ఆ సీటు ఎవరికో..?

By KTV Telugu On 2 January, 2024
image

KTV TELUGU :-

లోక్ సభ ఎన్నికలపై పార్టీలు అప్పుడే దృష్టి పెట్టాయి.  అసెంబ్లీ ఫలితాలతో సంబంధం లేకుండా కొత్త ఊపుతో పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు తెలంగాణ పార్టీలు  సిద్ధమవుతున్నాయి. గత ఎన్నికల్లో నాలుగు స్థానాలు గెలుచుకున్న బీజేపీ, ఈ సారి పది, పదకొండు చోట్ల గెలవాలనుకుంటోంది. ఈ క్రమంలో మల్కాజ్ గిరి నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. దానితో  అరడజను మంది ఆశావహులు పుట్టుకొచ్చారు…..

మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గం. దేశంలోని అతిపెద్ద లోక్‌సభ నియోజకవర్గాల్లో ఒకటి. సుమారు 35లక్షల మంది ఓటర్లు మల్కాజ్‌గిరి పార్లమెంట్ లో ఉన్నారు. మినీ ఇండియాగా మల్కాజ్‌గిరిని పిలుస్తారు. 3వేలకు పైగా పోలింగ్ బూత్ మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో ఉన్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల వారు మల్కాజ్‌గిరిలో నివాసముంటారు. దక్షిణంతో పాటు.. ఉత్తర భారతానికి చెందిన ప్రజలు ఉండే నియోజకవర్గంలో పట్టు సాధించాలంటే అంతసులువైన పనేం కాదు. అలాంటి మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గంపై బీజేపీలో అరడజను మంది ఆశలు పెట్టుకున్నారట. రానున్న లోకసభ ఎన్నికల‌్లో టికెట్ కోసం జాతీయ స్థాయిలో పైరవీలు ఈపాటికే మెదలయ్యాయి.

అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలైంది. ఒక దశలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందని అనుకున్నారు. అందుకు భిన్నంగా బాగా దిగజారింది. ఐనా తుది ఫలితాలు మాత్రం కమలానికి ఊరట నిచ్చాయనే చెప్పాలి.  గత ఎన్నికల్లో కేవలం ఒక స్థానంలో గెలిచిన కమలం ఈ సారి ఏకంగా ఎనిమిది నియోజకవర్గాల్లో విజయకేతనం ఎగురవేసింది. 14 శాతం ఓట్ షేర్ సాధించింది. పార్టీ హేమాహేమీలైన ఈటల రాజేందర్,బండి సంజయ్, రఘునందన్ రావు ఓడిపోవడం వేరే విషయం. అయితే అసెంబ్లీ  ఫలితాన్ని పక్కన పెట్టి బీజేపీ ఇప్పుడు  లోక్ సభ వైపుకు చూస్తోంది..

మల్కాజ్ గిరిలో గెలిస్తే బీజేపీ ఆశించిన పది స్థానాలు వస్తాయని నమ్మకంగా ఉన్నారు.పైగా  అక్కడ గెలిచే అవకాశాలు కూడా పెరిగాయట. అందుకే హుజురాబాద్ అసెంబ్లీలో ఓడిపోయిన మాజీ మంత్రి ఈటల ఇప్పుడు మల్కాజ్ గిరిపై ఆశలు పెట్టుకున్నారు. ఈ దిశగా జాతీయ నాయకత్వం దగ్గర ప్రతిపాదన పెట్టారు. మరోవైపు  సీనియర్ నేత,  మాజీ ఎంపీ చాడా సురేష్ రెడ్డి సైతం టికెట్ ఆశిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి‌..‌ 1998, 99లో వరుసగా హన్మకొండ నుంచి రెండు సార్లు ఎంపీగా చాడా సురేష్ రెడ్డి గెలిచారు.   బండి సంజయ్ హాయాంలో చాడా సురేష్ రెడ్డి బీజేపీలో చేరారు.  ప్రజా సంగ్రామ యాత్రలో చాడా సురేష్ రెడ్డి కీలకంగా పనిచేశారు. రాజ్యసభ మాజీ సభ్యుడు, సీనియర్ నేత గరికపాటి మోహనరావు తో కలిసి బీజేపీలో చేరిన చాడా సురేష్ రెడ్డి చాలా కాలంగా మల్కాజ్‌గిరిలో  పర్యటిస్తూ బలం  పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ‌ మరోవైపు  మధ్యప్రదేశ్ బీజేపీ ఇన్చార్జ్ మురళీధరరావు సైతం మల్కాజ్‌గిరి టికెట్ ఆశిస్తున్నారు. బీజేపీ  జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన అనుభవం మురళీదరరావుకు ఉంది.  నియోజకవర్గంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ నిత్యం ప్రజల మధ్య ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ కూడా మల్కాజ్‌గిరి పార్లమెంట్ రేసులో ఉన్నారట. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ నుంచి పోటీచేసి కూన శ్రీశైలం గౌడ్ ఓటమి చెందారు. అయితే మల్కాజ్‌గిరి పార్లమెంట్ పరిధిలో‌ని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని బీజేపీ అభ్యర్థుల్లో అందరి కంటే కూన శ్రీశైలం గౌడ్ కు ఎక్కువ ఓట్లు వచ్చాయి. కుత్బుల్లాపూర్ నుంచి పోటీచేసిన శ్రీశైలం గౌడ్ కు ఒక లక్ష 2వేల ఓట్లు వచ్చాయి. బీసీ గౌడ సామాజికవర్గం కావటం కూనకు కలసొచ్చే అంశం. ఇదే సమయంలో బీజేపీ సీనియర్ నేత రామచంద్రరావు సైతం మల్కాజ్‌గిరి పార్లమెంట్ ఆశావాహుల జాబితాలో ఉన్నారు. ఇక  కాంగ్రెస్ నుంచి  మైనంపల్లి హన్మంతరావు పోటీ చేస్తారని తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన మల్కాజ్ గిరి అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. బీఆర్ఎస్ నుంచి ఎవరు పోటీ చేస్తారో తెలీదు. అటు వైపు నుంచి ఇంకా చర్చలు ఊపందుకోలేదు..

మల్కాజ్ గిరి నియోజకవర్గం  టికెట్ పెద్ద పంచాయతే  అవుతుంది.  బీజేపీకి శిరోభాగం కావడం ఖాయంగా కనిపిస్తోంది. మల్కాజ్ గిరి ప్రస్తుతం కాంగ్రెస్ ఖాతాలో ఉంది. ఆ  నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న  రేవంత్ రెడ్డి సీఎం కావడంతో పది రోజుల క్రితం రాజీనామా చేశారు. అయితే గత ఎన్నికలు వేరు, ఈ సారి పరిస్థితులు వేరని బీజేపీ అంటోంది. మల్కాజ్ గిరిలోని కొన్ని  కాలనీల్లో ఏకమొత్తంగా ఓట్లు తమకే పడతాయని కమలం పార్టీ విశ్వసిస్తోంది. అదే గెలుపుకు పునాది అవుతుందని ఎదురుచూస్తున్నారు.  ఏం జరుగుతుందో చూడాలి…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి