండగట్టడం ద్వారా  బలపడాలని కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నట్టు  తెలుస్తోంది.

షర్మిల తల్లి విజయమ్మను కాంగ్రెస్‌ పార్టీ విశాఖ నుంచి పోటీకి నిలిపే అవకాశాలు ఉన్నాయన్న చర్చలు నడుస్తున్నాయి. విజయవాడలోని అమరావతిలో మరో బహిరంగ సభ ఏర్పాటు చేయడం వెనుక ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి కావాలని అక్కడి ప్రజలు ఆకాంక్షను మరోసారి తెరపైకి తేవడమే లక్ష్యమని చెబుతున్నారు. గత పదేళ్లుగా రాష్ట్రాన్ని టీడీపీ, వైసీపీలు ఏలినా ఏపీ ప్రజలకు రాజధాని ఏది అంటే చెప్పలేని పరిస్థితి నెలకొన్నది. ఏపీ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే బాధ్యత తమదేనని ప్రజలకు కాంగ్రెస్‌ భరోసా ఇవ్వనున్నదని సమాచారం. అలాగే రాయలసీమలోనూ ఒక బహిరంగసభ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ అనుకుంటోంది. అయితే  షర్మిల షర్మిల సుముఖత వ్యక్తం చేయలేదని  అంటున్నారు.

విలీన ప్రక్రియ పూర్తయిన తర్వాత షర్మిల ఏపీ అసెంబ్లీ పోటీ చేస్తారా? లేదా అన్నదానిపై కూడా దాదాపు స్పష్టత వచ్చే అవకాశం ఉంది.  షర్మిలకు రాజకీయ బలం కావాలంటే ఏదో ఓ పదవి ఉండాలి కాబట్టి.. కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపాలనుకున్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమి గెలుస్తుందా? వైసీపీ అధికారాన్ని తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటుందా? అనే చర్చ జరుగుతున్న సమయంలోనే షర్మిల పార్టీ విలీనం మరోసారి తెరమీది రావడం ఏపీ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి.

అయితే షర్మిల ఏపీ రాజకీయాల్లోకి వస్తే తనకు నష్టం జరుగుతుందని సీఎం జగన్ గుర్తించారని అంటున్నారు. అందుకే ఆయన తమ కుటుంబానికి సన్నిహితుడు అయిన డీకే శివకుమార్ ద్వారా రాజీ ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు. ఆయన కూడా ఇద్దరితో మాట్లాడారని.. షర్మిల ప్రధాన డిమాండ్ అయిన ఆస్తుల పంపకానికి జగన్ అంగీకరించారని చెబుతున్నారు.  ఈ చర్చలు సఫలమైతే షర్మిల పార్టీ కాంగ్రెస్ లో విలీనం ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి