ష‌ర్మిల కార్డ్

By KTV Telugu On 2 January, 2024
image

KTV TELUGU :-

ఆంధ్ర ప్ర‌దేశ్ రాజ‌కీయాలు ఊహించ‌ని మలుపు తిరుగుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. పాల‌క వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ఒంట‌రిగా ఎన్నిక‌ల పోరుకు స‌న్న‌ద్ధం అవుతోంటే ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన తెలుగుదేశం పార్టీ జ‌న‌సేన‌తో పాటు మ‌రి కొన్ని పార్టీల‌తో పొత్తుతో ముందుకు క‌ద‌ల‌డానికి  స‌మాయ‌త్తం అవుతోంది. ఏపీలో అస్తిత్వం కోసం ఆరాట ప‌డుతోన్న  కాంగ్రెస్ పార్టీ కొత్త ఆలోచ‌న‌ల‌తో ఉన్న‌ట్లు  రాజ‌కీయ ప‌రిశీల‌కులు చెబుతున్నారు.ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభ‌వం తీసుకురాడానికి మాస్ట‌ర్ ప్లాన్  సిద్ధం చేసుకుంటోంది కాంగ్రెస్.ఒక‌ప్పుడు ఉమ్మ‌డి ఏపీలో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని విజ‌యాలు సాధించి పెట్టిన దివంగ‌త ముఖ్య‌మంత్రి వై.ఎస్.రాజ‌శేఖ‌ర రెడ్డి గారాల ప‌ట్టి వై.ఎస్. షర్మిల కు ఏపీ కాంగ్రెస్ బాధ్య‌త‌లు అప్ప‌గించే ఆలోచ‌న‌లో కాంగ్రెస్ ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

నిజానికి కొద్ది వారాల క్రితం జ‌రిగిన తెలంగాణా ఎన్నిక‌లకు చాలా కాలం క్రిత‌మే కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ,రాహుల్ గాంధీల‌తో హ‌స్తిన‌లో భేటీ అయ్యారు ష‌ర్మిల‌. తెలంగాణా ఎన్నిక‌ల్లోనే ష‌ర్మిల పాలేరు నియోజ‌క వ‌ర్గం నుంచి పోటీ చేస్తార‌న్న ప్ర‌చారం జ‌రిగింది. అయితే ష‌ర్మిల తెలంగాణా లో పోటీ చేస్తే బి.ఆర్.ఎస్.  దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకునే అవ‌కాశం ఉంద‌ని అపుడు కాంగ్రెస్ పార్టీ న‌ష్ట‌పోవ‌ల‌సి వ‌స్తుంద‌ని తెలంగాణా కాంగ్రెస్ నేత‌లు అభ్యంత‌రాలు వ్య‌క్తం చేశారు. సాక్షాత్తూ పిసిసి  ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ..ష‌ర్మిల చేరిక‌ను అడ్డుకున్న‌ట్లు  స‌మాచారం.  దాంతో ష‌ర్మిల  తెలంగాణా ఎన్నిక‌ల‌కు దూరంగా ఉన్నారు.కేవ‌లం కాంగ్రెస్ పార్టీకి మ‌ద్ద‌తు ఇచ్చి ఊరుకున్నారు.దాంతో ఆమె పెట్టిన వై.ఎస్.ఆర్.తెలంగాణా పార్టీ నేత‌లు సైతం ఆమెపై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించారు. త‌మ‌ని ముంచార‌ని ష‌ర్మిల‌ను దుయ్య‌బ‌ట్టారు.

అయితే  ఆ త‌ర్వాత ష‌ర్మిలను ఏపీ కాంగ్రెస్ లో చేర్చుకుని ఏపీలో పార్టీ బ‌లోపేతం చేసే బాధ్య‌త‌లు అప్ప‌గిస్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది.ఇపుడు తాజాగా అదే ప్ర‌చారం ఊపందుకుంది. వై.ఎస్.ష‌ర్మిల‌ను ఏకంగా ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలిగా చేసే అవ‌కాశాలు ఉన్నాయ‌ని కూడా ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌స్తుత ఏపీ పిసిసి అధ్య‌క్షుడు గిడుగు రుద్ర‌రాజు  కూడా వై.ఎస్.ష‌ర్మిల  ను చేర్చుకుంటే ఏపీ కాంగ్రెస్ నేత‌లంతా స్వాగ‌తిస్తార‌ని అన్నారు. ఆమెకు ఏ ప‌ద‌విని ఇచ్చినా తాము మ‌ద్ద‌తు ఇస్తామ‌న్నారు. ఇక ఈ ప్ర‌చారం మొద‌లు కాగానే  ఏపీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన తెలుగుదేశం పార్టీలో  ఒక‌ర‌క‌మైన ఆనందం వ‌చ్చింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో  టిడిపి -జ‌న‌సేన కూట‌మి అధికారంలోకి రావ‌డానికి చాలా క‌ష్ట‌ప‌డాల‌ని భావిస్తోన్న టిడిపి  ష‌ర్మిల ఎంట్రీ ఇస్తే అది త‌మ‌కే మంచిద‌ని భావిస్తోంది.

తెలుగుదేశం పార్టీ ఆనందానికి  కార‌ణాలు లేక‌పోలేదు. టిడిపి నేత‌ల  అంచ‌నా ఏంటంటే.. వై.ఎస్. ష‌ర్మిల కాంగ్రెస్ ప‌గ్గాలు చేప‌డితే.. అది వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకి స‌మ‌స్యే అవుతుందంటున్నారు టిడిపి నేత‌లు. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అధినేత ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి వ్య‌తిరేకంగా ఆయ‌న సోద‌రి ష‌ర్మిలే  ఎన్నిక‌ల ప్ర‌చారం చేస్తే అది వైసీపీకి పెద్ద త‌ల‌నొప్పే అవుతుందంటున్నారు. అదీ కాకుండా ష‌ర్మిల కాంగ్రెస్ పార్టీ సార‌ధ్యం వ‌హిస్తే వైసీపీలో ఉన్న  చాలా మంది కాంగ్రెస్ నేత‌లు..ప్ర‌త్యేకించి టికెట్లు రాని వారు కాంగ్రెస్ లో చేర‌తార‌ని.. అపుడు వైసీపీ ఓటు బ్యాంకు నిలువునా చీలుతుంద‌ని టిడిపి లెక్క‌లు వేసుకుంటోంది. అదే జ‌రిగితే  అది టిడిపి జ‌న‌సేన కూట‌మికి  అయాచిత వ‌ర‌మే అవుతుంద‌ని అనుకుంటున్నారు.

వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నాయ‌క‌త్వం మ‌రోలా ఆలోచిస్తోంది. ఒక వేళ ష‌ర్మిల కాంగ్రెస్ ప‌గ్గాలు చేప‌డితే.. ఆమె విస్తృతంగా  ప్ర‌చారం చేస్తే  ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు ఏమ‌న్నా ఉంటే  అది అడ్డంగా చీలిపోతుంద‌ని.. అది టిడిపి-జ‌న‌సేన కూట‌మికే న‌ష్ట‌మ‌ని వైసీపీ  ధీమా వ్య‌క్తం చేస్తోంది. ష‌ర్మిల రంగంలో ఉంటే వైనాట్ 175 అన్న జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  నినాదం నిజంగానే నిజం అయ్యే అవ‌కాశాలు ఉంటాయ‌ని  వైసీపీ భావిస్తోంది. నాలుగున్న‌రేళ్లుగా  జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం అమ‌లు చేస్తోన్న  ప‌థ‌కాలే వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకి  వెయ్యేనుగుల బ‌లాన్ని అందిస్తాయ‌ని ఆ పార్టీ నేత‌లు న‌మ్ముతున్నారు. వైసీపీ నాయ‌క‌త్వం టికెట్ ఇవ్వ‌ని నేత‌లు కాంగ్రెస్ లో కానీ టిడిపిలో కానీ చేరినా న‌ష్టం లేద‌ని వారు అంటున్నారు. వైసీపీలో ఉన్న‌ప్పుడే గెల‌వ‌లేని నేత‌లు ఇత‌ర పార్టీల‌కు వ‌ల‌స‌పోయి ఎలా గెలుస్తార‌ని వారు నిల‌దీస్తున్నారు.

వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ  తిరుగులేనంత‌గా బ‌లంగా ఉండ‌బ‌ట్టే విప‌క్షాలు వివిధ ర‌కాలుగా కుట్ర‌లు ప‌న్నాల్సి వ‌స్తోంద‌ని.. 40ఏళ్ల సీనియ‌ర్ ని అని చెప్పుకునే చంద్ర‌బాబు నాయుడు దొరికిన పార్టీల‌న్నింటితోనూ పొత్తులు పెట్టుకోవ‌ల‌సి వ‌స్తోందంటేనే విప‌క్షాలు ఎంత బ‌ల‌హీనంగా ఉన్నాయో అర్ధం చేసుకోవ‌చ్చున‌న్న‌ది  వైసీపీ నేత‌ల వాద‌న‌. కొద్ది రోజుల క్రితం చంద్ర‌బాబు నాయుడు క‌ర్నాట‌క ఉప ముఖ్య‌మంత్రి అయిన కాంగ్రెస్ నేత డి.కె.శివ‌కుమార్ ను విమానాశ్ర‌యంలో  క‌లిసిన‌పుడు ఇద్ద‌రూ ఏకాంతంగా కొద్ది సేపు చ‌ర్చించుకోవ‌డం రాజ‌కీయ ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. చంద్ర‌బాబు నాయుడు ప‌రోక్షంగా కాంగ్రెస్ తో కూడా అవ‌గాహ‌న కుదుర్చుకుంటున్నారేమో అన్న అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు రాజ‌కీయ పండితులు…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి