రాహుల్ యాత్ర-2

By KTV Telugu On 29 December, 2023
image

KTV TELUGU :-

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరో యాత్రకు నడుం బిగిస్తున్నారు. గత ఏడాది భారత్ జోడో యాత్ర చేసి వివిధ రాష్ట్రాల్లో  ప్రముఖుల మద్దతు కూడగట్టుకున్న రాహుల్ గాంధీ  మరోసారి సుదీర్ఘయాత్రకు సిద్ధమవుతున్నారు. అప్పట్లో దక్షిణాది నుండి ఉత్తరాది  దిశగా జోడో యాత్ర నిర్వహించిన రాహుల్ గాంధీ ఈ సారి తూర్పు   నుండి పశ్చిమ భారతం వైపు  యాత్ర చేయనున్నారు. వచ్చే నెల జనవరి 14న ప్రారంభం కాబోయే యాత్ర మార్చి 20 వరకు సాగుతుంది. ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ లో మొదలయ్యే యాత్ర  పశ్చిమాన మరాఠా రాజధాని ముంబయ్ వరకు సాగుతుంది. దీనికి న్యాయ్ యాత్ర అని పేరు పెట్టినట్లు కాంగ్రెస్  నాయకులు  ప్రకటించారు.

2024లో ఎట్టి పరిస్థితుల్లోనూ  ఎన్నికల్లో గెలిచి కేంద్రంలో అధికారంలోకి రావాలని పట్టుదలగా ఉన్నారు రాహుల్ గాంధీ. కాంగ్రెస్ సారధ్యంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని ఆయన నమ్ముతున్నారు. ఎన్నికల నాటికి వివిధ రాష్ట్రాల్లో ఇండియా కూటమికి మద్దతు కూడగట్టేందుకు మరో యాత్ర చేయాలని ఆయన నిర్ణయించారు. గత ఏడాది సెప్టెంబరులో రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కశ్మీరు వరకు భారత్ జోడో యాత్ర నిర్వహించిన సంగతి తెలిసిందే. దేశ ప్రజల మధ్య ఐక్యత సాధించేందుకే యాత్ర చేస్తున్నట్లు అప్పట్లో ప్రకటించారు. ఆ యాత్రలో రాహుల్ గాంధీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు.

భారత్ జోడో యాత్ర  సూపర్ హిట్ అయ్యిందని రాజకీయ పండితులు అభినందించారు. అయితే  ఆ యాత్ర చివర్లో జరిగిన ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాలు మూటకట్టుకోవలసి వచ్చింది. ప్రత్యేకించి గుజరాత్ లో  కాంగ్రెస్  అడ్రస్ గల్లంతు అయ్యింది. ఆ తర్వాత నెమ్మదిగా దేశంలో ఎన్డీయేకి దీటుగా ఇండియా కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన రాహుల్ గాంధీ  జోడో యాత్ర తరహాలో మరో యాత్ర తో జనంలోకి వెళ్లాలని  నిశ్చయించుకున్నారు. అయితే జోడో యాత్ర పూర్తిగా పాదయాత్ర కాగా  ఈసారి చేయబోయే న్యాయ యాత్రలో కొద్ది దూరాలు పాదయాత్ర..ఆ తర్వాత బస్సు యాత్ర ఉంటాయి. మొత్తం మీద 6200 కిలోమీటర్ల దూరం పాటు న్యాయ యాత్ర సాగుతుంది. 14 రాష్ట్రాల్లో 85 జిల్లాల మీదుగా న్యాయ యాత్ర నిర్వహించనున్నారు రాహుల్.

మణిపూర్ లో ఆరంభం అయ్యే న్యాయ యాత్ర నాగాలాండ్, మేఘాలయ,పశ్చిమ బెంగాల్, బిహార్, ఝార్ఖండ్, ఒడిషా, ఛత్తీస్ ఘడ్, ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ మీదుగా మహారాష్ట్ర చేరుకుంటుంది. యాత్రల ద్వారా ప్రజల ఆకాంక్షలను తెలుసుకునే వీలుంటుంది. వాటికి అనుగుణంగా మేనిఫెస్టోలు రూపొందించుకునే వెసులు బాటు కూడా ఉంటుంది.  ప్రజలకు ఏం కావాలో తెలుసుకుని వాటికి భరోసా ఇవ్వడం ద్వారా దూరమైన వర్గాలను తిరిగి కాంగ్రెస్ వైపు తిప్పుకోవచ్చునని రాహుల్ గాంధీ భావిస్తున్నారు.  వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఈ రాష్ట్రాల్లో తిరిగి బలం పుంజుకోవాలన్నది కాంగ్రెస్  ఆలోచనగా చెబుతున్నారు.

2014 ఎన్నిక్లలో  అధికారాన్ని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ  అయిదేళ్ల తర్వాత 2019లో జరిగిన ఎన్నికల్లోనూ  ప్రతిపక్షానికే పరిమితం అయ్యింది. వచ్చే ఎన్నికల్లోనూ ఓటమి చెందితే నరేంద్ర  మోదీకి అది హ్యాట్రిక్ విజయం అవుతుంది. అదే జరిగితే కాంగ్రెస్ పార్టీ మనుగడే ప్రశ్రార్ధకం అవుతుంది. అందుకే కాంగ్రెస్ నాయకత్వం 2024 ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. ఇప్పటికే విపక్షాలను ఒక్కతాటిపైకి తెచ్చి ఇండియా కూటమిని ఏర్పాటు చేసింది. అయితే కూటమిలో కొన్ని పక్షాలు కాంగ్రెస్ ఏకపక్ష వైఖరిపట్ల  చికాగ్గా ఉన్నప్పటికీ అన్నీ సద్దుకుంటాయని కాంగ్రెస్ నాయకత్వం ధీమాగా ఉంది.

న్యాయ యాత్ర షెడ్యూల్ ను ప్రకటించడమే ఆలస్యం బిజెపి నేతలు  కౌంటర్లు వేసేశారు. యాత్రలతో న్యాయాలు జరగవని సెటైర్లు సంధించారు కమలనాథులు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని పిల్లి మొగ్గలు వేసినా..రాహుల్ గాంధీ ఎంత దూరం నడిచినా.. వచ్చే ఎన్నికల్లో  బిజెపి విజయాన్ని  నిలువరించడం సాధ్యం కాదని బిజెపి నేతలు అంటున్నారు. అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం తమ వ్యూహాలు తమకి ఉన్నాయంటున్నారు. న్యాయ యాత్రలో రాహుల్ గాంధీ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనుసరిస్తోన్న నిరంకుశ విధానాలను ఎండగట్టి ప్రజల మద్దతు కూడగడతారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. దేశ వ్యాప్తంగా ప్రజలను ఆకర్షించేందుకు   ప్రత్యేక గ్యారంటీలనూ త్వరలో ప్రకటిస్తామని హస్తం పార్టీ నేతలు అంటున్నారు. రాహుల్ గాంధీ యాత్ర ఓ విహార యాత్రగానే మిగిలిపోతుందని బిజెపి అంటోంది…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి