గుంటూరు జిల్లాలో అదొక కీలక నియోజకవర్గం. తెలుగుదేశం పార్టీకి అక్కడ అభ్యర్థి ఎవరూ లేక ఓ డమ్మీ క్యాండిడేట్‌ను ఇన్‌చార్జ్‌గా నియమించారు. ఆయన పేరుకు ఇన్‌చార్జ్ అయినా ఎవరినీ పట్టించుకోరు. ఆయన్ను కూడా ఎవరూ పట్టించుకోరు. కాని నియోజకవర్గం పచ్చపార్టీలో తనకు ఎదరు లేదని బిల్డప్ ఇస్తారు ఆ నాయకుడు. ఇన్‌చార్జ్ సమర్థత నమ్మకం కోల్పోయిన చంద్రబాబు మరొకరిని నియమించాలని చూస్తున్నా ఎవరూ ఇష్టపడటంలేదట. ఆ స్థాయిలో పార్టీని డ్యామేజ్ చేసిన ఆ నేత ఎవరో, ఆ నియోజకవర్గం పేరేంటో చూద్దాం.
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో మద్దాలి గిరిధర్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు వైఖరి నచ్చక నెల రోజుల్లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు తన మద్దతు తెలిపారు. దీంతో ఆ నియోజకవర్గంలో టీడీపీకి దిక్కు లేకుండా పోయింది. పార్టీ అనాధగా మారిపోవడంతో కోవెలమూడి రవీంద్రను గుంటూరు పశ్చిమ ఇన్‌చార్జ్‌గా నియమించారు.అయితే ఈ నియామకాన్ని అక్కడి టీడీపీ కేడర్ తీవ్రంగా వ్యతిరేకించింది. కనీసం కార్పోరేటర్ గా కూడా గెలవని వ్యక్తిని ఇన్ చార్జిగా ఎలా నియమిస్తారంటూ పార్టీ సీనియర్ నేతలు ఆగ్రహించారు.
మరికొంతమంది అయితే లోకేష్ డబ్బులు తీసుకుని కోవెలమూడి రవీంద్రకు ఇన్ చార్జి పదవి అప్పగించారని ఆరోపించారు.ఇన్ ఛార్జిగా నియమించగానే కోవెలమూడి రవీంద్ర తీరు మారిపోయింది. పార్టీలో సీనియర్ నేతలను కూడా పట్టించుకోలేదు. కార్యకర్తలతో మాట్లాడే తీరు మారిపోయింది. కోవెలమూడి వ్యవహరిస్తున్న తీరుపై అందరూ మండిపడడం ప్రారంభించారు. ఇదే కాకుండా పార్టీ పదవిని అడ్డం పెట్టుకుని కోవెలమూడి రవీంద్ర తన వ్యాపారాన్ని మాత్రమే అభివృద్ది చేసుకుంటున్నాడని, పార్టీని మాత్రం నిర్వీర్యం చేస్తున్నాడనే విమర్శలు వినిపించాయి.
ఈ నియోజకవర్గంలో జిల్లాలోని కీలక నేతలైన ఆలపాటి రాజేంద్రప్రసాద్, ప్రత్తిపాటి పుల్లారావు, యరపతినేని శ్రీనివాసరావు, జీవీ ఆంజనేయులు, ధూళిపాళ్ల నరేంద్రలకు బలమైన అనుచరవర్గం ఉంది. దీంతో కోవెలమూడిని పార్టీ నేతలే పట్టించుకోవడం మానేశారు. ఇక గుంటూరు మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో సత్తా చూపించుకోవాలని రవీంద్రను చంద్రబాబు ఆదేశించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మొత్తం 26 డివిజన్లు ఉండగా…అతి కష్టం మీద కేవలం ఆరు డివిజన్లులో మాత్రమే టీడీపీని గెలిపించుకోగలిగారు. మిగిలిన సీట్లన్నీ అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఖాతాలో చేరాయి.గుంటూరు వెస్ట్ ఇన్ చార్జిగా ఉన్న కోవెలమూడి రవీంద్ర తన సామాజికవర్గం జనాలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో కార్పోరేటర్ గా నిలబడ్డారు. అక్కడ కూడా అతి కష్టం మీద రవీంద్ర గెలిచారు. .
కార్పోరేషన్ ఎన్నికల తర్వాత చంద్రబాబు కోవెలమూడిని పిలిచి నియోజకవర్గం ఇన్ చార్జిగా పదవి ఇస్తే పట్టుమని పది డివిజన్లు కూడా గెలవలేకపోయావని తిట్టి పంపించారంటూ పార్టీలో ప్రచారం జరుగుతోంది. గుంటూరు కార్పోరేషన్ లో ప్రతిపక్ష నేతగా కూడా తన సమర్థతను నిరూపించుకోలేకపోయారని టీడీపీలోనే రవీంద్ర మీద తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం అవుతోంది. కోవెలమూడి కౌన్సిల్ మీటింగ్ లో వ్యవహరించే తీరుపై టీడీపీ కార్పొరేటర్లే మండిపడుతున్నారు.
కోవెలమూడి రవీంద్ర పనితనం చూసిన చంద్రబాబుకి గుంటూరు వెస్ట్‌లో మరో నేతను చూసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఎవరిని అడిగినా అక్కడ తెలుగుదేశం పార్టీ పరిస్థితి కాస్త ఇబ్బందిగానే ఉంటుందంటున్నారు. ఇటీవల వందకోట్లు ఖర్చుపెట్టగలిగే ఒక నాయకుడికి గుంటూరు వెస్ట్ సీటు ఇస్తామని ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నియోజకవర్గానికి ఇన్ చార్జిగా రావాలన్నా… ఇక్కడనుంచి పోటీ చెయ్యాలన్నా ప్రస్తుత ఇన్ చార్జి కోవెలమూడి రవీంద్ర పార్టీకి చేసిన డ్యామేజ్ తో ఇతర నేతలు బెంబేలెత్తిపోతున్నారు…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…