ఎన్నికల వేళ మాజీ జేడీ పేరాశ

By KTV Telugu On 25 December, 2023
image

KTV TELUGU :-

వీవీ  లక్ష్మీ నారాయణ కూడా పార్టీ పెట్టేశారు. అటు తిరిగి ఇటు తిరిగి ఆయన సొంత కుంపటికే ఇష్టపడ్డారు. ఎన్నికల  వేళ ఏదో బావుకుందామనుకుంటున్నారు. జై భారత్ నేషనల్ పార్టీ వల్ల ఏమైనా ప్రయోజనం  ఉంటుందా అన్నదే ఇప్పుడు  పెద్ద ప్రశ్న. పైగా ఆచరణ సాధ్యం కానీ హామీలతో ఆయన జనాన్ని ఎలా ఆకట్టుకుంటారన్నది  కూడా మరో ప్రశ్న…

మరికొన్ని రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరగనుండగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సరికొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. జై భారత్ నేషనల్ పార్టీ పేరుతో తన పార్టీ పేరును శుక్రవారం రాత్రి ప్రకటించారు. ఇది సాధారణంగా పెట్టిన పార్టీ కాదు… ప్రజల్లోంచి పుట్టిన పార్టీ అన్నారు. జై భారత్ నేషనల్ పార్టీ జెండాను మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ ఆవిష్కరించారు. పార్టీ జెండాలో కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులు ఉన్నాయి. లక్ష్మీ నారాయణ పిడికిలి బిగించినట్లుగా ఉన్న ఫొటో సైతం జై భారత్ నేషనల్ పార్టీ జెండాలో ముద్రించి ఉంది. 2017లో  ఐపీఎస్ కు రాజీనామా చేసిన ఆయన పాలిటిక్స్ లోకి వచ్చారు. 2019లో జనసేన పార్టీ నుంచి వైజాగ్ ఎంపీగా లక్ష్మీనారాయణ పోటీచేసి ఓడిపోయిన తర్వాత అక్కడే కొంత కాలం పని చేసుకున్నారు. కానీ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాలు చేస్తున్నారన్న కారణంగా జనసేనకు రాజీనామా చేశారు. కొంతకాలం రైతు, ప్రజా సమస్యలు, యువత ఓటింగ్ పై అవగాహన కల్పించారు. వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచే పోటీ చేస్తానని చెప్పిన లక్ష్మీనారాయణ.. తాజాగా జై భారత్ నేషనల్ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

లక్ష్మీ నారాయణ  ఉద్దేశాలు ఏమిటి. ఆయన  అనుకున్నది అంత సులభమా. రాజ్యాధికారం సాధించడం వెన్నతో పెట్టిన విద్యా. ఆయన ఇచ్చిన హామీల్లో ఒకటైనా నెరవేర్చుతారని జనానికి నమ్మకం కలుగుతుందా. నిజాయతీ గల ఆఫీసర్ అయినంత మాత్రాన ప్రజాదరణ పొందడం అంత సునాయాసమవుతుందా…

ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావడం ఎవరి వల్లా కాలేదని తాము అధికారంలోకి వచ్చిన వెంటనే సాధించి తీరుతామని మాజీ జేడీ చెప్పుకున్నారు. అది అంత సులభం కాదని ఆయనకు తెలియనిది కాదు. ఇప్పుడు ఎవరికీ ప్రత్యేక హోదాలు ఇవ్వడం లేదని  అందరికీ తెలిసిందే. కేంద్రంలో బీజేపీ ఉన్నంత కాలం ప్రత్యేక హోదా రాదు. లక్ష్మీ నారాయణ హామీ నెరవేరాలంటే కేంద్రంలో అధికారం మారాలి.  అది అంత సులభమా అంటే ఎవ్వరూ చెప్పలేరు. ఏపీ ప్రజలు ఎవరికీ బానిసలు కాదని, మన హక్కుల్ని కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు ప్రజల్లోంచి పుట్టుకొచ్చింది తమ పార్టీ అని చెప్పుకున్నారు.అయితే ఆ సరికొత్త చరిత్ర ఏమిటో లక్ష్మీ నారాయణ నిర్వచించలేకపోయారు. అవినీతిని అంతమొందిస్తామని ఎవరూ రూపాయి తినకుండా చూస్తామని మాజీ జేడీ చెప్పడం కూడా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే దేశంలో అవినీతి వేళ్లూనుకుంది దాన్ని తొలగించడానికి చాలా రోజులు పడుతుంది. కొన్ని కుటుంబాలకే రాజకీయం పరిమితం కాదని ఆ పద్ధతి పోవాలని కూడా జేడీ చెప్పుకొచ్చారు. ఇప్పట్లో కుటుంబ పాలన పోవడం కూడా అంత సులభం కాదు. తాను గెలిస్తే ఫ్యామిలీ మెంబర్స్ రారని మాత్రం ఆయన ఖచితంగా చెప్పొచ్చు. అప్పులు, తప్పులు చేయబోనని చెప్పడం ప్రాస కోసం పదాలు వాడినట్లే అవుతుంది. పైగా మాజీ జేడీ పార్టీ పెట్టిన తర్వాత రెండు మూడు నెలలకే ఎన్నికలు రాబోతున్నాయి. ఆయన విస్తృతంగా జనంలోకి వెళ్లే అవకాశం చాలా తక్కువ. తమ నినాదాలు ప్రచారం చేసుకునే టైమ్  కూడా ఉంది. కాకపోతే లక్ష్మీ నారాయణకు మొదటి నుంచి ఆరెస్సెస్ భావజాలం ఉందని ఓ ప్రచారం జరిగింది అందుకే ఓట్లు చీల్చేందుకు ఎవరైనా ఆయనతో పార్టీ పెట్టించారన్న  అనుమానాలు కలుగుతున్నాయి…

ఇప్పటికే ఏపీలో రెండు పెద్ద పార్టీలున్నాయి. చిన్న పార్టీలు పుట్టుకొస్తున్నాయి. ప్రజా శాంతి అంటూ  కేఏ పాల్ చాలారోజులుగా తిరుగుతున్నారు. మాజీ న్యాయాధికారి జడ శ్రవణ్ కూడా పార్టీపెట్టారు. ఇప్పుడాయన పనిగట్టుకుని చంద్రబాబును తిడుతున్నారు. వాళ్లిద్దరూ ఎంత ప్రభావం చూపుతారో తెలీదు. లక్ష్మీ నారాయణ కూడా వారి బాటలోనే నడుస్తారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి….

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి