టిడిపి-జనసేన టాప్ గేర్

By KTV Telugu On 22 December, 2023
image

KTV TELUGU :-

ఆంధ్ర ప్రదేశ్ లో రాబోయేది టిడిపి-జనసేన ప్రభుత్వమే అని ఆ రెండు పార్టీల నేతలు ధీమా వ్యక్తం చేశారు. త్వరలోనే రెండు పార్టీల ఉమ్మడి మేనిఫెస్టోను  అమరావతిలోకానీ, తిరుపతిలో కానీ విడుదల చేస్తామని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు  ప్రకటించారు. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అధినేత పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలను మారుస్తున్నట్లు తెలుస్తోందన్న జనసేనాని పవన్ కళ్యాన్‌ మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదు జగన్ మోహన్ రెడ్డినే అన్నారు. నారా లోకేష్  చేపట్టిన యువగళం  పాదయాత్ర విజయోత్సవాన్ని పురస్కరించుకుని  ఉత్తరాంధ్రలో ఏర్పాటు చేసిన యువగళం-నవశకం^బహిరంగ సభలో టిడిపి-జనసేన పార్టీల అగ్రనేతలు పాల్గొన్నారు.

ఎన్నికలకు  మూడు నెలల సమయం మాత్రమే ఉన్న తరుణంలో  ఆంధ్ర ప్రదేశ్ లో ప్రధాన ప్రతిపక్షాలు అయిన తెలుగుదేశం^జనసేన పార్టీలు  గేర్ మార్చాయి. పాలక వై.ఎస్.ఆర్.కాంగ్రెస్  పార్టీని వచ్చే ఎన్నికల్లో ఇంటికి పంపడమే లక్ష్యంగా  రెండు పార్టీలూ సంకల్పాన్ని రూపొందించుకున్నాయి. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదన్న లక్ష్యంతోనే  జనసేన అధినేత పవన్ కళ్యాణ్  టిడిపితో పొత్తు పెట్టుకున్నట్లు  పదే పదే  క్లారిటీ ఇస్తూ వచ్చారు.

నారాలోకేష్ ఈ ఏడాది జనవరిలో మొదలు పెట్టిన  యువగళం పాదయాత్ర    గాజువాకలో ముగిసిన సంగతి తెలిసిందే.  సుదీర్ఘంగా సాగిన యువగళం పాదయాత్ర ఘనవిజయం  సాధించిన  సందర్బాన్ని పురస్కరించుకుని ఉత్తరాంధ్రలోనే  భారీ బహిరంగ సభ నిర్వహించారు.

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ, టిడిపి అధ్యక్షుడు అచ్చెంనాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, జనసేన పిఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తదితరులు  ఈ సభలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రసంగించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్   వచ్చే ఎన్నికల తర్వాత ఏపీలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉండదని స్పష్టం చేశారు. రాబోయేది కచ్చితంగా టిడిపి జనసేన ప్రభుత్వమే అన్న పవన్ కళ్యాణ్ లోకేష్ పాదయాత్రను మెచ్చుకున్నారు. ఇది జగన్ మోహన్ రెడ్డి చేసిన యాత్ర లాంటిది కాదని వ్యాఖ్యానించారు. ఏపీ అభివృద్ధికోసమే టిడిపితో కలిసానన్న పవన్ కళ్యాణ్  ప్రజాస్వామ్యంపై జగన్ మోహన్ రెడ్డికి గౌరవం లేదన్నారు.  ఇంట్లో మహిళలను గౌరవించడం చేతకాని జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఇతర మహిళలను ఏం గౌరవిస్తారని? పవన్ నిలదీశారు.

యువగళం యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసిన నారా లోకేష్ మాట్లాడుతూ  జగన్ మోహన్ రెడ్డి అనుసరించేది రాజారెడ్డి రాజ్యాంగం అయితే తాను అంబేడ్కర్ రాజ్యాంగం స్ఫూర్తితో రాజకీయాలు చేసే వాడినని అన్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లను చూస్తేనే జగన్ మోహన్ రెడ్డికి భయమని లోకేష్   వ్యాఖ్యానించారు. తన తండ్రి చంద్రబాబును అన్యాయంగా జైలుకు పంపిన జగన్ మోహన్ రెడ్డికి  గుణపాఠం చెప్పి తీరతామన్నారు లోకేష్. ముఖ్యమంత్రి అయిన మరుక్షణం నుంచే జగన్ మోహన్ రెడ్డి విధ్వంసాలకు తెగబడ్డారని.. తన తండ్రి చంద్రబాబు  అధికారంలో ఉన్నప్పుడు అనుక్షణం అభివృద్ధిపై దృష్టి సారించేవారని అన్నారు లోకేష్.

టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు    పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేలా ప్రసంగించారు. జగన్ మోహన్ రెడ్డి హయాంలో ఆంధ్ర ప్రదేశ్ 30 సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయిందన్నారు చంద్రబాబు. ఎవరికైనా రాజకీయ పార్టీ పెట్టే  హక్కు .. ఎన్నికల్లో పోటీ చేసే అధికారం ఉంటాయి కానీ.. రాష్ట్రాన్ని నాశనం చేసే హక్కు మాత్రం ఎవరికీ ఉండవని ఆయన సెటైర్ వేశారు. గత ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా  నెరవేర్చలేదని చంద్రబాబు ఆరోపించారు. ప్రత్యేక హోదా, విశాఖ రైల్వేజోన్, మెట్రో రైల్ , పోలవరం ప్రాజెక్టులను    సాధించలేకపోయిన  జగన్ మోహన్ రెడ్డి  రాజధాని అమరావతిని సర్వనాశనం చేశారని చంద్రబాబు మండి పడ్డారు. వచ్చే ఎన్నికల్లో పొరపాటున జగన్ మోహన్ రెడ్డి పార్టీకి ఓటు వేస్తే రాష్ట్రం మరింతగా వెనకబడిపోయే  ప్రమాదం ఉందని చంద్రబాబు హెచ్చరించారు.

త్వరలోనే తిరుపతి, అమరావతిలలో రెండు భారీ బహిరంగ సభలు నిర్వహించాలని టిడిపి-జనసేన కూటమి నిర్ణయించింది. ఈ రెండు సభల్లో ఒక చోట రెండు పార్టీల ఉమ్మడి మేనిఫెస్టోని విడుదల చేస్తామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత  ప్రయాణ సదుపాయం కల్పించడంతో పాటు  నిరుద్యోగ యువతకు నెల నెలా మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చంద్రబాబు  హామీ ఇచ్చారు. జగన్ మోహన్ రెడ్డి పాలనలో రైతులు పూర్తిగా దివాళా తీశారన్నారు. మొత్తం మీద కొంత కాలంగా స్తబ్ధుగా ఉన్న టిడిపి జనసేన పార్టీలు ఈ సభతో జోష్ తెచ్చుకున్నాయి. రెండు పార్టీల  శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలు వేయడం ఖాయమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి