2018లో తెలంగాణా తరహాలో 2024 ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ తో టిడిపి పొత్తు పెట్టుకుంటుందా? జనసేన కాంగ్రెస్ లతో పాటు కమ్యూనిస్టులను కలుపుకుని మహాకూటమి ఏర్పాటు చేస్తుందా? అదే జరిగితే అప్పుడు తెలంగాణాలో ఘోర పరాజయాన్ని మూటకట్టుకున్నట్లే ఏపీలోనూ కూటమి కుదేలవుతుందా? ఏపీ రాజకీయ వర్గాల్లో ఇపుడు ఈ ప్రశ్నలే వినపడుతున్నాయి. ఒక్క వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ను ఎదుర్కొనే శక్తి లేక విపక్షాలన్నీ కూడా చేతులు కలిపినా వచ్చే ఎన్నికల్లో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ను నిలువరించడం విపక్షాల వల్ల అయ్యే పని కాదంటున్నారు రాజకీయ పండితులు.
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతయ్యింది. వరుసగా రెండు ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోవడమే కాదు డిపాజిట్లు కూడా సంపాదించలేక చతికిల పడిపోయింది.కాంగ్రెస్ తో పాటే ఉభయ కమ్యూనిస్టు పార్టీలూ ఏపీలో ఎక్కడున్నాయో తెలీని పరిస్థితి. రెండు వరుస ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కామ్రేడ్లు ఉనికి కూడా చాటుకోలేకపోయారు.2019 ఎన్నికల్లో 23 స్థానాలకు పరిమితం అయిన తెలుగుదేశం పార్టీ ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ, పంచాయతీ ఎన్నికల్లోనూతుడిచి పెట్టుకుపోయింది. సాక్షాత్తూ చంద్రబాబు నాయుడి సొంత నియోజక వర్గంలోనే టిడిపి కథ ముగిసింది.ఇక జనసేన పార్టీ 2019లో చచ్చీ చెడీ ఒక్క సీటు గెలుచుకుంది. పార్టీ అధినేత తాను పోటీ చేసిన రెండు చోట్లా ఓటమి చెంది సరికొత్త చరిత్ర సృష్టించారు.
2024ఎన్నికల్లో కూడా విపక్షాలకు ఆశావహ వాతావరణం ఎక్కడా కనపడ్డం లేదు. ఈ తరుణంలోనే సిపిఐ సీనియర్ నేత నారాయణ ఓ అవకాశ వాద ప్రతిపాదన చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన-సిపిఐ-సిపిఎం పార్టీలు కలిసి మహాకూటమిగా ఏర్పాటు కావాలని ఆయన అంటున్నారు. విపక్షాలు విడి విడిగా బరిలోకి దిగితే వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ను ఓడించడం సాధ్యం కాదని కూడా ఆయన అంటున్నారు. 2018లో తెలంగాణా ఎన్నికల్లో మహాకూటమి ఏర్పాటు చేసినట్లే వచ్చే ఎన్నికల్లో ఏపీలోనూ అందరూ జట్టు కట్టాలని ఓ సలహాని ఫ్రీగా ఇచ్చారు.నిజానికి తెలుగుదేశం పార్టీ..ప్రత్యేకించి చంద్రబాబు సారధ్యంలో మహాకూటమి కట్టినపుడు ఘోర పరాజయాలు మూటకట్టుకోవలసి వచ్చింది.2009లో టి.ఆర్.ఎస్., సిపిఐ, సిపిఎం లతో కూటమి కట్టి బరిలోకి దిగినా వై.ఎస్.ఆర్. నాయకత్వంలోని కాంగ్రెస్ ను అధికారంలోకి రానీయకుండా నిలువరించలేకపోయారు చంద్రబాబు.
తొమ్మిదేళ్ల తర్వాత 2018లో తెలంగాణా ఎన్నికల్లో టిడిపికి ఆగర్భ శత్రువు అయిన కాంగ్రెస్ , కమ్యూనిస్టు పార్టీలతో కలిసి అవకాశవాద పొత్తు పెట్టుకుని మహాకూటమిని ఏర్పాటు చేశారు చంద్రబాబు. ఆ ఎన్నికల్లో టి.ఆర్.ఎస్. ఘన విజయం సాధించి కాంగ్రెస్, టిడిపిలకు పరాభవాలు మిగిల్చింది.అసలు కాంగ్రెస్ తో టిడిపి జట్టు కట్టడాన్ని టిడిపి సీనియర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీపై కోపంతోనే దాన్ని గద్దె దించడం కోసం ఎన్టీయార్ టిడిపిని స్థాపించారు. కాంగ్రెస్ ఏక ఛత్రాధి పత్యానికి గండికొట్టారు. ఆ మంటతో కాంగ్రెస్ పార్టీ టిడిపిలో వెన్నుపోటుకు స్కెచ్ గీసి ఎన్టీయార్ ను గద్దె దింపింది. నెల రోజులు తిరక్కుండా ప్రజా బలంతో ఎన్టీయార్ తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు.
టిడిపిని అంత దెబ్బతీసిన కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడాన్ని మించిన నీచం మరోటి ఉండదంటారు రాజకీయ పండితులు. 2018లో తెలంగాణాలో వర్కవుట్ కాని ఫార్ములానే ఇపుడు నారాయణ టిడిపి ముందు ఉంచారు.అయితే ఇది నారాయణ మస్తిష్కంలో పుట్టిన ఆలోచనా? లేక చంద్రబాబు నాయుడే నారాయణ చేత ఈ మాటలు అనిపించారా? అన్న అనుమానాలు కూడా ఉన్నాయంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఒక వేళ నారాయణ ప్రతిపాదనకే చంద్రబాబు సై అంటే అపుడు జనసేన పరిస్థితి ఏంటన్నది చూడాలి. ఎందుకంటే ఇప్పటిదాకా జనసేన బిజెపితో స్నేహం కొనసాగిస్తోంది. ఒక వేళ చంద్రబాబు నాయుడితో పాటు పవన్ కూడా కాంగ్రెస్ తో కూటమి కడితే ఆయన ఇండియా కూటమిలో చేరినట్లు అవుతుంది.
తన రాజకీయ జీవితమంతా కాంగ్రెస్ ను తిట్టిన తిట్టు తిట్టకుండా కాలక్షేపం చేస్తూ వచ్చిన పవన్ కళ్యాణ్ ఇపుడు చంద్రబాబు నాయుడు చెప్పాడు కదా అని కాంగ్రెస్ తో చేతులు కలపగలరా అన్నది ప్రశ్న.పరస్సర విరుద్ధ సిద్దాంతాలు విధానాలు కలిగిన పార్టీలన్నీ కూడా కలగూర గంపలా చేతులు కలిపితే ప్రజలు ఆశీర్వదిస్తారా అన్నది కూడా అనుమానమే అంటున్నారు విశ్లేషకులు. ఒక వేళ నారాయణ చెప్పిందే జరిగితే జనసేనకు కేటాయించే సీట్లలో మరి కొంత కోత పడ్డం ఖాయం. ఇపుడే జనసేనకు పాతిక సీట్లలోపే కేటాయిస్తారని ప్రచారం జరుగుతోండగా కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు కూడా వచ్చి చేరితే పాతికలో సగం సీట్లు ఎగిరిపోవడం ఖాయమంటున్నారు పండితులు. ఇంతమందీ కలిసినా ఒకరి ఓట్లు మరొకరికి బదలీ అవుతాయన్న గ్యారంటీకూడా లేదంటున్నారు. అపుడు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ మరోసారి క్లీన్ స్వీప్ చేయడం గ్యారంటీ అంటున్నారు పరిశీలకులు…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…