ఆముదాలవలసలో తమ్మినేని టిక్కెట్ చిరిగినట్లేనా ?

By KTV Telugu On 25 December, 2023
image

KTV TELUGU :-

స్పీకర్ గా ఉన్న వ్యక్తి ఎన్నికల్లో గెలవలేరని ఓ సెంటిమెంట్  తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఉంది. కానీ ఆ సెంటిమెంట్ ను పోచారం శ్రీనివాసరెడ్డి బ్రేక్ చేశారు.  ఆయన గెలిచారు కానీ ఆయన పార్టీ ఓడిపోయింది. ఇప్పుడు అందరి చూపు.. ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం వైపు పడింది. ఆయన గెలుస్తారా.. ఆయన గెలిచి వైసీపీ ఓడిపోతుందా  ? లేకపోతే ఏపీలో స్పీకర్ గెలవరన్న సెంటిమెంట్ పని చేస్తుందా అన్న చర్చ ప్రారంభమయింది. ఆయన నియోజకవర్గం ఆముదాల వలసలో పరిస్థితి బాగోలేదని.. అసలు ఓడిపోవడానికి చాన్స్ లేకుండా  టిక్కెట్టే నిరాకరిస్తున్నారన్న ప్రచారమూ జరుగుతోంది. ఇందులో ఆముదాల వలసలో వైసీపీ పరిస్థితి ఎలా ఉంది ?

స్పీకర్‌గా బాధ్యతలు తీసుకున్న ఎవరూ గెలిచిన సందర్భాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ.. విభజన  ఆంధ్రప్రదేశ్‌లో కానీ లేవు.  అందుకే ప్రస్తుత స్పీకర్ తమ్మినేని సీతారాంకు టెన్షన్ ప్రారంభమయింది.  స్పీకర్ గా రాజీనామా చేసి మంత్రి పదవి తీసుకోవాలనుకున్న ఆయనకు జగన్ చాన్సివ్వలేదు.  వచ్చే ఎన్నికల్లో తన కుమారుడికి చాన్సివ్వాలన్న ఆలోచన మానుకుని.. మళ్లీ గెలిచి… ఎలాగైనా మంత్రి పదవి పొందాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. కానీ ఆయన ఆశలు ఈ సారి అంత సులువుగా నెరవేరేలా కనిపించడం లేదు. ప్రజల్లో అసంతృప్తి  బహిరంగంగా కనిపిస్తోంది. అంతేనా సొంత పార్టీలోనూ ఆయనకు వ్యతిరేకంగా బలమైన వర్గాలు పని చేస్తున్నాయి.

ఆమదాలవలసలో స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌కు పార్టీ ద్వితీయ శ్రేణి నాయకుల మధ్య దూరం పెరుగిపోయింది. తమ్మినేనికి వ్యతిరేకంగా  అముదాల వలస మండలంలో కీలకంగా ఉండే  కోట గోవిందరావు బ్రదర్స్‌ నిరసన గళం డోస్‌ పెంచారు. తమ్మినేని పాల్గొనే కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.  ఆముదాలవలస, పొందూరు, బూర్జ, సరుబుజ్జిలి మండలాల్లో కూడా ద్వితీయ శ్రేణి నేతలు తమ్మినేని వ్యవహారంపై గుర్రుగా ఉన్నారట. చింతాడ రవికుమార్‌, సువ్వారి గాంధీల వంటి నేతలు స్పీకర్‌తో మాట్లాడేందుకు కూడా ఇష్టపడటం లేదు.  సీతారాం తీరు తేడాగా ఉండటంతో చాలా వరకూ నేతలు దూరమయ్యారు. వీరంతా వేరే వర్గంగా ఏర్పడి తమ్మినేని సీతారాం టిక్కెట్ ఇవ్వవొద్దని సందర్భం వచ్చినప్పుడల్లా హైకమాండ్ దృష్టికితీసుకెళుతున్నారు.

ఓ వైపు తమ్మినేని సీతారాం మళ్లీ గెలిచి మంత్రి అవుదామనకుంటే.. ద్వితీయ శ్రేణి నేతలు అసలు ఆయనకు టిక్కెట్ ఇవ్వొద్దని హైకమాండ్‌కు చెబుతున్నారు. ఇవి బలంగా మారితే.. జగన్ యువతరానికి అవకాశం ఇవ్వాలని భావిస్తే..  తమ్మినేనికి సీటు కూడా కష్టమేననన్న వాదన వినిపిస్తోంది. నియోజకవర్గంలో పరిస్థితి బాగోలేదన్న నివేదికలు రావడంతో తమ్మినేని సీతారాంను శ్రీకాకుళం పార్లమెంట్ స్థానానికి బరిలో ఉంచుతామని.. ఆముదాల వలసకు కొత్త నేతను ఎంపిక చేస్తామన్న సంకేతాలు పంపుతున్నారు.  అందుకే తమ్మినేని ఇటీవలి కాలంలో విధేయత డోస్ పెంచారు. వైసీపీలో విధేయత చూపడం అంటే.. చంద్రబాబును.. టీడీపీని బండ బూతులు తిట్టడమే . గౌరవనీయమైన స్పీకర్ హోదాలో ఉన్నానని కూడా రిజర్వేషన్లు పెట్టుకోకుండా స్పీకర్ స్క్రిప్ట్ రాసుకొచ్చుకుని మరీ బూతులు తిడుతున్నారు.

తమ్మినేని సీతారం.. ఓ రాజ్యాంగబద్ద పదవిలో ఉన్నారు. స్పీకర్‌గా ఆయన పార్టీలకు .. కుల, మత , ప్రాంత రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సి ఉంటుంది. కానీ సీతారాం మాత్రం.. వాటన్నింటినీ.. మొదటి నుంచి పరిగణనలోకి తీసుకోవడం లేదు.  ఇవన్నీ ఆయన ఇమేజ్ ను తగ్గించాయి.  ఓ వైపు తమ్మినేని క్యాడర్‌లో వ్యతిరేకత.. మరో వైపు ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత బలంగా కనిపిస్తున్నాయి.

అదే సమయంలో తమ్మినేని సీతారాంకు టీడీపీ నుంచి బలమైన ప్రత్యర్థి ఉన్నారు.  స్వయంగా తన  బావమరిది అయిన కూన రవికుమార్ టీడీపీ తరపున గట్టిగా ప్రయత్నిస్తున్నారు. గతంలో ఆయన తమ్మినేనిపై ఓ సారి గెలిచారు.  స్పీకర్ గా అధికారం వచ్చిన తర్వత ఎమ్మెల్యే కూన రవికుమార్‌ను కేసులు పాలు చేసి వేధింపులకు గురి చేయడం కూడా ప్రజల్లో సీతారాంపై వ్యతిరేకత తెచ్చి పెట్టింది. కూన రవికుమార్‌కు సానుభూతి తెచ్చింది. కూన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పటికీ సీతారాంపై కానీ.. వైసీపీ నేతలపై కానీ ఎలాంటి వేధింపులకు పాల్పడలేదు.  ఇప్పటి వరకూ ఉన్న పరిస్థితి చూస్తే స్పీకర్‌ ఓడిపోవడం ఖాయమన్న సెంటిమెంట్ కొనసాగుతుందని బల్ల గుద్ది చెబుతున్నారు.

ప్రస్తుతం సీఎం జగన్ అభ్యర్థుల కసరత్తులో ఉన్నారు.  మార్పు జాబితాలో ఆముదాల వలస కూడా ఉంది.  తమ్మినేనిని ఒప్పించి లోక్ సభ సీటు ఇస్తే సరి.. లేదు తాను ఆముదాల వలసలో ఉంటానని పట్టుబడితే.. ఆయనకే టిక్కెట్ కేటాయించాల్సి ఉంటుంది. . టిక్కెట్ నిరాకరించే అవకాశం ఉండదని అంచనా వేస్తున్నారు…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి