BJP – BRS మధ్య వారధిగా కవిత

By KTV Telugu On 29 December, 2023
image

KTV TELUGU :-

భారత రాష్ట్ర సమితి తన తదుపరి రాజకీయ వ్యూహాన్ని ఖరారు చేసుకున్నట్లుగా కనిపిస్తోంది. గతంలో బీజేపీపైనే భీకర యుద్ధం అని ప్రకటించిన కేసీఆర్ ఇప్పుడు పూర్తిగా యూటర్న్ తీసుకున్నారు. కాంగ్రెస్‌పై భీకర యుద్ధం.. బీజేపీతో ఫ్రెండ్లీ పాలిటిక్స్ చేయాలని డిసైడయ్యారు. అందుకే తన పార్టీ సిద్ధాంతాలను కూడా హిందూత్వం వైపు మళ్లించారు. ఈ అంశంలో కవిత చురుకుగా వ్యవహిస్తున్నారు. కాంగ్రెస్ కూటమి హిందూత్వ వ్యతిరేకమని ప్రకటనలు చేస్తూ… తమ విధానాన్ని మెల్లగా  ప్రజల్లోకి పంపుతున్నారు.

భారత రాష్ట్ర సమితి , భారతీయ జనతా పార్టీ   ఈ రెండు పార్టీలూ ఒకటేనంటూ మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రచారం చేసింది. వీటిలో ఒక పార్టీకి ఓటేస్తే మరో దానికి వేసినట్టేనని   రేవంత్‌రెడ్డి అనేక బహిరంగ సభల్లో చెప్పారు. ఓట్ల కోసం కాంగ్రెస్‌ ఆ విధంగా తప్పుడు ప్రచారం చేస్తోందంటూ బీఆర్‌ఎస్‌ అగ్రనేతలు అప్పట్లో కొట్టి పారేసినా… తాజా పరిణామాలు మాత్రం అదే నిజమని రుజువు చేసేలా ఉన్నాయి. ఇటీవల పార్లమెంటులో పొగబాంబు సంఘటన, భద్రతా వైఫ్యలంపై ప్రతిపక్షాల నిరసన, ఆపైన 146 మంది ఎంపీల బహిష్కరణ మొదలైన ఘటనలు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించగా… ఈ మొత్తం వ్యవహారంలో బీఆర్‌ఎస్‌ ఉనికే కనిపించలేదు. ఆ పార్టీ ఎంపీలంతా  మౌనం దాల్చారు. అసలు పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనకుండా మధ్యలోనే వచ్చేయమని కేసీఆర్ వారిని ఆదేశించారు.

బీజేపీపై యద్ధం ప్రకటించినా.. మళ్లీ కాల్పుల విరమణ ప్రకటించినా కేసీఆర్ రాజకీయ వ్యూహం మత్రం ఎవరికీ అర్థం కాలేదు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బీజేపీతో స్నేహంగా ఉండటం కీలకమని కేసీఆర్ నిర్ణయానికి వచ్చి దానికి తగ్గట్లుగా పరిస్థితులు మార్చారని అంటున్నారు.  కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు తర్వాత…బీఆర్‌ఎస్‌ హస్తం పార్టీని తన ప్రధాన శత్రువుగా చెప్పుకుంది. ఇప్పుడు ఆ పార్టీ రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవటంతో రాజకీయ కారణాలు, వ్యక్తిగత ప్రయోజనాల రీత్యా బీఆర్‌ఎస్‌ మళ్లీ బీజేపీకి మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. తాజాగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత… కాంగ్రెస్‌ హిందూ వ్యతిరేక ధోరణిని అవలంభిస్తోందంటూ  విమర్శలు ప్రారంభించారు.

ఒక్క కాంగ్రెస్ పార్టీనే కాకుండా.. మొత్తం కాంగ్రెస్ కూటమిని  కవిత తప్పు పడుతున్నారు. డీఎంకే ఎంపీలు చేసిన వ్యాఖ్యలపైనా కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.   కవిత తీరు చూస్తే.. బీఆర్ఎస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయని అందరికీ సందేహం రావడం సహజమే.  గతంలో కూడా అయోధ్య రామమందిర నిర్మాణాన్ని స్వాగతిస్తున్నామంటూ ఆమె వ్యాఖ్యానించటం తెలిసిందే. తద్వారా బీజేపీ కార్యాచరణలో కవిత భాగస్వాములవుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పార్లమెంటులో పొగబాంబు ఘటన, ఆ సందర్భంగా 146 మంది ఎంపీలను సభ నుంచి బహిష్కరించటం తదితర పరిణామాలపై బీఆర్‌ఎస్‌ ఇప్పటి వరకూ స్పందించలేదు. ఆ పార్టీ ఎంపీలు మౌనం దాల్చారే తప్ప ఘటనను కనీసం ఖండించలేదు. ఎలాంటి స్పందన వ్యక్తం చేయవద్దని కేసీఆర్ సూచించడంతనే ఎంపీలు సైలెంట్ గా ఉండిపోయారు.  పొగబాంబు ఘటనపై ఒక స్పష్టమైన విధానాన్ని ప్రకటించాల్సి వస్తుందనే కారణంతోనే ఆ పార్టీ అధిష్టానం మిన్నకుండిపోయిందని సమాచారం.

ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బీజేపీతో లడాయి పెట్టుకుంటే అంత కంటే పెద్ద తప్పిదం ఉండదని బీఆర్ఎస్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎన్డీఏలో చేరుతారో లేదో తర్వాత సంగతి ఇప్పటికిప్పుడు పార్టని కాపాడుకోవాలంటే.. తమపైకి రాజకీయ ప్రతీకార చర్యలు ఉండకూడదని అనుకుంటున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ మళ్లీ తెరపైకి వస్తే కవిత ఇబ్బంది పడతారు. కాపాడుకోవడానికి అధికారం కూడా లేదు. మరో వైపు కాంగ్రెస్ విచారణలతో దాడి చేయడానికి రెడీగా ఉంది. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్‌తో పరోక్షంగా అయినా  రాజీ చేసుకుని ముందకెళ్లడమే మంచిదని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. దానిలో భాగంగానే కవిత గ్రౌండ్ ప్రిపేర్ చేస్తూ హిందూత్వ వాదం వినిపిస్తున్నారని అంటున్నారు…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి