ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో ఒకటి నుంచి వంద వరకూ సీఎం జగన్మోహన్ రెడ్డి ఉంటారు. ఆయన తర్వాత స్థానంలో సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ ఉంటారు. వైఎస్ మరణం తర్వాత కాంగ్రెస్ తరపున సీఎంలో రేసు ఉన్న ఆయన.. తర్వాత పరిణామాల్లో పవర్ లేని మినిస్టర్‌గా మారిపోయారు. కాంగ్రెస్ నుంచి గెలవలేక వైసీపీలో చేరి మళ్లీ ఎమ్మెల్యే అయ్యారు. ఇప్పుడు ఆయన సీటుకు ఆయన సొంత మేనల్లుడే ఎర్త్ పెడుతున్నారు. చీపురుపల్లి నుంచి వైసీపీ తరపున చిన్న శీనుగా పేరు తెచ్చుకున్న బొత్స మేనల్లుడికి సీటు ఖరారయిందని చెబుతున్నారు. బొత్సకు రాజ్య.సభ లేదా..లోక్ సభ సీటిస్తామని హైకమాండ్ చెబుతోంది. దీనిపై బొత్స స్పందన ఎలా ఉండబోతోంది ?
ఉమ్మడి విజయనగరం జిల్లాలో చీపురుపల్లి నియోజకవర్గానిది ఓ ప్రత్యేకత . తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి అంటే 1983 నుంచి 1999 వరకూ అక్కడ మరో పార్టీ గెలవలేదు. కానీ టీడీపీకి బొత్స సత్యనారాయణ చెక్ పెట్టారు. మొదటి సారి ఆయన చీపురుపల్లి నుంచి 2004లో ఎమ్మెల్యేగా గెలిచారు. మొదటి సారి విజయనగరం నుంచి 1999లో ఎంపీగా గెలిచిన ఆయన ఆ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చారు. చీపురుపల్లి సొంత నియోజకవర్గం కాకపోయినా పోటీలోకి దిగారు. వరుసగా రెండు సార్లు గెలిచారు. టీడీపీ కంచుకోట అయినా తనకు అనుకూలంగా మార్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో తిరుగులేని నేతగా ఎదిగారు. విజయనగరం జిల్లాలో ఎక్కడ చూసినా తన కుటుంబీకుల రాజకీయం ఉండేలా చూసుకున్నారు. జిల్లాపై పట్టు సాధించారు. అయితే రాష్ట్ర విభజన అనంతర రాజకీయాల్లో తనకు ముఖ్యమంత్రి పదవి వస్తుందని ఆశించి కాంగ్రెస్ లోనే ఉండిపోయారు. 2014లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు. టీడీపీ అభ్యర్థి కిమిడి మృణాళిని విజయం సాధించారు. అయితే ఇక కాంగ్రెస్ తరపున గెలవడం కష్టమని నిర్ణయించుకుని ఆయన వైసీపీలో చేరిపోయారు. గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి పాతిక వేలకుపైగా ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి కిమిడి నాగార్జునపై గెలుపొందారు.
అవడానికి బొత్స ఎమ్మెల్యే కానీ.. షాడో ఎమ్మెల్యే మాత్రం బొత్స మేనల్లుడు చిన్న శ్రీనే. ఆయనే తరచూ నియోజకవర్గంలో పర్యటిస్తూ…. స్థానిక సమస్యలను పరిష్కరిస్తూ.. పార్టీని బలోపేతం చేస్తున్నారు. చిన్నశ్రీను చాలాకాలం తెరచాటు రాజకీయానికే పరిమితమయ్యారు. రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పే మంత్రి బొత్స సత్యనారాయణ.. సొంత జిల్లా విజయనగరం రాజకీయమంతా తన మేనల్లుడు చిన్నశ్రీనుకే అప్పగించేశారు. కాంగ్రెస్ హయాంలో బొత్స మంత్రిగా ఉండగా.. ఆయన భార్య ఝాన్సీలక్ష్మి, సోదరుడు అప్పలనరసయ్య, మరో బంధువు బడ్డుకొండ అప్పలనాయుడు ఎంపీ, ఎమ్మెల్యేలుగా పనిచేసినా.. వీరి తరపున జిల్లాలో రాజకీయం నడిపింది చిన్న శ్రీను ఒక్కరే.. బొత్స తరపున పనులు చక్కబెట్టే నేతగా ఎదిగిన చిన్నశ్రీను తెరచాటు రాజకీయం నడపడంలో దిట్టగా గుర్తింపు తెచ్చుకున్నారు. మామ బొత్సపై ఈగ వాలనీయకుండా రాజకీయం చేయడంలో చిన్నశ్రీనుకు సాటిలేరనేది విజయనగరం జిల్లా టాక్.. ఐతే ఇప్పుడు అదే చాణక్యం మామకు ఎర్త్ పెట్టేలా మారిందని అంటున్నారు.
జిల్లాలో బలమైన నాయకుడిగా ఎదిగిన చిన్నశ్రీనును వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని వైసీపీ హైకమాండ్ భావిస్తోంది. ప్రస్తుతం విజయనగరం జడ్పీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న చిన్నశ్రీను రాజకీయంగా జిల్లాపై మంచి పట్టుసాధించారు. జగన్ పాదయాత్ర సమయంలో ఆయనతో కలిసి జిల్లా మొత్తం తిరిగారు. అప్పటి నుంచి ముఖ్యమంత్రితో సన్నిహిత సంబంధాలు నెరుపుతున్న చిన్నశ్రీను.. జిల్లాలో బలమైన నేతగా ఎదిగారు. ఇక వచ్చే ఎన్నికల్లో సీనియర్లను ఎంపీలుగా పంపి.. కొత్తవారిని ఎమ్మెల్యేలు చేయాలని నిర్ణయించిన వైసీసీ.. బొత్సను విజయనగరం ఎంపీగా పంపి.. ఆయన స్థానంలో చిన్నశ్రీనును పోటీకి పెట్టాలని ప్రయత్నించడమే హాట్‌టాపిక్ అవుతోంది. ఐతే చిన్నశ్రీను మాత్రం మామను తప్పించి తనకు సీటు ఇవ్వొద్దని.. ఆయనను ఒప్పించి ఇవ్వాలని కోరుతున్నారు.
అయితే విజయనగరం లోక్ సభ సీటు బొత్సకు ఇవ్వాలంటే.. సిట్టింగ్ ఎంపీగా ఉన్న బెల్లాన చంద్రశేఖర్‌కు చీపురుపల్లి అసెంబ్లీ సీటివ్వాలి. ఎందుకంటే బొత్స పార్టీలో లేనప్పుడు వైసీపీ తరపున పని చేసుకుంది ఆయనే. ఇప్పుడు ఆయనకు సీటు లేకుండా చేస్తే ఊరుకోరు. ఇటీవలి కాలంలో చీపురుపల్లిలో బెల్లాన చంద్రశేఖర్ విస్తృతంగా పర్యటిస్తూ.. అసెంబ్లీక ిోటీ చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఆయనకు వ్యతిరేక వర్గం లేకపోవడం హైలైట్. అన్ని నియోజకవర్గాల్లో సొంత బలగం లేకపోయినా.. సొంత నియోజకవర్గం చీపురుపల్లి… పక్కనే ఉన్న ఎచ్చర్లలో బెల్లానకు మంచి పట్టు ఉంది. ఈ రెండు నియోజకవర్గాల్లో… గెలుపోటములు ఆయన కనుసన్నల్లో ఉంటాయని టాక్. చీపురుపల్లిలో బొత్స మేనల్లుడు శ్రీనుతో.. బెల్లానకు ఆధిపత్య పోరు నడుస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. బయటకు అంతా కూల్‌గానే కనిపించినా.. తెరవెనక వర్గపోరు పీక్స్‌లో ఉందనే ప్రచారం ఉంది.
బొత్సకు ఇటీవల గుండె ఆపరేషన్ జరిగింది. ఆరోగ్యం అంతంతమాత్రంగానే ఉందని.. ఎక్కువ విశ్రాంతి తీసుకోవాలని కుటుంబసభ్యులు కూడా ఒత్తిడి తెస్తున్నారని చెబుతున్నారు. నిజానికి బొత్స తన కుమారుడికి టిక్కెట్ ఇప్పించాలనుకున్నారు. కానీ మేనల్లుడే అడ్డం పడుతున్నారు. సీఎం జగన్ ఇంకా విజయనగరం సీట్లపై సమీక్షలు చేయలేదు. అందుకే క్లారిటీ లేదు. టీడీపీ తరపున అక్కడ పోటీ లేదు. మాజీ మంత్రి కిమిడి మృణాళిని కుమారుడు కిమిడి నాగార్జున ఐదేళ్లుగా పని చేసుకుంటున్నారు. ఆయనే పోటీ చేస్తారు…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…