ఒక ఫ్యామిలీ మూడు పదవులు ?

By KTV Telugu On 26 December, 2023
image

KTV TELUGU :-

ఒక కుటుంబంలో ఒక పదవేనని కాంగ్రెస్ పార్టీ తీర్మానించి చాలా రోజులైంది. ఐనా  ఉదయ్ పూర్ డిక్లరేషన్ నుంచి కొన్ని  కుటుంబాలకు మినహాయింపు ఇస్తునే ఉన్నారు. ఇటీవల పార్టీలో చేరిన మైనంపల్లి హన్మంతరావు కుటుంబానికి రెండు టికెట్లిచ్చారు. ఇప్పుడు అదే దారిలో  మరో బలమైన నాయకుడి కుటుంబానికి కూడా పదవుల పందేరం జరిగే అవకాశం ఉంది.

కాంగ్రెస్ పార్టీలో సీఎం పదవిని ఆశించిన కుందూరు జానారెడ్డికి ఈ సారి టికెట్ ఇవ్వలేదు. అలాగని ఆ నిర్ణయాన్ని  పెద్దలు  జానారెడ్డి అవమానంగా కూడా  భావించలేదు. తన కుమారుడు జయవీర్ రెడ్డికి టికెట్ ఇప్పించుకుని తదపరి తరానికి  రాజకీయ వారసత్వాన్ని అందించారు.ఇకపై  జానా తెరవెనుక ఉంటారని భావిస్తున్న తరుణంలో కొత్త వాదన వినిపిస్తోంది. రిటర్న్  ఆఫ్ ది జానా ఖాయమని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒకటి కాదు ఏకంగా మరో రెండు  పదవులు జానా ఫ్యామిలీకి ఖాయమని హస్తం పార్టీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు..

జానా చిన్న  కొడుకు జయవీర్ రెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల భగత్ పై ఘనవిజయం సాధించారు. ఈ క్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలా మారింది.12నియోజకవర్గాలకు 11నియోజకవర్గాల్లో అత్యధిక మెజారిటీతో ఇక్కడ ఎమ్మెల్యేలుగా గెలిచారు.కోమటిరెడ్డి కుటుంబంలో వెంకట్ రెడ్డికి మంత్రి పదవి దక్కగా, రాజగోపాల్ రెడ్డి పదవి కోసం ఎదురు  చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఫోకస్ ఉమ్మడి నల్గొండ జిల్లాకే చెందిన కుందూరు కుటుంబంపై పడింది.

ఏడు సార్లు ఎమ్మెల్యేగా సుదీర్ఘం కాలం మంత్రిగా పనిచేసి అనుభవం జానారెడ్డి సొంత. ఈ సారి పోటీ చేయకపోయినా ఆయన పునరాగమనం ఖాయమని  తేలిపోయింది. రాష్ట్ర పార్టీలోనూ, అధిష్టానంలోనూ ఆయనకు ఉన్న పరపతి అలాంటిది. లోక్ సభ   ఎన్నికల్లో జానారెడ్డి పెద్ద కుమారుడు రఘు వీర్ రెడ్డి ఎంపీగా పోటీ చేసేందుకు రంగం సిద్ధం అయ్యిందని చెబుతున్నారు. ఇప్పటికే 2014,2018,2023 ఎన్నికల్లో మిర్యాలగూడ నుండి రఘు వీర్ రెడ్డి పోటీ చేసేందుకు రెడీ అయ్యి పార్టీ సూచనలతో విరమించుకున్నారు.కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కీలకంగా పని చేసిన రఘు వీర్ రెడ్డిని త్వరలో జరగబోయే ఎంపీ ఎన్నికల్లో నల్గొండ నుండి పోటీ చేయించాలని అటు అధిష్టానం… ఇటు సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారట. నల్గొండ  ఎంపీగా ఉన్న ఉత్తమ్ కుమార్  రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి  పొందడంతో ఆ స్థానం ఖాళీగా ఉంది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వంలో సీనియర్ నాయకుడిగా, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న జానారెడ్డి సలహాలు, సూచనలు అమూల్యమని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు.  అందుకే ఆయన్ను రాజ్యసభకు పంపాలన్న ప్రతిపాదనను అధిష్టానం ముందుంచేందుకు  సిద్ధమైనట్లు చెబుతున్నారు. అంటే  అన్నీ అనుకున్నట్లే జరిగితే కుందూరు కుటుంబానికి మూడు పదవులు ఖాయమవుతాయి…

రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక తొలుత వెళ్లినదీ జానారెడ్డి ఇంటికే. విందుకు పిలిచిందే తడవుగా రేవంత్ వెళ్లి వచ్చారు. ఈ క్రమంలో జానాకు అజాతశత్రువన్న పేరు ఉంది. పైగా సహేతుకమైన సలహాలు తప్ప, అసమ్మతి రాజకీయాలు చేయరని కూడా జానాపై సదభిప్రాయం ఉంది. మరి ఇప్పుడు ప్రచారం జరుగుతున్నట్లుగా ఆయన కుటుంబానికి మూడు పదవులు వస్తాయో లేదో  చూడాలి…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి