ఏపీలో ఎన్నికల రాజకీయం హోరా హోరీగా మారుతోంది. సీఎం జగన్ అభ్యర్దుల ఎంపికలో వడపోత ప్రారంభించారు. ఇటు టీడీపీ, జనసేన నిన్న జరిగిన యువగళం ముగింపు సభ ద్వారా ఎన్నికల సమర శంఖం పూరించి సిద్దమయ్యారు. ఈ సమయంలోనే ఏపీలో షెడ్యూల్ కంటే ముందుగానే ఎన్నికలు జరగటం ఖాయంగా కనిపిస్తోంది. ఏపీలో ఎన్నికల నిర్వహణ పైన ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. తేదీల పైన చర్చ మొదలైంది.
ఏపీలో ఎన్నికలు ఈ సారి ఎప్పడూ లేనంత ఉత్కంఠ కలిగిస్తున్నాయి. సీఎం జగన్ సంక్షేమం – సామాజిక న్యాయం తనకు అధికారం నిలబెడతాయనే నమ్మకంతో ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత, పొత్తులు తమకు కలిసి వస్తాయని చంద్రబాబు, పవన్ నమ్మకం పెట్టుకున్నారు. ఎన్నికల వేళ సీఎం జగన్ సిట్టింగ్ లను మారుస్తున్నారు. సామాజిక లెక్కలకు ప్రాధాన్యత ఇస్తూ బీసీ, ఎస్సీ వర్గాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇదే సమయంలో టీడీపీ, జనసేన వచ్చే నెలలో అభ్యర్దులను ఖరారు చేయనుంది. ఇక..ఏపీలో నిర్ణీత షెడ్యూల్ కంటే 20 రోజులు ముందుగానే ఎన్నికల షెడ్యూల్ విడుదల అవుతుందని తెలుస్తోంది. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలోనూ సీఎం జగన్ ఇవే సంకేతాలు ఇచ్చారు
ఇప్పుడు ఢిల్లీ అధికార వర్గాల సమాచారం మేరకు ఏపీలో ఫిబ్రవరి 15-20 మధ్య ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఏపీలో బోగస్ ఓట్ల పైన వైసీపీ, టీడీపీ పోటా పోటీగా ఇస్తున్న ఫిర్యాదుల పైన ఎన్నికల సంఘం ఆరా తీస్తోంది. రాష్ట్ర స్థాయిలోనూ ఎన్నికల దిశగా కసరత్తు ప్రారంభమైంది. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు, పోలింగ్ కేంద్రాల వివరాలను ఎన్నికల అధికారులు సేకరిస్తున్నారు. ఓటర్లకు నమోదు చేసుకొనేందుకు అవకాశం కల్పిస్తున్నారు. 2019 ఎన్నికల సమయంలో మార్చి 3న ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. కానీ, ఇప్పుడు ఫిబ్రవరి 10-15 మధ్యన విడుదల అవుతుందని తెలుస్తోంది.
ఏపీతో పాటుగా నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల పైన కసరత్తు మొదలైంది. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ సైతం లోక్ సభ ఎన్నికలు ముందుగానే వస్తాయని పార్టీ నేతలను అలర్ట్ చేసారు. ఇక..ఏపీలో ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు కు వ్యక్తిగతంగా ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి. దీంతో..ప్రతీ నియోజకవర్గంలో గెలుపును సీరియస్ గా తీసుకుంటున్నారు. ఇక, దాదాపు 20 రోజులు ముందుగానే ఏపీలో ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ఛాన్స్ ఉందనే సమాచారంతో..జనవరి నెలాఖరు నాటికి అన్ని పథకాలు..ప్రభుత్వ కార్యక్రమాలను పూర్తి చేయటానికి ప్రభుత్వం కార్యాచరణ సిద్దం చేస్తోంది..
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…