ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బొబ్బిలిది ఓ ప్రత్యేకమైన స్థానం. అక్కడ బొబ్బిలి రాజుల కుటుంబానిదే హవా. కానీ గత ఎన్నికల్లో అక్కడ వారు ఓడిపోయారు. ఆ తర్వాత బొబ్బిలి రాజుల్లో పెద్దవాడయిన సుజయకృష్ణరంగారావు సైలెంట్ అయ్యారు. ఆయన సోదరుడు బేబినాయన యాక్టివ్ అయ్యారు. టీడీపీ తరపున ఆయనే పోటీ చేయబోతున్నారు. వైసీపీ తరపున టిక్కెట్ ఎవరికి అన్నది ఇంకా ఖరారు కాలేదు. సిట్టింగ్ ను మార్చడం ఖాయమన్న అభిప్రాయం వినిపిస్తోంది. రాజులు యుద్ధాల్లో ఓడిపోవడం సహజమే .. ప్రజాస్వామ్యంలోనూ అంతే. అయితే ప్రజాస్వామ్యంలో అయితే ఐదేళ్ల తర్వాత మళ్లీ యుద్ధం చేసే అవకాశం వస్తుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని బొబ్బిలి రాజులు మరోసారి విజయం సాధిస్తారా ?
బొబ్బిలి అంటే .. రాజులు, రాజ్యాలు, యుద్ధాలే కాదు.. రాజకీయంగానూ ప్రత్యేకతను దక్కించుకుంది. ఇక్కడి రాజవంశీకుల పాలన నాటి నుంచి నేటి వరకూ ఎదురులేకుండా సాగుతోంది. బొబ్బిలి సంస్థానం.. తెలుగు ప్రజలకు కొత్తగా పరిచయం అక్కర్లేని రాజస్థానం. 400 ఏళ్ల చెక్కు చెదరని చరిత్ర. నాటి రాచరిక వ్యవస్థను ఇప్పటికీ కాపాడుకుంటూ వస్తున్న గొప్పతనం ఈ సంస్థానాదీశులది. ఎన్నో రాజ్యాలు, మరెందరో రాజులు కాలగర్భంలో కలిసిపోయినా.. నేటికీ బొబ్బిలి గడ్డ శౌర్యానికి మారు పేరుగా, వీరబొబ్బిలిగా చెప్పుకుంటారు. నాటి రాచరిక వ్యవస్థను కాపాడుకుంటూనే.. నేటి ప్రజాస్వామ్యంలోనూ తమకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొంటూ ప్రజాపాలనలో నాటి బొబ్బిలి వైభవాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు.
ప్రజాస్వామ్యంలో రాజులు ప్రజలే. దానికి తగ్గట్లుగానే బొబ్బిలి రాజులు మారిపోయి.. ప్రజాభిమానం పొందుతున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయినా మళ్లీ ప్రజాభిమానం పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడటంతో బొబ్బిలి కేంద్రంగా రాజకీయాలు వాడివేడిగా సాగుతున్నాయి. బొబ్బిలి మున్సిపాలిటీతో పాటు రామభద్రపురం, బాడంగి, తెర్లాం మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. ఇక్కడ ప్రధాన పోటీ టీడీపీ, వైసీపీల మధ్యే ఉండనుంది. ఇక్కడ మళ్లీ పాగా వేసేందుకు ఓ పక్క బొబ్బిలి రాజులు ఉవ్విళ్లూరుతుండగా.. బొబ్బిలి కోటపై మళ్లీ వైసీపీ జెండా రెపరెపలాడించాలని సీఎం జగన్ పట్టుదలతో ఉన్నారు.
బొబ్బలి రాజ కుటుంబం తరపున రాజకీయాల్లో ఉన్న సుజయకృష్ణ రంగారావు, బేబినాయన గతంలో కాంగ్రెస్ లో ఉన్నారు. తర్వాత వైసీపీలో చేరారు. అయితే కాంగ్రెస్ లో వైఎస్, వైసీపీలో జగన్ బొత్స సత్యనారాయణకు ప్రాధాన్యం ఇవ్వడంతో వారికి ప్రాధాన్య పదవులు లభించలేదు. 2004, 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన సుజయ రంగారావుకి.. బొత్సకి మధ్య రాజకీయ విభేదాలతో దూరం పెరిగింది. 2014 ఎన్నికల్లో బొత్స కుటుంబీకులు ఘోర పరాజయం పాలైనా… బొబ్బిలి రాజు రంగారావు మాత్రం మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే, కొన్నాళ్లకు బొత్స కుటుంబీకులు కూడా వైసీపీలోకి రావడంతో సుజయ కృష్ణరంగారావు టీడీపీలో చేరిపోయారు. మంత్రి కూడా అయ్యారు.
బొబ్బిలి రాజులు సుజయ కృష్ణ రంగారావు, ఆయన సోదరుడు బేబీనాయనలు కూడా రాజకీయంగా తమ ప్రాంతంలో మంచి పట్టుసాధించారు. బొబ్బిలి రాజులు టీడీపీలో చేరడంతో అప్పటి వరకూ టీడీపీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడును వైసీపీ నేతలు తెరపైకి తెచ్చారు. కొప్పలవెలమ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న బొబ్బిలి నియోజకవర్గంలో అదే సామాజిక వర్గానికి చెందిన అప్పలనాయుడును బరిలోకి దించి బొబ్బిలి రాజు సుజయకృష్ణరంగారావును ఓడించగలిగారు. అయితే భారీ మెజార్టీ రాలేదు. ఎనిమిది వేల ఓట్ల మెజార్టీ మాత్రమే వచ్చింది. ఈ సారి టీడీపీ తరపున సుజయకృష్ణ రంగారావు కాకుండా ఆయన సోదరుడు బేబినాయన పోటీ చేయడం ఖాయమని భావిస్తున్నారు.
బేబీనాయనకు రాజకీయంగా నియోజకవర్గంలో మంచి పలుకుబడి ఉంది. బొబ్బిలి రాజ వంశీయులు కావడం, రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తుండటంతో అందరికీ తలలో నాలుకలా మారారు. ఓ విధంగా చెప్పాలంటే నియోజకవర్గంలో అన్న సుజయకృష్ణ రంగారావు కంటే బేబీనాయనకే గట్టి పట్టు ఉంది. అన్నమాట తమ్ముడు జవదాటడు అన్న పేరుంది. ఇన్నాళ్లూ అన్నకు రాజకీయ అండగా నిలిచిన బేబీనాయన.. వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగేందుకు సిద్ధపడుతున్నారన్న ప్రచారం ఊపందుకుంది. వాస్తవానికి బొబ్బిలి నియోజకవర్గం టీడీపీ టికెట్టు ఆశిస్తున్న వారిలో మరో నేత కూడా ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే, దివంగత తెంటు జయ ప్రకాశ్ కుమారుడు తెంటు లక్ష్మునాయుడు తొలుత బొబ్బిలి టికెట్టు రేసులో ఉండేవారు. 2014 ఎన్నికల్లో కూడా తెంటు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి, సుజయ కృష్ణ రంగారావుపై ఓటమి చెందారు. సుజయ కృష్ణ రంగరావు వైసీపీ నుంచి టీడీపీలోకి రావడంతో .. తెంటు ప్రస్తుతం ఆ సీటుపై ఆశలు వదులుకున్నారు.
బొత్స సత్యనారాయణ ప్రస్తుతం రాజకీయంగా అంత యాక్టివ్ గా లేరు. అదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతోంది. బొబ్బిలిలో ఎలాంటి పనులు జరగకపోవడం సమస్యగా మారింది. ప్రభుత్వ వ్యతిరేకత.. బొబ్బిలిరాజులపై సానుభూతి కలిసి వస్తుందని.. ఈ సారి భారి విజయం సాధిస్తామని టీడీపీ నేతలు గట్టి ఆశలు పెట్టుకున్నారు. ఇక్కడ కాపు సామాజికవర్గం ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రజారాజ్యం పార్టీకి పదిహేను వేలకుపైగా ఓట్లు వచ్చాయి. ఇప్పుడు జనసేన పార్టీ మద్దతు టీడీపీకి లభిస్తే అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…