అసెంబ్లీ ఎన్నికలు బీఆర్ఎస్ ను చావుదెబ్బ కొట్టాయి. సింగరేణి గుర్తింపు యూనియన్ ఎన్నికలు అంతకంటే బలమైన ప్రశ్నలను ఆవిష్కరించాయి. ఈ సారి సింగరేణి ఎన్నికల్లో బీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ….టిబిజీకెఎస్…. నామ మాత్ర ఓట్లు కూడా సాధించలేని దుస్థితిలోకి వెళ్లిపోయింది. ఈ తప్పు ముమ్మాటికీ కల్వకుంట్ల కవితదేనన్న చర్చ మొదలైంది. అనవసరంగా పోటీకి దిగి పరువు పోగొట్టుకున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో కవిత తనను తాను వీక్ చేసుకోవడమే కాకుండా బీఆర్ఎస్ ను కూడా బలహీనపరిచారని చెప్పుకోవాల్సి ఉంటుంది. తన రాజకీయ ప్రస్థానంలో డౌంట్ ట్రెండ్ తారా స్థాయికి చేరిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి….
నిజానికి బీఆర్ఎస్ ను ఫ్యామిలీ పార్టీగా మార్చడంలో కవిత పాత్ర చాలా ఎక్కువేనని చెప్పాలి. పార్టీ వరుస ఓటముల్లో కూడా ఆమె తప్పిదాలు, వైఫల్యాలే ఎవరికైనా కనిపిస్తాయి..అవసరానికి మించి మాట్లాటడం ప్రతీ దానిలో జోక్యం చేసుకోవడం ఆమెకు బాగా అలవాటైపోయిందని కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చివరకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుని పార్టీ పరువు గోదాట్లో కలిపేశారు.
మలిదశ తెలంగాణ ఉద్యమంలోకి కవిత లేటుగా వచ్చినప్పటికీ లేటెస్టుగా మారిన సందర్భం ఉంది. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ ఉద్యమానికి ఊతమిచ్చే చర్యలను ఆమె చేపట్టినప్పుడు మంచిపనే చేస్తున్నారన్న సంతృప్తి జనంలో ఉండేది. కొంతకాలం పాటు తెలంగాణ బతుకమ్మగా ఆమె పేరు స్థిరపడిపోయింది. తెలంగాణ జాగృతి పేరుతో ఆమె చేపట్టిన కార్యక్రమాలు ప్రజలను సంఘటితం చేసేందుకు కూడా కొంతమేర ఉపయోగపడ్డాయి. కేసీఆర్ కుటుంబంలో నలుగురైదుగురు రాజకీయాల్లో ఉన్నప్పటికీ 2006 నుంచి కవిత తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు…కేసీఆర్ కూతురిగా ఉన్న కరిష్మాను వాడుకుంటూ ఆమె తెరవెనుక రాజకీయాలు చేసి ఉంటే బాగానే ఉండేది. మంచి సబ్జెక్టు నాలెడ్జ్ తో , మూడు నాలుగు భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగే సమర్థతతో నెగ్గుకు రాగల తెలివితేటలను ప్రజాప్రయోజనానికి వాడి ఉంటే సరిపోయేది.ఆమె అలా చేయలేదు. ఏదో సాధించాలనుకున్నారు. పోలిటికల్ యాంబిషన్ ఆమెను దెబ్బకొట్టిందని చెప్పక తప్పదు.
2014లో కవిత నిజామాబాద్ ఎంపీగా గెలిచారు. ఒక కెరటంలా దూసుకెళ్లారన్న ఫీలింగు ఉంది. తర్వాతి కాలంలో రాజకీయాలు మారిపోయాయి. అన్ని పార్టీలకు బీఆర్ఎస్ టార్గెట్ అయ్యింది. కేసీఆర్ కుటుంబంపై సరికొత్త ఆరోపణలు వచ్చాయి. పసుపు బోర్డు గానీ, మరే సమస్య గానీ పరిష్కారానికి నోచుకోలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజాసమస్యలపై దృష్టిపెట్టి వాటిని పరిష్కరించాల్సిన కవిత ఆ దిశగా అడుగులు వేయలేదు. దానితో 2019 లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్ లోనే ఓడిపోయారు. ఐనా రాజకీయాలకు దూరం జరగకుండా కంటిన్యూ చేశారు. అందులో తప్పేమీ లేదనుకోండి. డబ్బుల కోసం తనది కాని ఢిల్లీలో కూడా ఆమె తలదూర్చారు. లిక్కర్ స్కాంలో అడ్డంగా బుక్కయ్యారు.వంద కోట్లు ఆమెకు అందాయన్న ఆరోపణకు సమాధానం చెప్పలేక నానా తంటాలు పడుతున్నారు. ఎప్పుడు ఆమెను అరెస్టు చేస్తారోనన్న భయం బీఆర్ఎస్ వర్గాలను వెంటాడుతోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం బీఆర్ఎస్ పార్టీకి యాంటీ క్లైమాక్స్ గా చెప్పాలి. అంతలోనే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు వచ్చాయి. ఈసారికి వద్దనుకుంటే బావుండేది.తాము కూడా బరిలోకి దిగుతున్నామని బీఆర్ఎస్ ప్రకటించింది. ఇప్పుడు పూర్తి స్థాయిలో అభాసుపాలైంది. ఈసారి ఎన్నికల్లో టిబిజీకెఎస్ కు ఒకటి రెండు ఓట్లు కూడా రాలేదు. ఇల్లెందులో ఒకటి మాత్రమే సాధించింది. బెల్లంపల్లి డివిజన్ లో మూడు ఓట్లు మాత్రమే వచ్చాయి. 11 డివిజన్లలో మొత్తం ఓట్ల సంఖ్య 39, 773 ఉండగా వీరు సాధించిన ఓట్లు 1298 మాత్రమే.నిజానికి ఈ సంస్థ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఉద్యమ సంస్థగా పుట్టింది. 2012లో రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఒకసారి, మళ్ళీ 2017 లో రెండోసారి అత్యధిక డివిజన్లలో గెలిచి గుర్తింపు సంఘంగా పని చేసింది.ఇప్పుడు మాత్రం సీన్ సితారైంది.
ఇదీ కార్మిక ఓటమా..కవిత ఓటమా అంటే ముమ్మాటికి కల్వకుంట్ల వారమ్మాయి ఓటమేనని చెప్పాల్సి వస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు ప్రతీ దానిలో జోక్యం చేసుకుని, ప్రతీ యూనియన్లో తానే నాయకురాలిగా ఉండాలని కోరుకుని ఇప్పుడు కష్టాలు కొనితెచ్చుకున్నారు. నేల విడిచి సాము చేయాలన్న ప్రయత్నమే సింగరేణి ఓటమికి కారణమని విశ్లేషించాల్సి వస్తోంది.మరి ఈ అనుభవంతోనైనా కొంతకాలం మౌనంగా ఉంటారా.నిజమాబాద్ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తారా అన్నది వేచి చూడాలి. ఏదైనా అంతా కవిత ఇష్టమేగా….
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…