అనకాపల్లి టిడిపిలో సీట్ల పోరు

By KTV Telugu On 2 January, 2024
image

KTV TELUGU :-

ఉత్తరాంధ్రలోని  అనకాపల్లి జిల్లాలో  వచ్చే ఎన్నికల్లో సీట్ల విషయంలో తెలుగుదేశంలో నేతల మధ్య కీచులాటలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఒకే నియోజక వర్గంకోసం ఇద్దరు ముగ్గురు నేతలు రుమాళ్లు వేసుకుంటున్నారు. పార్టీకోసం కష్టపడి పనిచేసిన వారిని కాదని నాయకత్వం డబ్బులు ఉన్నవారికే టికెట్లు ఇస్తే తామే దగ్గరుండి ఓడిస్తామని కొందరు తెలుగు తమ్ముళ్లు అల్టిమేటాలు ఇస్తున్నారు.గత ఎన్నికల్లో ఘోర పరాజయాలు మూటకట్టుకున్న నేతలు వచ్చే ఎన్నికల్లో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నారు. అయితే ఈ సారి అభ్యర్ధుల ఎంపికలో పార్టీకి విధేయంగా ఉన్న వారిని కాకుండా కొత్త వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని పార్టీ వర్గాల్లో గుస గుసలు వినపడుతున్నాయి.

అనకాపల్లి ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల కోసం టిడిపి నాయకుల పోరు కొనసాగుతోంది. పోటీ చేసేది నేనే అంటూ ఎవరికి వారే అనకాపల్లి ఎంపీ, ఎమ్మెల్యే సీట్ల మీద ఖర్చీఫ్‌లు వేసుకుంటున్నారు. అనకాపల్లి ఎమ్మెల్యే సీటును మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ఆశిస్తున్నారు. ఇదే సమయంలో జిల్లా టిడిపి అధ్యక్షుడు బుద్ధా నాగ జగదీశ్వరరావు కూడా అసెంబ్లీ సీటు కోరుతున్నారు. ఇద్దరు నాయకులు గ్రూపుటు కట్టి ప్రతిసారి వీధిన పడుతున్నారు. గతంలో కూడా పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలను వేరువేరుగా నిర్వహించేవారు.

ఈ రెండు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. ఇద్దరూ సమన్వయంతో పని చేసుకోవాలని పార్టీ అగ్రనేతలు చంద్రబాబు, లోకేష్ చెప్పినా ఎవరిదారి వారిదే. చంద్రబాబు అనకాపల్లి పర్యటనకు వచ్చిన సందర్భంలోనూ ఇద్దరు నాయకులు ఆయన ముందు బల ప్రదర్శనకు దిగారు.

ఆరు నెలల క్రితం అనకాపల్లి వచ్చిన చంద్రబాబు మీటింగ్ ముగించుకుని వెళ్లిన తర్వాత మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా నాగ జగదీష్ వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.

లోకేష్ పాదయాత్ర సందర్భంగా కూడా ఈ రెండు వర్గాల ఆధిపత్య పోరు మరోసారి బయటపడింది. ఫ్లెక్సీల ఏర్పాటు విషయంలో రెండు వర్గాలు గొడవకు దిగాయి. ఇద్దరు నేతలు మధ్య విభేదాలపై పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆగ్రహం వ్యక్తమైంది. చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా ఇంకోసారి వీళ్లిద్దరి వ్యవహారాన్ని జిల్లా నాయకులు తీసుకువెళ్లారు. అయితే అనకాపల్లి నియోజకవర్గ ఇన్చార్జి ఎవరో వెంటనే తేల్చాలని స్థానిక నేతలు అధిష్టానాన్ని డిమాండ్ చేస్తున్నారు.

ఎమ్మెల్యే సీటు సంగతి పక్కన పెడితే ఎంపీ అభ్యర్థి పరిస్థితి కూడా ఇదే రకంగా ఉంది. ఇప్పటికే అనకాపల్లి ఎంపీ అభ్యర్ధిని అని చెప్పుకుంటూ గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన బైరా దిలీప్ చక్రవర్తి తిరుగుతున్నారు. మరోవైపు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ ఎప్పటినుంచో అనకాపల్లి ఎంపీ సీటు ఆశిస్తున్నారు. ఇటీవల కాలంలో ఆడారి కిషోర్ కుమార్ టిడిపి తరఫున ఎంపీ అభ్యర్థిని నేనే అంటూ మీడియా ప్రతినిధులతో విందు రాజకీయాలు చేస్తున్నారు. అయ్యన్న పాత్రుడు మాత్రం తన కుమారుడు విజయ్‌కి ఎంపీ సీటు ఇవ్వకపోయినా పరవాలేదు కానీ వేరే ఎవరికి ఇచ్చినా స్థానిక నేతకే ఇవ్వాలని టిడిపి అధిష్టానాన్ని డిమాండ్ చేస్తున్నారు.

ఆడారి కిషోర్ కుమార్ మాత్రం యూత్ కోటాలో తనకు సీటు వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.అనకాపల్లి ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో ఎవరికి వారు గ్రూపులుగా విడిపోయి పార్టీని భూస్థాపితం చేస్తున్నారని కార్యకర్తలు మండిపడుతున్నారు. ఇప్పటికే జిల్లాలో పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని, నాయకులు ఇదే విధంగా రోడ్డున పడి కొట్లాటలకు దిగితే ఎక్కితే వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావని హెచ్చరిస్తున్నారు…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి