ఐ ప్యాక్ ఫౌండర్ ప్రశాంత్ కిషోర్ అనూహ్యంగా అమరావతికి వచ్చి టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ కావడం ఓ సంచలనంగా మారింది. దీనికి కారణం ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుతో ఎప్పుడూ అసోసియేట్ కాలేదు. 2014 ఎన్నికల తర్వాత టీడీపీకి పని చేసేందుకు పీకే ఆసక్తి చూపినా.. .చంద్రబాబు అంగీకరించలేదని చెబుతారు. ఆ తర్వాత ప్రశాంత్ కిషోర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఒప్పందం చేసుకున్నారు. ఆ తర్వాత పీకే విషయంలో చంద్రబాబు చాలా విమర్శలు చేశారు. ఆ తర్వాత ప్రశాంత్ కిషోర్, జగన్ మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. ఇప్పటికీ ఐ ప్యాక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ కు పని చేస్తోంది. మరి పీకే చంద్రబాబుతో ఎందుకు భేటీ అయ్యారు ? టీడీపీకి పని చేసేందుకు ఎందుకు ఆసక్తి కనబర్చారు ?
ప్రశాంత్ కిషోర్, తెలుగుదేశం పార్టీ మధ్య చర్చలు జరుగుతున్నాయని జాతీయ మీడియాలో కొంత కాలంగా చర్చలు జరుగుతున్నాయి. నిప్పు లేనిదే పొగ రాదన్నట్లుగా బయటకు తెలియని సమావేశాలు కొన్ని ప్రశాంత్ కిషోర్ , టీడీపీ బృందం మధ్య జరిగాయని చెబుతున్నారు. కొంత కాలంగా అంతర్గతంగా పీకే టీములు ఏపీలో పరిస్థితుల్ని అంచనా వేసి.. నివేదికలు సమర్పించాయని వాటి పైనే ఇప్పుడు చంద్రబాబుకు ప్రజెంటేషన్ ఇచ్చారని కూడా అంటున్నారు. అయితే వైసీపీ కోసం పనిచేస్తూ.. టీడీపీ కోసం ఎందుకు పీకే ఆరాటపడుతున్నారన్నది ఇక్కడ చాలా మందికి అర్థం కాని విషయం. కానీ ఇప్పుడు వైసీపీకి పని చేస్తోంది ఐ ప్యాక్ కానీ.. ప్రశాంత్ కిషోర్ కాదు. ఐ ప్యాక్ తో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్‌కు సంబంధం లేదు.
ప్రశాంత్ కిషోర్ ఓ ప్రొఫెషనల్ స్ట్రాటజిస్ట్. ఆయనకు రాజకీయంగా ఏమైనా అభిప్రాయాలుంటే.. అది బీహార్ వరకే పరిమితం. ఇంకా చెప్పాలంటే ఆయన తన రాజకీయాల్ని.. వృత్తిని కలుపుకుంటారని ఎవరూ అనుకోరు. వృత్తికి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తారు. అంటే చేసే పనిని తన వ్యక్తిగత ఆసక్తులతో సంబంధం లేకుండా వంద శాతం నిర్వహిస్తారు. లాయర్లు, డాక్టర్లు, జర్నలిస్టులు ఇలా అందరూ పనిని పనిగా చేసుకుంటారు. అలా చేయగలిగినప్పుడే విజయవంతం అవుతారు. పీకే అలా పొలిటికల్ స్ట్రాటజిస్టుగా తన వృత్తికి న్యాయం చేస్తారు. ఈ క్రమంలో టీడీపీనా వైసీపీనా అన్నది కాదు..తన క్లయింట్ కు న్యాయం చేయాలనుకుంటారు. ఇప్పుడు అదే జరుగుతోంది. తనకు జగన్ పై ప్రత్యేక అభిమానం ఉండదు.. టీడీపీపైన ఉండదు. ఆయన వృత్తి కోసం టీడీపీకి పని చేస్తున్నారంతే.
ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ ఐ ప్యాక్ అనే సంస్థను ప్రశాంత్ కిషోర్ తన మిత్రులతో కలిసి ప్రారంభించారు. ఆ సంస్థ మంచి సక్సెస్ అయింది. అది ప్రశాంత్ కిషోర్ ఒక్కడితే కాదు. కానీ ఆ సంస్థ మాస్టర్ మైండ్ మాత్రమే పీకేనే. క్లయింట్లకు వరుసగా విజయాలు అందించిన తర్వాత ఆయన సొంత రాజకీయాల్లోకి వెళ్లిపోయారు. ఇప్పుడు ఐ ప్యాక్ అదికారిక వెబ్ సైట్ ప్రకారం చూస్తే.. ప్రశాంత్ కిషోర్ రిఫరెన్స్ ఎక్కడా ఉండదుత రిషిరాజ్ సింగ్ అనే వ్యక్తి చేతుల్లో సంస్థ నడుస్తోంది. ఇప్పుడు ఈయన ఆఫీసు తాడేపల్లిలోనే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఎక్కువగా సీఎం క్యాంప్ ఆఫీసులోనే ఉంటారు. ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుతో భేటీ అయిన కాసేపటికి ఐ ప్యాక్ గురించి విస్తృత ప్రచారం జరుగుతూండటంతో ఆ సంస్థ క్లారిటీ ఇచ్చింది. తాము వైసీపీకే పని చేస్తున్నామని .. స్పష్టం చేసింది. అయితే ఈ ట్వీట్ లో పీకే తమ సంస్థకు సంబంధం లేదని చెప్పలేదు. ఇక్కడే అసలు ట్విస్ట్ కనిపిస్తోంది.
అయితే ఏపీ రాజకీయాల్లో పీకేకు ఇంత ప్రాధాన్యత రావడానికి కారణం జగన్మోహన్ రెడ్డినే. ప్రశాంత్ కిషోర్‌ను జగన్ రెడ్డి విన్నింగ్ మాడ్యూల్ గా చూశారు. జగన్ మోహన్ రెడ్డికి కావాల్సిన అవుట్ పుట్ ఇచ్చి పీకే గెలిపించారు. ఈ విషయాన్ని జగన్ మోహన్ రెడ్డి స్వయంగా ఒప్పుకున్నారు. ఇప్పుడు అదే పీకేని జగన్ రెడ్డి తనతో కంటిన్యూ అయ్యేలా చేసుకోలేకపోయారు. ఇప్పుడు రాజకీయాల్లో ప్రధాన స్ట్రాటజిస్టులుగా ఉన్న సునల్ కనుగోలు , రిషిరాజ్ ,రాబిన్ శర్మ సహా..పెద్దగా లైమ్ లైట్ లోకి రాకుండా ఇతర పార్టీలకు పని చేస్తున్న స్ట్రాటజిస్టులు ఎక్కువ మంది ఐ ప్యాక్ నుంచి వచ్చిన వారే. సునీల్ కనుగోలు ఇప్పుడు కాంగ్రెస్ తరపున పని చేస్తున్న వ్యూహకర్త. కర్ణాటక, తెలంగాణల్లో గెలుపు వెనుక ఆయన పాత్రను ఎవరూ కాదనలేరు. ఆయన కూడా ఐ ప్యాక్ నుంచి వచ్చి సొంత సంస్థను పెట్టుకున్నారు. ఇప్పుడు టీడీపీ స్ట్రాటజీల్ని చూస్తున్న రాబిన్ శర్మ కూడా.. పీకే శిష్యుడే. ఇక పీకేని నడిపిస్తున్న రిషిరాజ్ గురించి చెప్పాల్సిన పని లేదు. వీరంతా ప్రొఫెషనల్ గా పని చేస్తారని.. ఏ పార్టీతో ఒప్పందం చేసుకుంటే.. ఆ పార్టీ విజయం కోసం ప్రయత్నిస్తారని చెబుతారు.
నన్ను ప్రశాంత్ కిషోరే గెలిపించాడు అని జగన్ మోహన్ రెడ్డి ఎన్నికలు అయిపోగానే మీడియా ముందు పీకేని చూపించి ప్రకటించుకున్నారు. అంతకు ముందు ప్లీనరీలో పీకేని చూపించి మనల్ని గెలిపించబోతున్నాడని పరిచయం చేశాడు. ఇప్పుడు ఆ పీకే.చంద్రబాబుతో కలిసి పనిచేస్తున్నారు. పీకే వ్యూహాలపై వైసీపీ క్యాడర్ లో చాలా నమ్మకం ఉంది. ఇప్పుడు పీకే తమకు కాదు.. టీడీపీకి పని చేస్తున్నారన్న భావన వస్తే వైసీపీకి ఇబ్బందికరమే. గత ఎన్నకిలతో పోలిస్తే జగన్ ఇప్పుడు మరింత ఒంటరి అయ్యారని అనుకోవచ్చు. గత ఎన్నికలకు ముందు తల్లి విజయలక్ష్మి, చెల్లితో షర్మిలతో పాటు పాటు జగన్ మోహన్ రెడ్డి కోసం పని చేసిన ఎంతో మంది దూరమయ్యారు. చివరికి పీకే కూడా దూరమయ్యారు. దూరం అవడమే కాదు.. వ్యతిరేకంగా పని చేస్తున్నారు.ఇది వైసీపీకి ఇబ్బందిక పరిణామం అనుకోవచ్చు…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి