ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అంశం హాట్ టాపిక్. రాజధాని ఏదో క్లారిటీ లేదు. అందుకే అందరూ తమ ఏరియా దేనికి ప్రసిద్ధమైతే దానికి రాజధానిగా చెప్పుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం జీడిపప్పుకు ప్రసిద్ధి. జీడిపప్పు రాజధానిగా మారింది. ఈ నియోజకవర్గంలో రాజకీయం కూడా అంతే ఉంటుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి సీదిరి అప్పల్రాజు, టీడీపీ నేత గౌతు లచ్చన్న వారసురాలు శిరీష ప్రత్యర్థులుగా తలపడుతున్నారు. నిన్నామొన్నటి వరకూ ఎవరు గెలుస్తారో తెలియని పరిస్థితి ఉండేది కానీ.. జనసేనతో పొత్తు తర్వాత కాస్త మొగ్గు టీడీపీ వైపు కనిపిస్తోందన్న అభిప్రాయం వినిపించడం ప్రారంభమయింది.
పలాస నియోజకవర్గ రాజకీయం ఎప్పుడూ ఉద్రిక్తంగానే ఉంటుంది. నిత్యం అధికార, ప్రతిపక్ష నేతలు.. ఢీ అంటే ఢీ అనుకుంటూ ఉంటారు. 2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా.. పలాస అసెంబ్లీ సెగ్మెంట్ ఏర్పడింది. దీని పరిధిలో.. పలాస, మందస, వజ్రపుకొత్తూరు మండలాలున్నాయి. మొత్తంగా.. ఈ నియోజకవర్గంలో 2 లక్షల 10 వేల మంది పైనే ఓటర్లున్నారు. వీరిలో.. మత్స్యకార సామాజికవర్గం ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉంది. వారి తర్వాత.. కళింగ , యాదవ సామాజికవర్గాలున్నాయి. గౌతు ఫ్యామిలీకి.. పలాస ప్రాంతం పొలిటికల్ అడ్డాగా ఉండేది. సోంపేట నుంచి గౌతు లచ్ఛన్న ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన వారసుడిగా.. గౌతు శివాజీ సోంపేట నుంచి ఐదు సార్లు, పలాస నుంచి ఒకసారి.. మొత్తంగా ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వయోభారంతో.. గత ఎన్నికల్లో.. గౌతు శివాజీ ఎన్నికల బరి నుంచి తప్పుకొని.. తన కుమార్తె గౌతు శిరీషను బరిలో దించారు. కానీ మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన సీదిరి అప్పలరాజు.. గౌతు కుటుంబం కంచుకోటను బద్దలుకొట్టారు.
ఇప్పటిదాకా జరిగిన మూడు ఎన్నికల్లో.. మూడు పార్టీల అభ్యర్థులకు పట్టం కడుతూ వచ్చారు పలాస ప్రజలు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవగా.. 2014లో తెలుగుదేశం అభ్యర్థి గెలిచారు. 2019 ఎన్నికల్లో.. వైసీపీ వేవ్‌లో.. సీదిరి అప్పలరాజు గెలిచారు. ఈ సారి అక్కడ ఎలాంటి రిజల్ట్ రాబోతుందన్నది స్థానికంగానే కాదు.. శ్రీకాకుళం జిల్లా మొత్తం ఆసక్తి రేపుతోంది. గత ఎన్నిక సీదిరి అప్పలరాజు 16 వేల ఓట్లకు పైగా మెజారిటీతో గెలిచారు. ఆయన మంత్రి అయినప్పటి నుంచి.. ప్రతిపక్షాలను ఎక్కడికక్కడ తొక్కేస్తున్నారని.. విపక్ష నేతలను టార్గెట్ చేసి.. అక్రమంగా కేసులు బనాయించి.. అరెస్ట్ చేస్తున్నారని.. తెలుగుదేశం నేతలు విమర్శిస్తూ వస్తున్నారు. మరోసారి పలాస నుంచి గెలిచేందుకు.. మంత్రి సీదిరి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆయన వ్యవహారశైలితో నియోజకవర్గంలో గ్రూపులు తయారయ్యాయి.
పలాస నియోజకవర్గం వైసీపీలో ఏర్పడిన గ్రూపులు.. సీదిరి అప్పలరాజుకు తలనొప్పిగా మారాయి. దువ్వాడ శ్రీకాంత్ , హేమబాబు చౌదరి, జుత్తు నీలకంఠం లాంటి వాళ్లంతా.. మంత్రికి వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. సీదిరి ఏకపక్ష తీరుతో.. జిల్లాలోని మెజారిటీ సామాజికవర్గం సైతం ఆయనకు దూరమయింది. అయినప్పటికీ.. గ్రూప్‌లకు చెక్ పెట్టడంలో సీదిరి విఫలమయ్యారు. పైగా.. మంత్రి అనుచరులు భూ కబ్జాలు, అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. గత ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి ఓటమిపాలైన.. గౌతు శిరీష ఈసారి ఎలాగైనా పలాసలో పసుపు జెండా ఎగరేయాలని చూస్తోంది. ఇందుకోసం.. రాజకీయంగా గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. తన తండ్రి, తాతల నుంచి వస్తున్న క్యాడర్‌ని కలుపుకుపోతూ.. పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు. కార్యకర్తలకు ఎక్కడ ఇబ్బందులొచ్చినా అండనా ఉంటానని చెబుతున్నారు. గత ప్రభుత్వంలో.. శిరీష భర్త వెంకన్న చౌదరి పలాస రాజకీయాల్లో జోక్యం చేసుకొని.. అతిగా వ్యవహరించారన్న విమర్శలు.. ఇప్పటికీ ఆమెను వెంటాడుతున్నాయి.
పలాస నియోజకవర్గంలో.. జనసేన కాస్త బలంగా కనిపిస్తోంది. ఈ సెగ్మెంట్‌లోని మత్స్యకార గ్రామాల్లో పవన్ ఇప్పటికే చాలాసార్లు పర్యటించారు. స్థానికంగా ఉన్న జనసేన నాయకులు తరచుగా ఈ గ్రామాల్లో పర్యటిస్తూ ఉంటారు. దాంతో.. ఆ గ్రామాల్లోని యువత.. జనసేన పార్టీ వైపు మొగ్గు చూపుతోందనే టాక్ వినిపిస్తోంది. అందుకే..టీడీపీతో జనసేన పొత్తు కలసి వస్తుందన్న అంచనాలు ఉన్నాయి. కొంత మంది వైసీపీ నేతలు సీదిరికి మళ్లీ సీటిస్తే టీడీపీలో చేరడానికి రెడీ అయిపోతున్నారు…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…