మిషన్ 2024 – ఆంధ్రా ప్యారిస్ లో నాదెండ్ల గెలిచేనా ?

By KTV Telugu On 2 January, 2024
image

KTV  TELUGU :-

విద్యాధికులు, సంస్కారవంతులు, దేనికైనా పోటీ పడేవారు, సాంస్కృతికంగా  ముందుండాలని కోరుకునే వారు .. ఎక్కువమంది ఉండే ఆంధ్రా ప్యారిస్ తెనాలిలో  ఈసారి జయకేతనం ఎగురవేసేదెవ్వరన్న చర్చ మొదలైంది. వైసీపీ  ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పట్ల జనంలో  వ్యతిరేకత పెరిగిపోతుండగా ఆయన గెలుపు కష్టమేనన్న చర్చ జరుగుతోంది. టీడీపీ- జనసేన పొత్తులో భాగంగా  మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ బరిలోకి దిగుతారని ప్రచారం జరుగుతోంది..

తెనాలి నియోజకవర్గంలో దాదాపు రెండున్నర లక్షల ఓట్లున్నాయి. అక్కడ కమ్మ సామాజిక వర్గం డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. ఆ సామాజికవర్గం వారే అక్కడ గెలుస్తుంటారు. ప్రస్తుత ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ కూడా అదే కులానికి చెందిన నాయకుడు. 1983  నుంచి 1989 వరకు తెనాలి ఎమ్మెల్యేగా పనిచేసిన అన్నాబత్తుని సత్యనారాయణ కుమారుడే శివకుమార్. తొలుత టీడీపీలో ఉన్న శివకుమార్ తర్వాత వైసీపీలో చేరి 2014లో తెనాలి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019లో మాత్రం గెలిచారు. రెండు ఎన్నికల్లోనూ ఆయన  ప్రత్యర్థి టీడీపీకి చెందిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అలియాస్ రాజా అని మరిచిపోకూడదు. 2014లో గెలిచిన ఆలపాటి రాజా 2019లో ఓడిపోయిన తర్వాత నియోజకవర్గం మార్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఈ సారి ఆయన గుంటూరు వెస్ట్ పై దృష్టి పెట్టారు. ప్రస్తుతం జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షుడిగా ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ రెండు సార్లు తెనాలి  నుంచి గెలిచారు. ఆయన తెలుగుదేశం వ్యవస్థాపక సభ్యుడు మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల  భాస్కర్ రావు కుమారుడైనప్పటికీ కాంగ్రెస్  పార్టీలో రాణించారు. తర్వాతి కాలంలో జనసేనలో చేరి కీలక పదవిని పొందారు. ప్రస్తుతానికి ఆయన పార్టీలో నెంబర్ త్రీ అని  చెప్పుకోవచ్చు….

టీడీపీ, జనసేన పొత్తు ఖరారవుతున్నప్పుడే ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే తెనాలి నియోజకవర్గం  నుంచి ఎవరు  పోటీ చేస్తారన్న చర్చ మొదలైంది. అయితే అలాంటి వివాదాలకు తెరదించుతూ మనోహర్ ను సమర్థించాలని జనసేన కేడర్ కు పవన్ కల్యాణ్ నూరిపోశారు. అయితే అధికారిక ప్రకటన వచ్చే వరకు టెన్షన్  తప్పదని ఒక వర్గం వాదిస్తోంది. చాలా కాలం పాటు తెనాలిపై ఆశలు పెట్టుకున్న ఆలపాటి  రాజా మాత్రం ఇప్పుడు అటు వైపు చూడటం లేదు.

నిజానికి గత ఎన్నికల్లోనే ఆలపాటి గెలవాల్సి ఉంది. టీడీపీ – జనసేన  విడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలి ఆ పని జరగలేదు. రెండు పార్టీలకు కలిపి వైసీపీ  కంటే 20 వేలకు పైగా ఓట్లు అధికంగా  వచ్చాయి. ఈ సారి అలాంటి పొరబాటు జరగకుండా పొత్తు పెట్టుకున్నారు. దానితో మనోహర్ కు టికెట్  ఖాయమని నిర్ణయించుకున్న ఆలపాటి రాజా  గుట్టుచప్పుడు కాకుండా గుంటూరు వెస్టులో పనిచేసుకుపోతున్నారు. అందుకు పార్టీ అధినేత చంద్రబాబు ఆశీస్సులు, యువనేత నారా  లోకేష్ మద్దతు కూడా ఉందని చెప్పుకోవాల్సిందే. గుంటూరు వెస్ట్ లో ఏ కార్యక్రమం జరిగినా ఆలపాటి రాజా కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో గుంటూరు పశ్చిమం నుంచి గెలిచిన మద్దాల గిరి తర్వాత వైసీపీలోకి వెళ్లిపోయారు. దానితో టీడీపీకి అక్కడ సరైన నాయకుడు లేరని గ్రహించి ఆలపాటి రాజా అక్కడ  కర్ఛిప్ వేస్తున్నారు.  మరో పక్క రెండు సార్లు తెనాలి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన నాదెండ్ల మనోహర్ కు అక్కడి ప్రజల్లో మంచి ఫాలోయింగే ఉంది. గత ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం కారణంగా జనసేన అభ్యర్థిగా మూడో స్థానానికి పడిపోయిన నాదెండ్ల పట్ల ప్రస్తుతం తెనాలి నియోజకవర్గం ఓటర్లలో సానుభూతి ఉంది. రాష్ట్ర స్థాయిలో జనసేన మీటింగుల్లో పాల్గొంటూనే… మరో పక్క తెనాలి నియోజకవర్గం పరిధిలో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. అన్నదాతల కన్నీరు తుడవటమే తన ధ్యేయమని ఆయన చెప్పుకుంటున్నారు. రోడ్లు గుంతలు పడి తెనాలి నియోజకవర్గం ప్రజలు నానా తంటాలు పడుతున్నారని.. అధికారానికి  రాగానే  తొలి ప్రాధాన్యంగా గుంతలు పూడ్చేపని చేపడతామని చెప్పారు. పంటకాలువలకు పూడికలు తీయించడం, కౌలు రైతులను ఆదుకోవడం లాంటి చర్యలు తమ అజెండాలో ఉందని నాదెండ్ల మనోహర్  చెప్పుకున్నారు.

నాదెండ్ల మనోహర్ అంటే పవన్ కల్యాణ్ కు ప్రత్యేకమైన అభిమానం. ఆయన  పోటీ చేస్తే ఒకటి రెండు సార్లు ప్రచారానికి వచ్చేందుకు కూడా ఆయన సిద్ధంగా ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కీలక నేతగా టీడీపీ అధినేత చంద్రబాబుకు కూడా ఆయనంటే గౌరవమే. అందుకే ఇప్పుడు నాదెండ్ల గెలుపు సాధ్యమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి