తూర్పున ఉదయించేదెవ్వరో…?

By KTV Telugu On 28 December, 2023
image

KTV TELUGU :-

రెండు ప్రధాన పార్టీలకు ఆ నియోజకవర్గం ప్రతిష్టాత్మకమైంది. వైసీపీ గెలిచి తీరుతుందని ఆ పార్టీ నేతలు చెబుతుండగా, టీడీపీ తన అభ్యర్థిని మార్చే ప్రక్రియలో  ఉంది. విజయవాడలో ప్రతిపక్షానికి ఉన్న ఏకైక ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ రావు…  ఈ సారి  విజయవాడ తూర్పు నుంచి పోటీ చేస్తారా  లేదా అన్నది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది…

2024 అసెంబ్లీ ఎన్నికలకు వైసీపీ తొట్టతొలిగా అభ్యర్థిని ప్రకటించిన నియోజకవర్గం విజయవాడ తూర్పు అని చెప్పక తప్పదు. దాదాపు ఏడాది క్రితమే నియోజకవర్గాల సమీక్షలో సీఎం జగన్ స్వయంగా దేవినేని అవినాష్ పేరును ప్రకటించారు. అధికార  పార్టీలో తూర్పు ఇంఛార్జ్ పదవి దక్కినప్పటి నుంచి దూసుకుపోతున్న దేవినేని అవినాష్ కు ఇది పెద్ద బూస్టింగేనని చెప్పక తప్పదు. స్వర్గీయ దేవినేని నెహ్రూ కుమారుడైన అవినాష్ 2019లో గుడివాడ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేసి మాజీ మంత్రి కొడాలి నాని చేతిలో ఓడిపోయారు. తర్వాతి పరిణామాల్లో అధికార వైపీసీలో చేరి ఏకంగా తూర్పు ఇంఛార్జ్ అయ్యారు. దూకుడు రాజకీయాలు చేస్తారన్న పేరున్న దేవినేని అవినాష్ జగన్ అధికారాన్ని అండగా చూసుకుని నియోజకవర్గంలో రెచ్చిపోతారన్న  పేరు ఉంది.అనేక పర్యాయాలు టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్  రావు వర్గంపై దాడులకు కూడా అవినాష్ బ్యాచ్ ప్రయత్నించింది. నియోజకవర్గంలో అవినాష్ నిర్వహించిన గడప గడపకు కార్యక్రమాలు తరచూ ప్రహసనంగా మారాయి. జనం నిలదీస్తుంటే.. అవినాష్ సహనం కోల్పోయిన వీడియోలు కూడా సామాజిక  మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. అయితే వైసీపీకి ఉన్న బలం ఆధారంగా తాను గెలుస్తానని అవినాష్ చెప్పుకుంటుంటారు. పైగా గద్దే రామ్మోహన్ కంటే తాను యువకుడినని యూత్ ఓట్లన్నీ తనకే పడతాయని కూడా అవినాష్ వాదన..

విజయవాడలో టీడీపీ గెలిచిన ఏకైక నియోజకవర్గం తూర్పు కావడంతో దానిపై పార్టీ నేతలు ఎక్కువ ఏకాగ్రత చూపుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండటంతో పోటీదారులు కూడా అటుగా చూడటం లేదన్న చర్చ జరుగుతోంది. అయితే గన్నవరం నుంచి గద్దేను రంగంలోకి దించితే ఎలా ఉంటుందన్న టాక్ కూడా టీడీపీ వర్గాల్లో వినిపిస్తోంది.అదే జరిగితే తూర్పులో టీడీపీ అభ్యర్థి ఎవరన్నది మిలియన్ డాలర్ ప్రశ్న అవుతుంది.

తూర్పు నియోజకవర్గంలో ఆటోనగర్‌, పటమట, పటమటలంక, రామలింగేశ్వరగనర్‌, మొగల్రాజపురం, గుణదల, కృష్ణలంక ప్రాంతాలు ఉన్నాయి.కృష్ణలంక బస్‌స్టాండ్‌ ఇవతల ప్రాంతమంతా ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది.తూర్పు నియోజకవర్గానికి ఆటోనగర్‌ బస్‌స్టాండ్‌ సరిహద్దు. అటుపైన అంతా పెనమలూరు నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది.గుణదల మాచవరం ఆంజనేయ స్వామి గుడి వరకు తూరు నియోజకవర్గం సరిహద్దు ఉంది.బెంజిసర్కిల్‌ నుంచి రామవరప్పాడు రింగ్‌ వరకు వరకు జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్నటువంటి అత్యధిక కాలనీలు,రెండు జాతీయ రహదారులు ఈ నియోజకవర్గం మీదుగా వెళ్ళుతున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ రావు గతంలో విజయవాడ లోక్ సభ ఎంపీగా సేవలందించారు. 1994లో గన్నవరం  అసెంబ్లీ అభ్యర్థిగా గెలిచారు. 2014 ఆ తర్వాత 2019లో విజయవాడ తూర్పు నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలిచారు. అయితే ఈ సారి ఆయన్ను వ్యూహాత్మకంగా గన్నవరం నుంచి  పోటీ చేయించినా ఆశ్చర్యం లేదని చెబుతున్నారు. ప్రస్తుతం వైసీపీలో ఉన్న వల్లభనేని వంశీని ఓడించాలంటే గద్దే  రామ్మోహన్ వల్లే సాధ్యమని టీడీపీలో వినిపిస్తున్న టాక్..గద్దేను మార్చితే తూర్పులో వంగవీటి రాధాకృష్ణను టీడీపీ బరిలోకి దించుతుందని ప్రచారం జరుగుతోంది. 2004లో ఆయన విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి గెలుపొంది   ఎమ్మెల్యే అయ్యారు. 2014లో వైసీపీ అభ్యర్థిగా ఆక్కడ ఓడిపోయారు. 2019 ఎన్నికల ముందు టీడీపీలో చేరినా ఎన్నికల బరిలోకి దిగలేదు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా వంగవీటి రాధా.. ఆయనతో సమావేశమయ్యారు. ఏకాంత చర్చలు జరిపారు. విజయవాడలోని ఏదోక నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని వంగవీటి రాధ భావిస్తుండగా అది తూర్పు మాత్రమేనని ఆయన అనుచరుల వాదన. పైగా కాపు సామాజికవర్గం  బలం ఎక్కువగా ఉండటంతో తూర్పులో రాధ గెలవడం  సాధ్యమేనని భావిస్తున్నారు..

తూర్పుకు చాలా చేశామని చెప్పుకునేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది. కృష్ణా  నదికి 130 కోట్ల రూపాయలతో రిటైనింగ్ వాల్ ని కట్టామని ప్రస్తావిస్తోంది.దేవినేని అవినాష్ యువ నాయకుడైనప్పటికీ ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీ పట్ల వ్యతిరేకత పెరిగిపోతోంది. అదే వారి భయానికి కారణమేతే… టీడీపీ మాత్రం ఇప్పుడు పూర్తి జోష్ లో ఉంది. విజయవాడలోని మూడు నియోజకవర్గాల్లో  గెలుపు తమదేనని ఢంకా  బజాయిస్తోంది. ఏం జరుగుతుందో చూడాలి మరి…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి